కుమరం భీం: ఎవరైనా అడవిలోకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా చిరుతపులి ఎదురుపడితే ఏం చేయాలి? దాని భారినుంచి ఎలా తప్పించుకోవాలి? అనే అంశాలపై డెప్యూటీ కన్జర్వేటర్, జన్నారం ఎఫ్‌డీవో మాధవరావు పలు సూచనలు చేశారు. ఇటీవల తిరుమలలో కాలినడకన వెళ్లిన బాలికను చిరుతపులి హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వాటి ద్వారా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు తప్పించుకునే మెలకువల గురించి వివరించారు. ఆయన మాటల్లోనే..
పిల్లి జాతి జంతువు..
చిరుతపులి పిల్లి జాతికి చెందిన సిగ్గరి. మనుషుల కంట పడేందుకు ఇష్టపడదు. మనుషుల అలికిడి వినిపిస్తే దూరంగా వెళ్లిపోతుంది. సాధారణంగా ఫారెస్ట్ సఫారీకి వెళ్తే పులి కనిపిస్తుంది. కానీ చిరుతపులి కనబడటం చాలా తక్కువ. అది ఒంటరిగా నివసించేందుకు ఇష్టపడుతుంది. కలయిక సమయంలో సహచరిణితో, చిన్న పిల్లలతో ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. అడవిలో ఇవి గుహల్లాంటి ఆవాసాల్లో నివసిస్తాయి. జింకలు, సాంబర్లు, అడవి పందులను చిరుతలు ఎక్కువగా వేటాడుతాయి. పైకి చూస్తే శరీరంపై మచ్చలు చూడటానికి ఒకేలా కనిపించినా రెండు చిరుతలకు ఒకే విధంగా ఉండవు.
ఎదురుపడితే ఎలా తప్పించుకోవాలి?
దేశంలో పులుల సంఖ్య కంటే చిరుతల సంఖ్య ఎక్కువగా ఉంది. కవ్వాల్ టైగర్ జోన్‌లో సుమారుగా 80 వరకు చిరుతలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చిరుత పులుల జాతి ఉంది. చిరుతలు జనావాసాల్లోకి ఊరికే రావు. వాటికి ఆహారం, నీటి సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రమే జనావాసాల్లోకి వస్తాయి. చిరుత వేగంగా కదిలే జంతువు కావడంతో జనాల్లోఎక్కువ అలజడి సృష్టిస్తుంది. జనాల మఽ ద్యకు వచ్చిన చిరుతను బంధించడం సులువుకాదు. చిరుత పులి ఎంతదూరంలో ఎదురుపడిందన్న అంశంపై ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది.
దూరంగా ఎదురుపడితే సాధారణంగా అదే పక్కకు వెళ్లిపోతుంది. అలాంటి సమయంలో మనుషులపై దాడి చేయాల్సిన అవసరం చిరుతకు ఉండదు. అనుకోని పరిస్థితుల్లో అతి సమీపంలో ముఖాముఖిగా ఎదురుపడితే దాడి చేసే అవకాశాలున్నాయి. అలాంటి సమయంలో రెండు చేతులు పైకెత్తి గట్టిగా అరవాలి. అడవి జంతువుల సైకాలజీ ప్రకారం ఆకారంలో తమకన్నా పెద్దగా ఉన్న జంతువులపై సాధారణంగా చిరుతలు దాడికి దిగవు. చిరుత పులి ఎదురుపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి పరుగెత్తడం, లేదా పొదల చాటున దాక్కోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే చిరుత వెంటపడి దాడిచేసే అవకాశం ఉంది.
ఒకవేళ పారిపోతే ఎంత పరుగెత్తినా చిరుత వేగం ముందు మనం నిలువలేం. కాబట్టి చిరుత కాస్త దూరంలో ఎదురుపడితే చేతులు పైకెత్తి నెమ్మదిగా వెనక్కి నడవడం, దగ్గరగా ఉంటే చేతులు పైకెత్తి గట్టిగా అరుస్తూ వెనక్కి నడిస్తే చిరుత అక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం చెట్లు ఎక్కినా వేటాడాలనుకునే చిరుత సులభంగా చెట్లు ఎక్కుతుంది.
కూలీలు ఏంచేయాలి?
అడవిలోకి పనికి వెళ్లే కూలీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిరుత పులి వెనుక వైపు నుంచి వేటాడుతున్నందున కూలీలు మాస్కులు, తలకు వెనుకవైపు ఫేస్ మాస్కులు పెట్టుకోవడం మంచిది. వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు ఫేస్ మాస్కులు ధరించి, మాట్లాడుకుంటూ వెళ్లాలి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చిరుత పులి బారి నుంచి తప్పించుకోవచ్చని మాధవరావు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment