Disease symptoms
-
COVID-19: ప్రతి 10 మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్
వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియెంట్ తర్వాత కరోనా బాధితుల్లోని ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్ బయటపడుతోందని అమెరికా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ సోకిన ప్రతీ పది మందిలో ఒకరు ఇప్పటికీ అనునిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం నివేదిక తెలిపింది. చిన్న పనికే అలిసిపోవడం, మెదడుపై ప్రభావం, తల తిరగడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె దడ, సెక్స్‌పై అనాసక్తత, తరచూ దాహం వేయడం, రుచి, వాసన కోల్పోవడం, విపరీతమైన దగ్గు, ఛాతీలో నొప్పి వంటివన్నీ లాంగ్ కోవిడ్ ఉన్నవారిలో కనిపిస్తున్నాయని ఆ నివేదిక వివరించింది. -
ఈ లక్షణాలు ఉన్నాయా?.. ఇలా చేసి నోటి క్యాన్సర్ నుంచి కాపాడుకోండి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రజల ఆరోగ్యంపై జగన్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అధునాతన పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటోంది. పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లోనే ఉచితంగా ఖరీదైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. తాజాగా నోటి క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి.. వ్యాధికి చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. వైద్యులకు శిక్షణ ఇచ్చిన అనంతరం వెల్‌స్కోప్ మెషీన్లు ఏర్పాటు చేసి క్యాన్సర్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పొగాకు, పొగాకు మసాలాలతో పాటు బీడీలు, సిగరెట్ తాగుతున్న వారిలో నోటి క్యాన్సర్ తీవ్రమవుతోంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకుంటున్న క్యాన్సర్ బాధితుల్లో ఆరు శాతం మంది నోటి క్యాన్సర్ (ఓరల్ క్యాన్సర్) వారే ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రోజురోజుకూ దీని తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందే ఓరల్ క్యాన్సర్‌ను పసిగట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీతో నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. ప్రాథమిక క్యాన్సర్ దశకు రాకముందే.. లేదంటే అలాంటి లక్షణాలు కనిపించకముందే క్యాన్సర్ స్థితిని ఓ పరికరం ద్వారా అంచనా వేస్తారు. ఇలాంటి పరికరాలను ఏపీ సర్కారు అందుబాటులోకి తెచ్చింది. చదవండి: సోలో బ్రతుకే సో 'బెటరు' వెల్‌స్కోప్ మెషీన్ ద్వారా పరీక్షలు.. వెల్‌స్కోప్ మెషీన్ అంటేనే ఇదొక అత్యాధునిక వైద్యపరికరం. తరంగ దైర్ఘ్యాల నీలి కాంతిని ప్రేరేపణ చేసి నోటిలో ఉన్న పరిస్థితులను అంచనా వేస్తుంది. క్యాన్సర్ వచ్చే లక్షణాలను ముందే పసిగట్టగలిగే సామర్థ్యం ఉంటుంది. ప్రీ క్యాన్సర్ లక్షణాలే క్యాన్సర్‌కు దారి తీస్తాయి. వాటిని ముందే గ్రహించి చెప్పగలదు. ఇలాంటి వెల్‌స్కోప్ మెషీన్లను వైజాగ్, విజయవాడ, కడపలో ఏర్పాటు చేశారు. కడపలో ఏర్పాటు చేసిన ఈ మెషీన్ పరిధిలో 9 జిల్లాల వైద్యులకు శిక్షణ ఇస్తారు. ఇందులో శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో... పీహెచ్సీ వైద్యులకు, దంతవైద్యులకు వెల్‌స్కోప్ మెషీన్ ద్వారా శిక్షణ నిచ్చిన అనంతరం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ వెల్‌స్కోప్ మెషీన్లు ఏర్పాటు చేస్తారు. మెషీన్ల ఏర్పాటు అనంతరం భారీ స్థాయిలో నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఇలా ముందే లక్షణాలను గుర్తించి చికిత్స చేస్తే వేలాదిమంది ప్రాణాలను కాపాడవచ్చనేది వైద్యుల అభిప్రాయం. ఓ వైపు నిర్ధారణ పరీక్షలు చేస్తూనే అదే ప్రాంతంలో మరోవైపు పొగాకు ఉత్పత్తుల వాడకం నియంత్రణపై కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రస్తుతం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వైద్యులకు ఈ మెషీన్ ద్వారా నిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నారు. క్యాన్సర్ బారినుంచి కాపాడవచ్చు నోటి క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉంది. ముందస్తు లక్షణాలు గుర్తించి చికిత్స అందిస్తే వ్యయభారం తగ్గుతుంది. భవిష్యత్‌లో ఇది అన్ని చోట్లా విస్తరిస్తే మరింతగా లబ్ధి కలుగుతుంది. ముఖ్యంగా పొగాకు వాడకంతో క్యాన్సర్‌కు గురయ్యేవారిని క్యాన్సర్ బారినుంచి కాపాడచ్చు. – డాక్టర్ శ్రీనివాసన్, క్యాన్సర్‌కేర్ నోడల్ ఆఫీసర్ -
హవానా... అంతా భ్రమేనా?!
అండపిండ బ్రహ్మాండంలో ఆంబోతు రంకేస్తే ఎక్కడో ఉన్న ఎవరికో తగిలి తుస్సుమన్నట్లు అంతర్జాతీయ డిటెక్టివ్ సినిమా స్థాయిలో అందరూ హడావుడి చేసిన హవానా సిండ్రోమ్ వెనుక రహస్యాయుధాలేమీ లేవని తాజా పరిశోధన తేల్చేసింది. మనిషిలో ఏర్పడే మనో, చిత్త భ్రమల కారణంగానే హవానా సిండ్రోమ్ లక్షణాలు కలుగుతున్నాయని న్యూరాలజిస్టుల తాజా అంచనా! ఇంతకీ ఏంటీ సిండ్రోమ్? ఎందుకీ హడావుడి? సైంటిస్టులేమంటున్నారు? చూద్దాం.. ప్రపంచ పెద్దన్న అమెరికానే హైరానా పెట్టిన హవానా సిండ్రోమ్ పేరు 2016–17లో తొలిసారి వినిపించింది. క్యూబాలోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిలో తొలిసారి ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. మైగ్రేన్ తలనొప్పి, అలసట, కడుపులో వికారం, నిద్రమత్తు, చెవుల్లో వింత శబ్దాలు, తలతిరగడం తదితర లక్షణాలు సిబ్బందిలో కనిపించాయి. దీని గురించి బయటపడి ఐదేళ్లైనా ఎందువల్ల వస్తుందో ఎవరూ కచి్ఛతంగా చెప్పలేకపోయారు. చివరకు జేమ్స్‌బాండ్ సినిమాలోలాగా ఏదో రహస్యాయుధం వల్లనే ఈ లక్షణాలు కలుగుతున్నాయని, అమెరికా సిబ్బందిపై ఈ ఆయుధాన్ని శత్రుదేశాలు ప్రయోగిస్తున్నాయని కథనాలు వెలువడ్డాయి. ఈ ఆయుధం క్యూబా సృష్టి అని, రష్యా రూపకల్పన అని పలురకాల ఊహాగానాలు చెలరేగాయి. కొందరు పేరున్న సైంటిస్టులు కూడా దీనికి సరైన కారణం తెలుసుకోకుండా ఆయుధ వాడకం థియరీని బలపరిచారు. అయితే అమెరికాకే చెందిన న్యూరాలజిస్టు రాబర్ట్ బలో మాత్రం భిన్నంగా ఆలోచించారు. హవానా సిండ్రోమ్ లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ లక్షణాలు తనవద్దకు వచ్చే మనోభ్రాంతి పేషెంట్లలో కూడా ఉన్నట్లు గుర్తించారు. వీటిని సైకోసొమాటిక్(మానసికోత్పన్న) లక్షణాలుగా నిర్ధారణకు వచ్చారు. మానసిక భ్రాంతి కారణంగా కలిగినప్పటికీ ఈ లక్షణాలు నిజమైన బాధను కలగజేస్తాయని ఆయన పరిశోధనలో తేలింది. దీంతో ఈ విషయమై ఆయన మరింత లోతైన అధ్యయనం జరిపారు. బృంద లక్షణాలు మాస్ సైకోజెనిక్ ఇల్నెస్(బృంద చిత్త భ్రమ వ్యాధి) అనేది ఒక సమూహంలోని కొందరు ప్రజలు సామూహికంగా అనుభవించే మనో భ్రమ అని రాబర్ట్ చెప్పారు. ఇదే హవానా సిండ్రోమ్‌కు కారణమై ఉండొచ్చన్నది ఆయన స్థిర అభిప్రాయం. ఒక సమూహంలోని కొందరు తామేదో భయానకమైనదాన్ని ఎదుర్కొన్నామని భావించినప్పుడు ఈ భ్రమ మొదలవుతుందని వివరించారు. ఉదాహరణకు 20వ శతాబ్దంలో టెలిఫోన్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. తొలినాళ్లలో పలువురు టెలిఫోన్ ఆపరేటర్లు ఒక షాక్ లాంటి స్థితిని చాలా రోజులు అనుభవించేవారని ఆయన గుర్తు చేశారు. దీనికి కారణం ఎవరూ కనుక్కోలేకపోయారు. ఇది కేవలం మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ అని రాబర్ట్ బల్లగుద్ది చెబుతున్నారు. హవానా సిండ్రోమ్ కూడా అలాంటిదేనన్నది ఆయన భావన. ఒత్తిడిలో పనిచేసేవారిలో ఈ ఇల్నెస్ ఆరంభమవుతుంది. ఒకరిలో ఈ భ్రమ ఆరంభం కాగానే, వారు దీని గురించి ఇతరులకు వివరిస్తారు. అలా విన్నవారిలో కొందరు అలాంటి భ్రమకు లోబడతారు. ఇలా ఈ లక్షణాలు వ్యాపిస్తూ ఉంటాయి. మెదడులో రసాయన మార్పుల కారణంగా ఈ లక్షణాలు ఆరంభమై సదరు వ్యక్తిని పలు ఇబ్బందులు పెడుతుంటాయి. ఇవి కొన్ని సంవత్సరాలు కనిపించే అవకాశం ఉందని రాబర్ట్ చెప్పారు. జాతీయ సైన్స్ అకాడమీ ఈ సిద్ధాంతాన్ని కూడా అంగీకరించింది. కానీ తగిన గణాంకాలు లేనందున నిర్ధారించడంలేదు. క్యూబా ప్రభుత్వం కూడా దీనిపై లోతైన పరిశోధన జరిపి గతనెల 13న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ సిండ్రోమ్ వెనుక ఎలాంటి ఆయుధాలు లేవని నివేదిక స్పష్టం చేసింది. క్యూబాలో ఎప్పుడో పనిచేసిన ఒక అండర్ కవర్ ఏజెంట్, తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి వల్ల ఈ సిండ్రోమ్ బారిన పడి ఉంటారని, తననుంచి ఇది ఒక అంటువ్యాధిలా వ్యాపించిందనేది హవానా సిండ్రోమ్‌పై తాజా అంచనా. ఇంతకు మించిన కారణాలేమైనా ఉంటే, వాటిని సీఐఏ బయటపెడితే తప్ప హవానా సిండ్రోమ్‌పై హైరానా అనవసరమన్నది సైంటిస్టుల అభిప్రాయం. (చదవండి: అమరీందర్ నిబద్ధతపై సందేహం: రావత్) సిద్ధాంత రాద్ధాంతాలు హవానా సిండ్రోమ్ వల్ల కలిగే ఇబ్బందులు ఒక్కరికే పరిమితం కాకుండా పలుమందిలో ఒకేలా కనిపించడం రాబర్ట్‌ను ఆకర్షించింది. దీంతో ఆయన మాస్ హిస్టీరియా, సైకోసొమాటిక్ డిసీజెస్ తదితర అనేక అంశాలను పరిశీలించి అధ్యయనం చేశారు. సోనార్ ఆయుధం వాడకం చెవి అంతర్భాగంలో ఏర్పడుతున్న హాని వల్ల ఈ లక్షణాలు కలుగుతున్నట్లు 2018లో మియామీకి చెందిన కొందరు జరిపిన అధ్యయనం అభిప్రాయపడింది. ఈ ఫలితాలను కూడా ఆయన మదింపు చేశారు. అయితే ఈ అధ్యయనాలన్నింటిలో లోపాల కారణంగానే తప్పుడు సిద్ధాంతాలు రూపొందాయని ఆయన చెబుతున్నారు. (చదవండి: Bihar: నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీసును చితకబాదాడు) సోనార్ ఆయుధం వాడి ఉంటే కేవలం లోపలి చెవి భాగాలు మాత్రమే కాకుండా మెదడులోని భాగాలు కూడా దెబ్బతిని ఉండేవని వివరించారు. మైక్రోవేవ్ రేడియేషన్ ఆయుధం వల్ల ఈ లక్షణాలు వస్తున్నాయని 2020లో కొందరు సరికొత్త సిద్ధాంతం లేవనెత్తారు. దీన్ని జాతీయ సైన్సు అకాడమీ పరోక్షంగా సమరి్ధంచడంతో ఈ సిద్ధాంతానికి మరింత ప్రాచుర్యం వచ్చింది. అయితే మేక్రోవేవ్ ఆయుధం వల్ల వినిపించే శబ్దాలు నిజమైనవి కావని, మెదడులో ఉండే న్యూరాన్లు అనుభవించే మిధ్యా శబ్దాలని రాబర్ట్ చెప్పారు. హవానా సిండ్రోమ్ లక్షణాలు ఇలాంటి మిధ్యా శబ్దాలు కావని ఆయన గుర్తించారు. ఈ విధంగా అనేక పరిశీలన అనంతరం చిత్త భ్రమ వల్లనే ఈ సిండ్రోమ్ లక్షణాలు కలుగుతున్నాయని రాబర్ట్ నిర్ధారణకు వచ్చారు. – నేషనల్ డేస్క్, సాక్షి. -
అప్రమత్తంగా ఉందాం..!
డాక్టర్స్ కాలమ్ జ్వరాలన్నీ ఒకటే కావు. కొన్ని ప్రమాదకరమైన జ్వరాలూ ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే ప్రమాదకర వైరస్లు మొదట ప్రభావం చూపేది మహానగరాలపైనే. గతంలో స్వైన్ ఫ్లూ హైదరాబాద్‌పై పంజా విసిరింది. పశ్చిమాఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న ఎబోలా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఆయా దేశాల నుంచి ఎందరో పర్యాటకులు రోజూ హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతున్నారు. సిటీ నుంచి వందల సంఖ్యలో వ్యాపార, ఉద్యోగ రీత్యా ఎందరో రోజూ ఆఫ్రికా దేశాలకు వెళ్లి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎబోలా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని కాంటినెంటల్ ఆస్పత్రికి చెందిన వైద్యురాలు డా.సౌజన్య చెబుతున్నారు. సాధారణ జ్వరాలకు ఉండే లక్షణాలన్నీ దీనికి కూడా ఉంటాయని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండటమే అసలైన మందు అని చెబుతున్నారామె. వ్యాధి లక్షణాలు ►మలేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ జ్వరాల తరహాలోనే ఈ వ్యాధి లక్షణాలుంటాయి. ►నోట్లో ఎక్కువగా లాలాజలం ఊరుతుంది. ►శరీరం మొత్తం విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ►శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ►ఛాతీలో విపరీతంగా నొప్పి వస్తుంది. ►కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ►శరీరంపై అక్కడక్కడా దద్దుర్లు వస్తాయి. ►వాంతులు, విరేచనాల ప్రభావం అధికంగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ►ఇలాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. ►దీనికి ప్రత్యేకంగా మందులుగానీ, టీకాలు గానీ లేవు. ఇవి ఇంకా పరీక్షా దశను దాటలేదు. ►విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులకు వైద్యపరీక్షలు ►పక్కాగా నిర్వహించాలి. ►ఎబోలా రోగులకు వైద్యం అందించడంలో నర్సులదే కీలక పాత్ర. అందుకే హైదరాబాద్ లాంటి నగరాల్లో నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అవసరం. ► కాచిన నీళ్లు తాగడం, చేతులు శుభ్రంగా కడుక్కుని ఆహారాన్ని తీసుకోవడం ప్రాథమిక జాగ్రత్తలు ప్రజంటర్: జి.రామచంద్రారెడ్డి