అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకేస్తే ఎక్కడో ఉన్న ఎవరికో తగిలి తుస్సుమన్నట్లు అంతర్జాతీయ డిటెక్టివ్ సినిమా స్థాయిలో అందరూ హడావుడి చేసిన హవానా సిండ్రోమ్ వెనుక రహస్యాయుధాలేమీ లేవని తాజా పరిశోధన తేల్చేసింది. మనిషిలో ఏర్పడే మనో, చిత్త భ్రమల కారణంగానే హవానా సిండ్రోమ్ లక్షణాలు కలుగుతున్నాయని న్యూరాలజిస్టుల తాజా అంచనా! ఇంతకీ ఏంటీ సిండ్రోమ్? ఎందుకీ హడావుడి?
సైంటిస్టులేమంటున్నారు? చూద్దాం..
ప్రపంచ పెద్దన్న అమెరికానే హైరానా పెట్టిన హవానా సిండ్రోమ్ పేరు 2016–17లో తొలిసారి వినిపించింది. క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిలో తొలిసారి ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. మైగ్రేన్ తలనొప్పి, అలసట, కడుపులో వికారం, నిద్రమత్తు, చెవుల్లో వింత శబ్దాలు, తలతిరగడం తదితర లక్షణాలు సిబ్బందిలో కనిపించాయి. దీని గురించి బయటపడి ఐదేళ్లైనా ఎందువల్ల వస్తుందో ఎవరూ కచి్ఛతంగా చెప్పలేకపోయారు. చివరకు జేమ్స్‌బాండ్ సినిమాలోలాగా ఏదో రహస్యాయుధం వల్లనే ఈ లక్షణాలు కలుగుతున్నాయని, అమెరికా సిబ్బందిపై ఈ ఆయుధాన్ని శత్రుదేశాలు ప్రయోగిస్తున్నాయని కథనాలు వెలువడ్డాయి.
ఈ ఆయుధం క్యూబా సృష్టి అని, రష్యా రూపకల్పన అని పలురకాల ఊహాగానాలు చెలరేగాయి. కొందరు పేరున్న సైంటిస్టులు కూడా దీనికి సరైన కారణం తెలుసుకోకుండా ఆయుధ వాడకం థియరీని బలపరిచారు. అయితే అమెరికాకే చెందిన న్యూరాలజిస్టు రాబర్ట్ బలో మాత్రం భిన్నంగా ఆలోచించారు. హవానా సిండ్రోమ్ లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ లక్షణాలు తనవద్దకు వచ్చే మనోభ్రాంతి పేషెంట్లలో కూడా ఉన్నట్లు గుర్తించారు. వీటిని సైకోసొమాటిక్(మానసికోత్పన్న) లక్షణాలుగా నిర్ధారణకు వచ్చారు. మానసిక భ్రాంతి కారణంగా కలిగినప్పటికీ ఈ లక్షణాలు నిజమైన బాధను కలగజేస్తాయని ఆయన పరిశోధనలో తేలింది. దీంతో ఈ విషయమై ఆయన మరింత లోతైన అధ్యయనం జరిపారు.
బృంద లక్షణాలు
మాస్ సైకోజెనిక్ ఇల్‌నెస్(బృంద చిత్త భ్రమ వ్యాధి) అనేది ఒక సమూహంలోని కొందరు ప్రజలు సామూహికంగా అనుభవించే మనో భ్రమ అని రాబర్ట్ చెప్పారు. ఇదే హవానా సిండ్రోమ్‌కు కారణమై ఉండొచ్చన్నది ఆయన స్థిర అభిప్రాయం. ఒక సమూహంలోని కొందరు తామేదో భయానకమైనదాన్ని ఎదుర్కొన్నామని భావించినప్పుడు ఈ భ్రమ మొదలవుతుందని వివరించారు. ఉదాహరణకు 20వ శతాబ్దంలో టెలిఫోన్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి.
తొలినాళ్లలో పలువురు టెలిఫోన్ ఆపరేటర్లు ఒక షాక్ లాంటి స్థితిని చాలా రోజులు అనుభవించేవారని ఆయన గుర్తు చేశారు. దీనికి కారణం ఎవరూ కనుక్కోలేకపోయారు. ఇది కేవలం మాస్ సైకోజెనిక్ ఇల్‌నెస్ అని రాబర్ట్ బల్లగుద్ది చెబుతున్నారు. హవానా సిండ్రోమ్ కూడా అలాంటిదేనన్నది ఆయన భావన. ఒత్తిడిలో పనిచేసేవారిలో ఈ ఇల్‌నెస్ ఆరంభమవుతుంది. ఒకరిలో ఈ భ్రమ ఆరంభం కాగానే, వారు దీని గురించి ఇతరులకు వివరిస్తారు. అలా విన్నవారిలో కొందరు అలాంటి భ్రమకు లోబడతారు. ఇలా ఈ లక్షణాలు వ్యాపిస్తూ ఉంటాయి. మెదడులో రసాయన మార్పుల కారణంగా ఈ లక్షణాలు ఆరంభమై సదరు వ్యక్తిని పలు ఇబ్బందులు పెడుతుంటాయి.
ఇవి కొన్ని సంవత్సరాలు కనిపించే అవకాశం ఉందని రాబర్ట్ చెప్పారు. జాతీయ సైన్స్ అకాడమీ ఈ సిద్ధాంతాన్ని కూడా అంగీకరించింది. కానీ తగిన గణాంకాలు లేనందున నిర్ధారించడంలేదు. క్యూబా ప్రభుత్వం కూడా దీనిపై లోతైన పరిశోధన జరిపి గతనెల 13న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ సిండ్రోమ్ వెనుక ఎలాంటి ఆయుధాలు లేవని నివేదిక స్పష్టం చేసింది. క్యూబాలో ఎప్పుడో పనిచేసిన ఒక అండర్ కవర్ ఏజెంట్, తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి వల్ల ఈ సిండ్రోమ్ బారిన పడి ఉంటారని, తననుంచి ఇది ఒక అంటువ్యాధిలా వ్యాపించిందనేది హవానా సిండ్రోమ్‌పై తాజా అంచనా. ఇంతకు మించిన కారణాలేమైనా ఉంటే, వాటిని సీఐఏ బయటపెడితే తప్ప హవానా సిండ్రోమ్‌పై హైరానా అనవసరమన్నది సైంటిస్టుల అభిప్రాయం.
(చదవండి: అమరీందర్ నిబద్ధతపై సందేహం: రావత్)
సిద్ధాంత రాద్ధాంతాలు
హవానా సిండ్రోమ్ వల్ల కలిగే ఇబ్బందులు ఒక్కరికే పరిమితం కాకుండా పలుమందిలో ఒకేలా కనిపించడం రాబర్ట్‌ను ఆకర్షించింది. దీంతో ఆయన మాస్ హిస్టీరియా, సైకోసొమాటిక్ డిసీజెస్ తదితర అనేక అంశాలను పరిశీలించి అధ్యయనం చేశారు. సోనార్ ఆయుధం వాడకం చెవి అంతర్భాగంలో ఏర్పడుతున్న హాని వల్ల ఈ లక్షణాలు కలుగుతున్నట్లు 2018లో మియామీకి చెందిన కొందరు జరిపిన అధ్యయనం అభిప్రాయపడింది. ఈ ఫలితాలను కూడా ఆయన మదింపు చేశారు. అయితే ఈ అధ్యయనాలన్నింటిలో లోపాల కారణంగానే తప్పుడు సిద్ధాంతాలు రూపొందాయని ఆయన చెబుతున్నారు.
(చదవండి: Bihar: నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీసును చితకబాదాడు)
సోనార్ ఆయుధం వాడి ఉంటే కేవలం లోపలి చెవి భాగాలు మాత్రమే కాకుండా మెదడులోని భాగాలు కూడా దెబ్బతిని ఉండేవని వివరించారు. మైక్రోవేవ్ రేడియేషన్ ఆయుధం వల్ల ఈ లక్షణాలు వస్తున్నాయని 2020లో కొందరు సరికొత్త సిద్ధాంతం లేవనెత్తారు. దీన్ని జాతీయ సైన్సు అకాడమీ పరోక్షంగా సమరి్ధంచడంతో ఈ సిద్ధాంతానికి మరింత ప్రాచుర్యం వచ్చింది. అయితే మేక్రోవేవ్ ఆయుధం వల్ల వినిపించే శబ్దాలు నిజమైనవి కావని, మెదడులో ఉండే న్యూరాన్లు అనుభవించే మిధ్యా శబ్దాలని రాబర్ట్ చెప్పారు. హవానా సిండ్రోమ్ లక్షణాలు ఇలాంటి మిధ్యా శబ్దాలు కావని ఆయన గుర్తించారు. ఈ విధంగా అనేక పరిశీలన అనంతరం చిత్త భ్రమ వల్లనే ఈ సిండ్రోమ్ లక్షణాలు కలుగుతున్నాయని రాబర్ట్ నిర్ధారణకు వచ్చారు.
– నేషనల్ డేస్క్, సాక్షి.
Comments
Please login to add a commentAdd a comment