చింతలమానెపల్లి మండలం నందికొండ గ్రామానికి చెందిన భీంరావుకు జ్వరం రావడంతో కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. కొద్దిగా కోలుకోవడంతో ఇంటికి వెళ్లాడు. మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించి పదిరోజుల క్రితం ఇంటి వద్ద మృతి చెందాడు. భీంరావు మరణంతో భార్య, పిల్లలు పెద్దదిక్కును కోల్పోయారు.
కుమరం భీం: పల్లెలు మంచం పడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఫ్లూజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలతోపాటు గ్రామీణ మండలాల్లోని ప్రజలు జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. నాణ్య మైన వైద్యం అందక ఇటీవల పెంచికల్‌పేట్ మండలంలోని కొండెపల్లిలో ఓ మహిళ, చింతలమానెపల్లి మండలం నందికొండలో యువకుడు మృత్యువాత పడ్డారు.
అయితే జిల్లావ్యాప్తంగా జ్వరాల వ్యాప్తిపై అధికారికంగా రికార్డులు లేవు. కేవలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోని పరీక్షలనే రికార్డులుగా అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారే అధికంగా ఉండటం గమనార్హం.
జ్వరాల వ్యాప్తి
గ్రామీణ మండలాల్లో విద్యుత్ సరఫరా అంతరా యంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ కారణంగా నే దోమలతో వ్యాప్తిచెందే మలేరియా, డెంగీ వి జృంభిస్తున్నాయి. కలుషితమైన వాతావరణం, ఆహారం కారణంగా టైఫాయిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. వాతావరణ మార్పులతో చిన్నారులపై ఫ్లూజ్వరం ప్రభావం చూపుతోంది.
జలుబు, దగ్గు, స్వల్ప జ్వరంతో అస్వస్థతకు గురవుతున్నారు. టైఫాయిడ్ సోకిన వ్యక్తికి తీవ్రమైన జ్వరం, వాంతులు, విరోచనాలు ఉంటాయి. డెంగీ వ్యాధిగ్రస్తులకు జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, కళ్ల వెనుక భాగంలో తలనొప్పి ఉంటుంది. వీపు భాగంలో ద ద్దుర్లు, మచ్చలను కూడా గమనించవచ్చు. మలేరియా బానిన వారిలో చలి జ్వరం ఎక్కువగా ఉంటుంది.
పీహెచ్‌సీల్లో పరీక్షలు
టైఫాయిడ్, మలేరియా, డెంగీ జ్వరాలకు బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాపిడ్ పరీక్షల ద్వారా మలేరియాను నిర్ధారిస్తున్నా.. టైఫాయిడ్, డెంగీ శాంపిళ్లను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.
ఫలితాలు రావడానికి ఒక రోజు సమయం పడుతోంది. దీంతో కొన్నిచోట్ల అనుమానిత లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
కట్టడి చర్యలేవి.?
జ్వరాల కట్టడికి చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు పంచాయితీ కార్యాలయాల్లో ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతుండడంతో ఫాగింగ్ నిలిచిపోయింది. మరోవైపు పారిశుధ్యం అధ్వానంగా ఉండడం కూడా దోమలు ఉధృతికి కారణమవుతోంది. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో కలుషిత నీరే ప్రజలకు దిక్కవుతోంది.
నియంత్రణకు చర్యలు
జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. తిర్యాణి వంటి ఏజన్సీ ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎలిసా పరీక్ష ద్వారా డెంగీని కచ్చితంగా నిర్ధారిస్తున్నాం. ఈ ఫలితాలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నాం.
– కృష్ణప్రసాద్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి
డెంగీతో ఒకరి మృతి
పెంచికల్‌పేట్ మండలం అగర్‌గూడ గ్రామానికి చెందిన గోలేటి మారుతి(42) డెంగీతో ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతికి నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానికంగా ఆర్‌ఎంపీ వద్ద చికిత్స తీసుకున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఈస్‌గాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లగా అక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య శారద, కుమార్తె ఉన్నారు. కాగా.. మారుతి తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా 20 ఏళ్లుగా సేవలందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment