జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, విరేచనాలూ, వాంతులూ... ఇలా మనలో నిత్యం కనిపించే సాధారణ లక్షణాలు ఏవి కనిపించినా అది కరోనాకు చెందిందే అని అనుమానించే పరిస్థితి. అలాంటిది... నిన్న మొన్నటివరకూ ఒక్క చెవి మాత్రమే కాస్త వెసులుబాటుగా ఉండేది. ఇప్పుడు చెవికి సంబంధించిన ఓ సమస్య సైతం కరోనాను అనుమానించే లక్షణంగా పేర్కొంటున్నారు నిపుణులు. సరికొత్త అధ్యయనాల ప్రకారం... చెవిలో రింగుమనే హోరు కరోనా లక్షణాలను సూచిస్తోందని చెబుతున్నారు. ఆ కొత్త లక్షణం గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ సంక్షిప్త కథనం.
ఇటీవల కరోనా / కోవిడ్–19 సోకిన వారిలో చెవులో హోరున శబ్దం కూడా ఓ లక్షణంగా కనిపిస్తోందని సరికొత్త అధ్యయనాల్లో తేలింది. ఇప్పటివరకూ టినైటస్ అనే కండిషన్‌లో ఏదో ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే ఉన్నట్లుగా చెవిలో గుయ్ మంటూ లేదా రింగుమంటూ హోరు వినిపించేది. అచ్చం అలాంటి హోరే ఇప్పుడు కోవిడ్–19 అటాక్ అయినప్పుడు కొంతమందిలో కనిపించడం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. దాంతో ఇప్పుడు చెవిలో టినైటస్ హోరు, వినికిడి లోపాలను సైతం కోవిడ్ లక్షణాల్లోని ఒకటిగా ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఈ తరహా సమస్యలు మొత్తం కోవిడ్ రోగుల్లోని 7 – 20 శాతం మందిలో కనిపిస్తున్నట్లు అధ్యయనవేత్తలు గుర్తించారు.
గతంలోనూ శరీరానికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కొన్ని రోజుల తర్వాత చెవిలో టినైటస్ లాంటి రింగింగ్ హోరుతో పాటు ఒకింత అరుదుగా కొందరిలో వినికిడి సమస్యలు రావడం, వర్టిగో వంటి లక్షణాలు కనిపించడం జరిగేది. ఇప్పుడు కరోనా కూడా అలాంటి వైరల్ ఇన్ఫెక్షనే కావడం వల్లనో ఏమోగానీ అచ్చం అదే తరహ లక్షణాలు / కోవిడ్–19 ఇన్ఫెక్షన్ తర్వాత కూడా కనిపిస్తున్నాయి. అయితే చిత్రం ఏమితంటే... చెవిలో హోరు, వర్టిగో, వినికిడి సమస్యలు అనేవి కొంతమంది లో తాత్కాలికంగా కొంతకాలంపాటే కనిపించి... ఆ తర్వాత పూర్తిగా నార్మల్ అయినప్పటికీ... మరికొంతమందిలో మాత్రం... పైన పేర్కొన్న చెవి సమస్యలు శాశ్వతంగా ఉండిపోతున్నాయి. మరికొందరిలో బినైన్ పెరాక్సిమల్ పొజిషన్ వర్టిగో (బీపీపీవీ) లక్షణాల్లాగా ఉండిపోతున్నాయి. అంటే హానికరం కాని వర్టిగో మాదిరిగా అన్నమాట.
ఇక ఇలాంటి సమస్యలన్నీ మళ్లీ అందరిలోనూ ఒకేలా చోటు చేసుకోవడం లేదు. కొందరిలో ఒక చెవిలో మాత్రమే సమస్య కనిపించడం, మరికొందరిలో రెండు చెవుల్లోనూ ఉండటం జరుగుతోంది. అలాగే ఈ లక్షణాలూ, తీవ్రత ప్రభావాలు సైతం ఒక్కొక్కరిలో కొందరిలో 30 శాతం నుంచి మరికొందరిలో 90 శాతం వరకు ఉండటం మరో విశేషం. అలాగే పెద్దవయసు ఉన్నవారిలోనూ, వారిలో ఇతరత్రా ఏవైనా రోగ్య సమస్యలు ఉన్నప్పుడూ ఇలాంటి చెవి సమస్యల తీవ్రత ఎక్కువగా, ఉన్నట్లు పరిశీలనలో తేలింది. ఇలా ఎందుకు జరుగుతోందనే అంశంపై ఇప్పుడు మరింత విస్తృతమైన అధ్యయనాలు జరుగుతున్నాయి.
చెవి దిబ్బడ.. వినికిడి లోపం.. ఏం చేయాలి..?
ఇప్పుడు అకస్మాత్తుగా వినికిడి లోపంగానీ లేదా చెవిలో ఆగని హోరుగానీ కనిపించే వారు ఇప్పుడు దాన్ని కూడా కోవిడ్–19 లక్షణాల్లో ఒకటిగా పరిగణించి తక్షణం కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాగే వెంటనే ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి, వారి సూచనలతో వినికిడి పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవాలి. దీనివల్ల వినికిడి కోల్పోకుండా ఉండటానికి లేదా కోల్పోయిన వినికిడి శక్తిని దాదాపుగా చాలావరకు పునరుద్ధరించుకోడానికి వీలవుతుంది. ఇందుకోసం ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే అంత మంచిది. అంటే ఇలాంటి లక్షణాలు కనిపించిన 24 గంటలలోపే చికిత్స మొదలుపెట్టడం మేలు. లేదంటే సమయం గడిచేకొద్దీ నార్మల్ అయ్యేందుకు గల అవకాశాలు క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉండవచ్చు.
చికిత్స
తొలిదశల్లో వినికిడి సమస్యలను మామూలు సమయంలో ఇచ్చే చికిత్సలతోనే వినికిడిని పునరుద్ధరించడానికి ప్రయత్నించవచ్చు. అయితే వినికిడి శక్తిని పూర్తిగా పొందలేని వారికి కాక్లియర్ ఇంప్లాంట్‌తోనూ చికిత్స చేసి వినికిడి లోపాన్ని సరిచేయవచ్చు. అలాగే ఇప్పుడు కోవిడ్ వల్ల కలిగిన లక్షణాలకూ గతంలో టినైటస్, బ్యాలన్సెంగ్ కోల్పోయినప్పుడు చేసే చికిత్సలనే చేసి ఫలితాలను రాబట్టవచ్చు. అయితే చెవిలో హోరు ఒక లక్షణంగా కనిపిస్తున్నవారూ... పోస్ట్ కోవిడ్ తర్వాత వినికిడి తగ్గినట్లుగా అనిపిస్తున్నవారు వీలైనంత త్వరగా ఈఎన్‌టీ నిపుణలను సంప్రదించడం మంచిది.
డాక్టర్ ఈ.సీ. వినయకుమార్
సీనియర్ ఈఎన్‌టీ సర్జన్
Comments
Please login to add a commentAdd a comment