మంకీపాక్స్ వైరస్ ముప్పు భారత్‌కూ పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కూడా. ఇప్పటికే ముంబైలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు.
ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలైన మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూసేవి. బయటి దేశాల్లో బయటపడడం చాలా అరుదైన అంశం. అలాంటిది రెండు వారాల వ్యవధిలో 14 దేశాలకు విస్తరించడం అసాధారణమైన వ్యవహారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పైగా ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత్ అలర్ట్ అయ్యింది.
తమిళనాడులో హైఅలెర్ట్
మంకీపాక్స్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలకు అనుగుణంగా.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సోమవారం జిల్లా కలెక్టర్లకు కీలక సూచనలు చేసింది. మంకీపాక్స్ అనుమానిత కేసుల్ని గుర్తిస్తే.. వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి తగు చికిత్స అందించాలని తెలిపింది. గత 21 రోజులుగా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్యంపై నిఘా ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించింది తమిళనాడు సర్కార్.
మంకీపాక్స్ అంటే..
స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్‌ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ వైరస్ జాడ కనిపించింది.
లక్షణాలివే..
జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్‌లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది.
ఎలా వ్యాపిస్తుంది?:
తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా, శారీరకంగా కలిసినా సోకుతుంది.
చికిత్స ఎలా..
ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పని చేస్తుంది. మందులు వాడితే.. నాలుగైదు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. లేదంటే మరో మూడు వారాలు ఎక్కువ పట్టొచ్చు. ప్రతీ పది మందిలో ఒకరు మంకీపాక్స్‌తో చనిపోయే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: మంకీపాక్స్ విజృంభణ.. శారీరకంగా కలవడం వల్లే కేసుల వ్యాప్తి!
Comments
Please login to add a commentAdd a comment