‘చేయి’ కలపని నేతలు | - | Sakshi
Sakshi News home page

‘చేయి’ కలపని నేతలు

Published Fri, Feb 21 2025 8:43 AM | Last Updated on Fri, Feb 21 2025 8:38 AM

‘చేయి’ కలపని నేతలు

‘చేయి’ కలపని నేతలు

● కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో వర్గభేదాలు ● ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఒక్కటిగా ఉండేలా కార్యాచరణ ● పార్టీ అభ్యర్థిని గట్టెక్కించేందుకు ప్రయత్నాలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మధ్య గత కొంతకాలంగా సఖ్యత కొరవడింది. పాత, కొత్త నాయకుల మధ్య వర్గ పోరు నడుస్తోంది. ఇదే తీరు కొనసాగితే ఎంపీ ఎన్నికల తరహాలో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండడంతో అందరూ కలిసి పని చేసేలా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క కృషి చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత లొల్లిలు ఎన్ని ఉన్నా ఎమ్మెల్సీ అభ్యర్థిని గట్టెక్కించేందుకు ఒకే వేదికపై నిలబడాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో మంత్రి సీతక్కకు ప్రతిష్టాత్మకంగా మారింది.

వర్గభేదాలతో సతమతం

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి అజ్మీరా శ్యామ్‌నాయక్‌ మ ధ్య విభేదాలు బహిరంగంగానే బయటపడ్డాయి. బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చే రికతో మరింత ముదిరాయి. సిర్పూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండే విఠల్‌, రావి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీలో ఉన్నారు. ఇటీవల కోనప్ప తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన నిధులను రద్దు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. గురువారం కాగజ్‌నగర్‌ పట్టణంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి తదితరులు హాజరైన ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నియోజకవర్గ నాయకుడు రావి శ్రీనివాస్‌ దూరంగా ఉండడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మంచిర్యాలలో భిన్న పరిస్థితి

మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్నారు. ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది. డీసీసీ అధ్యక్షురాలుగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి సురేఖ ఉన్నారు. బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం సోదరులైన వినోద్‌, వివేక్‌, పెద్దపల్లి ఎంపీగా వివేక్‌ తనయుడు వంశీక్రిష్ణ ఉన్నారు. జిల్లాలో పార్టీ రెండు వర్గాలుగా కొనసాగుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఒక్క కార్యక్రమం చేసిన దాఖలాలు లేవు. ఎవరైనా రాష్ట్ర మంత్రులు వచ్చినా ఆయా నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. మరోవైపు ముగ్గురు ఎమ్మెల్యేలూ మంత్రి పదవి కోసం పోటీలో ఉన్నారు. దీంతో పార్టీ కేడర్‌ కూడా ఆయా నాయకుల అనుచర వర్గాలుగానే ఉంది.

ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలో..

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో పాత, కొత్త నేతలు ఇంకా చేతులు కలపడం లేదు. బీఆర్‌ఎస్‌ నుంచి చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, బోథ్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు పార్టీలో ఇన్నాళ్లు అంటీముట్టనట్లుగానే ఉన్నారు. ఖానాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌, ప్రస్తుత ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ మధ్య సఖ్యత లేదు. ఇక బీజేపీని వీడి మాజీ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్‌లో చేరారు. ఆదిలాబాద్‌ డీసీసీ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ కంది శ్రీనివాస్‌, శ్రీకాంత్‌రెడ్డి, గణేశ్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజవకర్గ ఇన్‌చార్జిగా ఆత్రం సుగుణ ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కలిసి కట్టుగా పని చేయాలంటూ ఆదేశాలు రావడంతో విభేదాలు పక్కనబెట్టి పని చేసేందుకు ముందుకు వస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement