
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. కానీ, కేరళలో మాత్రం కేసుల ఉధృతి కొనసాగుతూనే వస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు మంకీ ఫీవర్ కలకలం మొదలైంది. అయితే ఈ విషయంలో అపోహలు వద్దని చెప్తున్నారు వైద్యులు.
కేరళలో మంకీ ఫీవర్ వెలుగు చూడడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. కాగా, గత నెలలో కర్ణాటకలోనూ ఓ కేసు నమోదైంది. వయనాడు జిల్లాలోని గిరిజన ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువకుడు ఇటీవల జ్వరంతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు అతడిలో మంకీ ఫీవర్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో శాంపిల్స్ సేకరించి.. పరీక్షకు పంపగా మంకీ ఫీవర్‌గా నిర్ధారణ అయింది.
బాధిత యువకుడికి ప్రస్తుతం మనంతవాడీ వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. పేషెంట్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్‌డీ)నే మంకీ ఫీవర్‌గా పిలుస్తుంటారు. సీజనల్ ఫీవర్‌గా ఇది వస్తుందని వైద్యులు చెప్తున్నారు. మంకీ ఫీవర్ విషయంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. అయితే ఈ ఫీవర్ అంత ప్రమాదకరమైంది కాదనేది వైద్య నిపుణుల మాట.
మంకీ ఫీవర్.. టిక్-బార్న్(పేన్ల) వైరల్ హెమరేజిక్ జ్వరం. ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది, ఇందులో కోతుల ద్వారా సంక్రమించే యెల్లే ఫీవర్, డెంగ్యూ జ్వరం కూడా ఉన్నాయి. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులుగా ఉండటం దీని లక్షణాలు. కొంతమందిలో డెంగీ జ్వరానికి ఉండే లక్షణాలను కలిగి ఉంటుంది. మంకీ ఫీవర్ కారణంగా 5 నుంచి 10 శాతం మరణించే అవకాశం కూడా ఉంది. చనిపోయిన కోతుల నుంచి తాకడం ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.మనిషి ద్వారా మనిషికి సంక్రమించిన కేసులైతే ఇప్పటిదాకా నమోదు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment