సాక్షి, కరీంనగర్: కరోనా మహమ్మారి నిన్నమొన్నటి వరకు తగ్గినట్లే తగ్గి మరోమారి ఆందోళనలో పడేస్తోంది. ప్రజలు కరోనాను మరిచిపోతున్నట్లు కనిపిస్తున్నా ఇదంతా తాత్కాలికమే అన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని సంబరపడే లోపే థర్డ్ వేవ్ ఆనవాళ్లు అప్పుడే కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. జిల్లాలో కరోనా కేసులు మరో మారు ముంచుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది.
రాబోయే రోజుల్లో కేసుల తీవ్రత మరింత పెరగవచ్చని వైద్యారోగ్యశాఖ నిపుణులు హెచ్చరిన్నారు. జిల్లాలో థర్డ్‌వేవ్ ప్రమాదం కనిపించకపోయినప్పటికీ రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కరోనా ముప్పు తొలగిపోయిందనే భావనతో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జూలై నెల మొదటి వారం నుంచి కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టగా మళ్లీ విజృంభణ కొనసాగుతోంది.
ప్రజలు ఇష్టానుసారంగా తిరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫంక్షన్లు, రాజకీయ కార్యక్రమాలు, అంత్యక్రియలు, బోనాలు తదితర కార్యక్రమాలకు వెళ్తుండడం, మాస్కులు ధరించకపోవడం వంటి కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా తగ్గిన కారణంగా షాపింగ్ మాల్స్, సూపర్‌బజార్లు, జ్యూవెల్లరీ, వస్త్ర దుకాణాలు, కిరాణ దుకాణాల వద్ద ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్క్‌లు ధరించకుండా తిరగడం వ్యాధి వ్యాప్తికి కారణమవుతోంది.
నిర్ధారణ పరీక్షల పెంపుతో..
జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షల పెంపుతో కేసుల సంఖ్య బయటపడుతోంది. జిల్లాలోని 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గతంలో అరకొరగా ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు చేయగా నిర్ధారణ పరీక్షల కోసం జనం రెండు మూడు రోజులపాటు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ప్రస్తుతం పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఎక్కడికక్కడ నిర్ధారణ పరీక్షలు పెంచారు. అవసరమైతే కేసులు ఎక్కువ ఉన్న చోట క్షేత్రస్థాయిలో నిర్ధారణ పరీక్షలు చేస్తూ పాజిటివ్‌లను గుర్తిస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
స్వీయ నియంత్రణ కరువు
కరోనా ప్రారంభంలో ప్రజలు మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటిస్తూ వ్యాప్తిని కొంత మేర అడ్డుకున్నారు. సెకండ్‌వేవ్ ప్రారంభంలో కూడా నియంత్రణ చర్యలు పాటించగా.. కరోనా తగ్గిందనే భావనతో ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. సాధారణ రోజుల మాదిరిగానే వ్యవహరిస్తుండడంతో కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతోంది.
టెస్టులు చేయించుకోవాలి..
జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఒకే జ్వరం వచ్చి తగ్గిందనే నిర్లక్ష్యంగా ఉండకుండా కరోనా టెస్టు చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌లో ఉండి ఇతరులకు పాజిటివ్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ జువేరియా, డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment