సాక్షి, కుమరం భీం: జిల్లాలో రోజురోజుకూ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడం.. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ఒక్కొక్కటిగా విడుదల అవుతుండటమే ఇందుకు కారణమైంది. గెలుపే లక్ష్యంగా జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు పావులు కదుపుతున్నాయి. తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు చేజారిపోకుండా ఓవైపు చూసుకుంటూనే.. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలను తమ వైపు తిప్పుకునేందుకు గాలం వేస్తున్నాయి. అలాగే ఏ పార్టీకి చెందని తటస్తులను ఆకర్షించే పనిలో నాయకులు పడ్డారు. నేరుగా ఫోన్లలో సంప్రదిస్తూ తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారు.
కులసంఘాల నేతలతో బేరసారాలు..
ఎన్నికల్లో కులసంఘాల పాత్ర కీలకంగా మారిన నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీల నేతలు కులసంఘాల నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారిని ఎలాగోలా బుట్టలో వే సుకోవాలని చూస్తున్నారు. అవసరమైతే ఆయా నే తలతో బేరసారాలకు సైతం దిగుతున్నట్లు రాజకీ య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న అధికార, విపక్ష పార్టీల నేతలు కుల, యువజన సంఘాల నేతలు, పెద్దలకు రూ.లక్షల్లో బేరం పెట్టినట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీంతోపాటు తాము విజయం సాధించిన తర్వా త పనులు, పదవులు కట్టబెటతామని హామీలు సైతం ఇస్తున్నట్లు సమాచారం.
ద్వితీయ శ్రేణి నాయకులకు బాధ్యతలు!
అధికార, విపక్ష పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను బుజ్జగించి మరీ గెలుపు బాధ్యతలను వారి భుజస్కందాలపై మోపుతున్నారు. ఇలా చేయడం ద్వారా బాధ్యతతో ఉంటారని ఆయా పార్టీల అభ్యర్థులు యోచిస్తున్నారు. విజయం సాధించిన వెంటనే వారికి పదవులు కట్టబెటతామని తాయిలాలు ప్రకటిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ జరిగింది. ఈసారి ఎన్నికల్లో బీఎస్పీ, బీజేపీపాటు ఇతర పార్టీలు కూడా బరిలో దిగుతున్న నేపథ్యంలో ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం జరగకూడదని అన్ని పార్టీలనేతలు సమాలోచనలు చేస్తున్నారు. తమకే ప్రయోజనం కలగాలనే రీతిలో పావులు కదుపుతున్నారు.
ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు..
విపక్ష, అధికార పార్టీలు అన్న తేడా లేకుండా ఎ న్నికల బరిలో నిలిచే పార్టీలన్నీ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో తలమునకలయ్యాయి. అధికార పార్టీ ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరిట అన్ని మండలాల ప్రజలతో సమావేశమైంది. నెలరోజుల ముందుగానే ఆ పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించడంతో వారు అన్ని పార్టీల కంటే ముందుగా గ్రామాల్లో ప్రచారం మొదలెట్టారు.
అదే సమయంలో బూత్‌స్థాయి నుంచి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అలాగే ప్రత్యర్థి శిబిరం నుంచి వలసలను ప్రోత్సహించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. గ్రామాల వారీగా ఉన్న కీలక నేతలకు గాలం వేస్తూ.. మాట వినని పక్షంలో సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించేందుకు వెనుకాడటం లేదు. ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతలకు భారీ ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చి వారిని తమవైపు తిప్పుకుంటుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment