కాపాడే కన్నీరు పొడిబారితే..!  | What Is Dry Eye Symptoms Causes And Treatment | Sakshi
Sakshi News home page

కాపాడే కన్నీరు పొడిబారితే..! 

Published Sun, Dec 3 2023 7:14 AM | Last Updated on Sun, Dec 3 2023 7:43 AM

What Is Dry Eye Symptoms Causes And Treatment - Sakshi

కన్ను ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఏదైనా  కాస్త తగలగానే కళ్లల్లోంచి నీళ్లు కారిపోతుంటాయి. కన్ను పొడిబారితే ప్రమాదమని ప్రకృతి ఈ కన్నీళ్లను ఏర్పాటు చేసింది. నిత్యం ఏసీ గదుల్లో ఉండటం, కంప్యూటర్‌దో, ల్యాప్‌టాప్‌లదో, ఆఖరికి మొబైల్‌ స్క్రీన్‌నో ఎప్పుడూ చూస్తూ ఉండటంతో పాటు... కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు, జబ్బులు ఉన్నప్పుడు కూడా కన్నుపొడిబారుతుంది. ఇలా పొడిబారడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు వచ్చేందుకూ, ఒక్కోసారి చూపు కోల్పోయేందుకూ అవకాశముంది. కన్ను పొడిబారే సమస్యను వైద్య పరిభాషలో ‘కెరటో కంజంక్టివైటిస్‌ సిక్కా’(డ్రై ఐ) అని చెబుతారు. ఈ కండిషన్‌ అవగాహన పెంచుకుని, కంటిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం.

కంటిని తడిగా ఉంచడానికి లాక్రిమల్‌ గ్లాండ్స్‌ అనే ప్రధాన కన్నీటి గ్రంథితో పాటు మ్యూసిన్‌ గ్లాండ్స్, మొబిమియన్‌ గ్లాండ్స్‌ అనే మరో రెండు రకాల గ్రంథులూ తోడ్పడతాయి. ఇందులో లాక్రిమల్‌ గ్లాండ్స్‌ నీటి మోతాదులెక్కువగా ఉండే కన్నీటినీ, మ్యూసిన్‌ గ్లాండ్స్‌ కాస్త జిగురుగా ఉండే పదార్థ్ధాన్నీ, ఇక మెబొమియాన్‌ గ్లాండ్స్‌ అనేవి కాస్త నూనెలా ఉండే పదార్థాన్ని (ల్యూబ్రికెంట్‌గా ఉపయోగపడేందుకు) స్రవిస్తాయి. ఈ మూడూ కలిసి పూర్తి కన్నీటి స్రావాలకు కారణమవుతాయి. 

గ్రంథుల పనితీరు మారుతుండే లోపాలు... 
ఈ మూడు గ్రంథుల పనితీరుల్లో, దేనిలో లోపం వచ్చినా... కన్నీటి నాణ్యత దెబ్బతింటుంది. ఏయే గ్రంథుల్లో లోపాలుంటాయో, దాన్ని బట్టి కన్నుపొడిబారడమనే ప్రక్రియలోనూ తేడాలొస్తాయి. 

ఉదాహరణకు... 

  • లాక్రిమల్‌ గ్లాండ్‌ కన్నీటిలోని నీళ్లను స్రవిస్తుంది. కాబట్టి దీనిలో లోపంతో కన్నీటిలోని నీరు మోతాదులు తగ్గుతాయి.
  • మ్యూసిన్‌ తగ్గితే ‘టియర్‌ బ్రేకింగ్‌ టైమ్‌’ తగ్గుతుంది. అంటే కన్నీరు స్రవించాక అది ఓ పొర (ఫిల్మ్‌)లా ఏర్పడి... కొంతసేపు కన్ను ఉపరితలం మీద ఉంటుంది. ఏర్పడ్డ తర్వాత ఆ ఫిల్మ్‌ ఎంతసేపు ఉంటే... కంటికి అంత రక్షణ.
  • ఇక కన్ను త్వరగా పొడిబారుతుందంటే... (అంటే నీరు త్వరత్వరగా ఆవిరైపోతుందంటే) మెబోమియన్‌ గ్లాండ్స్‌ పనితీరు తగ్గిందని అర్థం. బయట గాలివేగం ఎక్కువగా ఉన్నప్పుడు (విసురుగా గాలి వీస్తున్నప్పుడు), టూవీలర్‌ డ్రైవింగ్‌లో కన్నీరు ఎక్కువగా ఆవిరవుతుంది. కానీ జీవనశైలి మార్పులతో అంటే ఏసీలు, స్క్రీన్‌ను చాలాసేపు చూడటం, పొగతాగడం వంటి అలవాట్లతో ఆవిరి కావడం పెరుగుతుంది. దీన్నే ‘ఎవాపరేటివ్‌ డ్రై ఐ’ అంటారు. 

కన్ను పొడిబారడానికి మరికొన్ని కారణాలు... 
కన్ను పొడిబారడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి... ∙వయసు పైబడటం: వయసు పెరుగుతున్న కొద్దీ కన్ను పొడిబారడమూ పెరుగుతుంటుంది. మహిళల్లో మెనోపాజ్‌ తర్వాత ఇది ఎక్కువ. ∙కొన్ని వైద్య సమస్యలు: థైరాయిడ్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, సాధారణ ఆటోఇమ్యూన్‌ సమస్యలు, కొలాజన్‌ వాస్క్యులార్‌ డిసీజ్, దీర్ఘకాలిక డయాబెటిస్, సిస్టమిక్‌ లూపస్‌ అరిథమటోసిస్‌ వంటి రుగ్మతలు ఉన్నవారిలో, కీళ్లనొప్పులతో బాధపడేవారిలో ఈ సమస్య ఎక్కువ. 

  • కొన్ని రకాల మందులు: యాంటీ డిప్రెసెంట్స్, యాంగ్జైటీని తగ్గించే మందులు, శరీరంలో నీటిని బయటకు పంపించే డైయూరెటిక్స్, మహిళల్లో గర్భనిరోధక మందులు, స్టెరాయిడ్స్, దీర్ఘకాలం పాటు గ్లకోమాకు మందులు వాడేవారిలో... ఇలా అనేక మందులతో ఈ సమస్య 
  • పెరుగుతుంది. 
  • జీవనశైలి మార్పులతో : ∙ ఏసీ  గదుల్లో ఎక్కువసేపు ఉండటం 
  • కనురెప్పలను తక్కువగా కదిలించడం... కంప్యూటర్‌పైనా లేదా ల్యాప్‌టాప్, టీవీ, మొబైల్‌ వరకూ ఏదైనా స్క్రీన్‌ను ఎక్కువగా సేపు చూస్తుండటం, మైక్రోస్కోప్‌ వంటి ఉపకరణాలపై ఎక్కువగా పనిచేయడం. ∙కనురెప్పలను పూర్తిగా మూయలేకపోవడం. 
  • కంటికి గాయం కావడం వల్ల కనురెప్పలను తగినంత కదిలించలేనప్పుడు. ∙కనురెప్ప అంచుల్లో ఇన్ఫెక్షన్‌ (బ్లెఫరైటిస్‌) ఉన్నవారిలో కన్ను పొడిబారడం ఎక్కువ. ∙కంటికి లేజర్‌ చికిత్స చేయించుకున్నవారిలో మొదటి మూడునెలల్లో మాత్రం కన్నుపొడిబారే సమస్య వచ్చేందుకు అవకాశం ఉంది. 

ఇక కొందరిలో కారణాలేవీ కనిపించకుండానే ఈ సమస్య రావచ్చు. 

కళ్లలో మంట: కళ్లలో తగినంతగా నీరు స్రవించనప్పుడు కళ్లు మంటలు వస్తాయి. కానీ కళ్లు ఎర్రబారవు.
మసక బారడం: కొందరిలో చూపు కాస్తంత మసకబారవచ్చు.
వెలుగును చూడలేకపోవడం: ఎక్కువ వెలుగును చూడలేకపోవడం, ప్రకాశవంతమైన కాంతిని భరించలేకపోవడం.
కాంటాక్ట్‌ లెన్స్‌లు పెట్టుకునేవారిలో: కాంటాక్ట్‌లెన్స్‌లు వాడటంలో ఇబ్బందిగా ఉండటం. 

ఇబ్బందులివీ..

  • కన్ను పొడిబారడం వల్ల వచ్చే సమస్యలు అందరిలో ఒకేలా ఉండవు. ఈ కింద పేర్కొన్న వాటిలో కొన్ని కనిపించవచ్చు.  ∙కొందరిలో కంటిపైన ఉండే కంజెక్టివా పొరలో ఇన్ఫెక్షన్‌ రావచ్చు. (కంజంక్టివైటిస్‌). ∙కొందరిలో కార్నియల్‌ ఇన్ఫెక్షన్‌ రావచ్చు.
  • సమస్య తీవ్రతను బట్టి కొందరి కళ్లలో చిన్న చిన్న పుండ్లు రావచ్చు. 
  • చాలా అరుదుగా కొందరిలో కార్నియా దెబ్బతినే ప్రమాదంకూడా ఉండవచ్చు. 

నిర్ధారణ ఇలా... 

  • లక్షణాలను బట్టి కంటి డాక్టర్‌లు సమస్యను నిర్ధారణ చేస్తారు. అయితే కొందరిలో కొన్ని రకాల ఇతర వ్యాధుల వల్ల (జోగ్రన్స్‌ సిండ్రోమ్‌ వంటి వాటి కారణంగా) ఇలా జరుగుతుందేమో అని చూస్తారు. అందుకే కన్ను పొడిబారిన లక్షణాలు ఉండేవారికి వ్యాధి నిర్ధారణ చేసే సమయంలో అనేక ఇతర లక్షణాలను కూడా డాక్టర్లు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. 
  • ష్కిర్మర్‌ టియర్‌ టెస్ట్‌: కొన్ని సందర్భాల్లో ష్కిర్మర్‌ పరీక్షతో దీన్ని నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షలో ఒక రకం ఫిల్టర్‌ పేపర్‌ను కంటి కిందివైపు రెప్ప కింద ఐదు నిమిషాల పాటు ఉంచుతారు. ఆ వ్యవధిలో ఆ పేపర్‌ ఎంత తడి అవుతుందో పరిశీలించడం ద్వారా లాక్రిమల్‌ గ్లాండ్‌ లోపాల్ని పరీక్షిస్తారు. 
  • టియర్‌ బ్రేకప్‌ టైమింగ్‌ : కంటి ఉపరితలంపై ఏర్పడే టియర్‌ ఫిల్మ్‌ ఎంతసేపటికి బ్రేక్‌ అవుతుందో తెలుసుకునే ఈ పరీక్షతో మ్యూసిన్‌ గ్రంథి లోపాలను తెలుసుకుంటారు. 
  • మెబోమియోగ్రఫీ : ఈ టెస్ట్‌తో మెబోమియన్‌ గ్రంథి లోపం తెలుస్తుంది. 
  • ఓసీటీ : ఆప్టికల్‌ కొహరెన్స్‌ టోమోగ్రఫీ (ఓసీటీ) అనే పరీక్ష ద్వారా టియర్‌ ఫిల్మ్‌ మందం ఎంత ఉందో తెలుసుకుంటారు. 
  • చికిత్స... గతంలో కన్నీటిని స్రవించే చుక్కల మందులు, జెల్స్‌తో చేసే చికిత్స స్థానంలో ఇప్పుడు ఏయే గ్రంథి లోపాలు ఏమిటో తెలుసుకుని, వాటికి అనుగుణంగా చేసే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు... 

కృత్రిమ కన్నీటి మందులు: కృత్రిమంగా 

  • కన్నీళ్లను పెంచే చుక్కల మందులు, జెల్‌ రూపంలో లభ్యమయ్యే మందుల్ని వాడటం ద్వారా డాక్టర్లు లాక్రిమల్‌
  • గ్లాండ్‌ పనితీరును చక్కదిద్దుతారు. ‘సైక్లో ఇమ్యూన్‌ ఐ డ్రాప్స్‌’ కూడా డ్రై ఐ చికిత్సకు ఉపయోగపడతాయి. అలాగే లాక్రిమల్‌ ప్లగ్స్‌ను వాడతారు. వీటివల్ల కన్నీళ్లు ముక్కులోకి జారిపోవు. దాంతో అవి కళ్ల లోనే ఎక్కువసేపు ఉండి కళ్లను తడిగా ఉంచుతాయి.
  • ఇక మ్యూసిన్‌ గ్రంథి పనితీరు మెరుగుపరచడానికి ‘సెక్రిటోగ్యాగ్స్‌’ అనే ఉపకరణాలు ఉపయోగిస్తారు. 
  • మొబోమియన్‌ గ్లాండ్స్‌ పనితీరును మెరుగుపరచడానికి కొన్ని రకాల మసాజ్‌లు, థెర్మో థెరపీలతో పాటు కొన్ని రకాల యాంటీబయాటిక్స్‌ వాడతారు.
  • డ్రై ఐ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నవారిలో సంప్రదాయ చికిత్సలతో తగ్గనప్పుడు బాధితుని నుంచి సీరమ్‌ (ఆటోలాగస్‌ సీరమ్‌) సేకరించి, చుక్కల రూపంలో వాడతారు. ∙శస్త్ర

చికిత్స : ఈ చికిత్సలో భాగంగా నోటిలోని అతి మృదువైన పొరలను తీసి,  కంటిలో అమర్చి... పరిస్థితిని చక్కబరుస్తారు. ఇవేకాకుండా... పని ప్రదేశాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, కంప్యూటర్‌ ముందు కంటిని హాని తక్కువగా ఉండేలా ఎలా కూర్చోవాలో, తగిన వ్యాయామాలేమిటో, బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి పనిచేసే గదిలో తేమ (హ్యుమిడిటీ) పెంచుకోవడం... ఇవన్నీ బాధితులకు కౌన్సెలింగ్‌లో డాక్టర్లు చెబుతారు. కన్నుపొడిబారిపోవడం వల్ల ఒక్కోసారి చూపుకోల్పోవడం లాంటి పెను ముప్పు ఉండే అవకాశాలు ఎక్కువ. అందుకే కన్నుపొడిబారుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులు వాడాలి.                                 ∙

(చదవండి: ‘కొలాజెన్‌ వాస్క్యులార్‌ డిసీజెస్‌' అంటే? తలెత్తే సమస్యలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement