జిల్లాలో నత్తనడకన సబ్ సెంటర్ల నిర్మాణం
ఆరుచోట్ల స్థలాలే గుర్తించని అధికారులు
గ్రామీణ ప్రజలకు అందని వైద్యం
దహెగాం(సిర్పూర్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సే వలందించడంలో సబ్ సెంటర్లు కీలకపాత్ర వహిస్తాయి. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చే రువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద సబ్‌సెంటర్ల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. అయితే జిల్లాలో మాత్రం భవన నిర్మాణ పనులు నత్తనడకన సా గుతున్నాయి. ఏళ్లుగా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇప్పటికీ ఈ కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుండటంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద మూడేళ్ల క్రితం జిల్లాలో 39 సబ్ సెంటర్లకు భవనాలు మంజూరయ్యారు. ఇందులో 33 భవనాల నిర్మాణం తుదిదశకు చేరగా, అందులో కొన్నింటిని గతేడాది ప్రారంభించారు. మిగతా వాటికి చిన్నపాటి మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా, వివిధ కారణాలతో పనులు ఆగిపోయాయి. అంతేకాక మరో ఆరుచోట్ల ఇప్పటికీ స్థలాలు గుర్తించలేదు. సంబంధిత అధికారులు మాత్రం స్థలాలు గుర్తించే చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
ఒక్కో భవనానికి రూ.20లక్షలు
జిల్లాలో సబ్ సెంటర్ల నిర్మాణానికి ప్రభుత్వం మొదట రూ.16 లక్షల చొప్పున మంజూరు చేసింది. అయితే ఆ నిధులతో భవనాలు పూర్తయ్యే పరిస్థితులు లేకపోవడంతో అదనంగా మరో రూ.4లక్షల చొప్పున కేటాయించారు. ఒక్కో భవనం పూర్తి చేసేందుకు మొత్తంగా రూ.20 లక్షల చొప్పున కేటాయించారు. అయినా మూడేళ్లుగా పనులు ఇంకా పూర్తికాలేదు. ప్రభుత్వం నుంచి కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతోనే పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మరో వైపు అధికారుల పర్యవేక్షణ, సమన్వయ లోపంతో కొన్నిచోట్ల ఇప్పటికీ స్థలాలు గుర్తించలేదు.
వేసవిలో వ్యాధుల ముప్పు
ఇప్పటికే ఎండలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నా యి. భూగర్భ జలాలు, నదుల్లో నీరు అడుగంటి పోతుంది. గిరిజనులు అధికంగా తాగే నీరు కలు షితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో డయేరియా, విషజ్వరాలు ముప్పు పొంచి ఉంది. సబ్ సెంటర్ల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో వైద్యసిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండటం లేదు. మారుమూల ప్రాంతాల ప్రజలు అత్యవసర సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఆర్‌ఎంపీలను కూడా ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సబ్‌సెంటర్ పక్కా భవనాలు పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిధుల కొరతతోనే..
జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం కింద 39 సబ్‌సెంటర్‌లకు పక్కా భవనాలు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 33 వరకు తుదిదశకు చేరాయి. చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంది. ఇంకా ఆరుచోట్ల స్థలాలు గుర్తించే పనిలో ఉన్నాం. త్వరలోనే స్థలాలు గుర్తించి మిగతా వాటిని పూర్తి చేస్తాం. నిధుల కొరత కారణంగా పనులు ముందుకు సాగడం లేదు.
– సందీప్‌రెడ్డి, ఏఈ
Comments
Please login to add a commentAdd a comment