ENT Doctors
-
ముగ్గురి ప్రాణాలను కాపాడిన ఈఎన్టీ
ఆదిలాబాద్: 108 అంబులెన్స్‌లో ఓ నిండు గర్భిణికి ఈఎన్టీ ప్రసూతి చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. కెరమెరి మండలం పెద్ద సాకడ గ్రామానికి చెందిన ఆత్రం గంగుబాయికి పురిటి నొప్పులు రాగా శుక్రవారం కుటుంబీకులు ఆమెను కెరమెరి పీహెచ్సీలో చేర్పించారు. కవల పిల్లలున్నారని, బీపీ కూడా అధికంగా ఉందని గుర్తించిన వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఆమెను ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్చేశారు. 108 అంబులెన్స్‌లో ఉట్నూర్‌కు తరలిస్తున్న క్రమంలో జైనూర్ మండలం ఉశేగాం సమీపంలో ఆమెకు నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే ఈఎన్టీ శ్రీనాథ్ డెలివరీ చేయగా కవలలకు జన్మనిచ్చింది. బీపీ అధికంగా ఉన్నప్పటికీ ధైర్యంగా డెలివరీ చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఈఎన్టీ శ్రీనాథ్‌ను పలువురు అభినందించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా, గంగుబాయికి ఇది రెండో కాన్పు. ఈఎన్టీ శ్రీనాథ్‌తో పాటు పైలెట్ రమాకాంత్ ఉన్నారు. -
22 రోజుల శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స
లబ్బీపేట(విజయవాడతూర్పు): పుట్టుకతోనే కుడివైపు ముక్కులో మాస్ పెరుగుదల ఉన్న 22 రోజుల శిశువుకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జీజీహెచ్ ఇఎన్టీ విభాగ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆ శిశువుకు ఎముకల ఫైబ్రోమా వ్యాధిగా నిర్ధారించిన వైద్యులు, ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక ఎండోస్కోపీ పరికరంతో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి కుడి నాసల్లోని మాస్‌ను తొలగించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక పరికరాలతో పాటు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండడంతో క్లిష్టతరమైన, అరుదైన శస్త్ర చికిత్సలను సైతం విజయవంతంగా నిర్వహించగలుగుతున్నారు. ముక్కులో మాస్‌తో ఇబ్బంది పడుతున్న శిశువును పాత ప్రభుత్వాస్పత్రి నుంచి ఇక్కడికి రిఫర్ చేయగా, ఆమెకు పుట్టుకతోనే ఉన్న వ్యాధి నిర్ధారించి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఇఎస్‌టీ విభాగాధిపతి డాక్టర్ రవి తెలిపారు. ఇఎన్టీ వైద్యులు డాక్టర్ లీలాప్రసాద్, డాక్టర్ ఆదిత్య, ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి సూర్యశ్రీ, డాక్టర్ కిరణ్‌కుమార్, డాక్టర్ సుధారాణి పాల్గొన్నారు. -
ఈఎన్టీ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ సుదీప్
ఎంజీఎం: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన ఈఎన్టీ వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. చెన్నైలో జరిగిన లైవ్ సర్జరీలను ఈ సదస్సులో ప్రదర్శించి.. పలు కొత్త అంశాలపై వైద్యులకు అవగాహన కల్పించారు. అనంతరం ఈఎన్టీ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ సుదీప్, ఎలక్ట్ ప్రెసిడెంట్‌గా రమణ, ఉపాధ్యక్షులుగా రవిశంకర్, కార్యదర్శిగా రమేశ్, జాయింట్ సెక్రటరీగా రవికాంత్, కోశాధికారిగా సాహెల్ హమీద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా గిఫ్ట్సన్, గౌడ రమేశ్, వెంకటరత్నం ఎన్నికయ్యారు. -
ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న సూది: విజయవంతంగా శస్త్రచికిత్స
కర్నూలు (హాస్పిటల్): పొరపాటున మింగిన నీడిల్ (సూది) ఊపిరితిత్తుల్లో ఇరుక్కుంది. కర్నూలులోని సత్యసాయి ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు ఆధునిక పరికరాలతో ఆ సూదిని తొలగించి ఆయువు పోశారు. వివరాలను గురువారం ఎన్ఆర్ పేటలోని శ్రీ సత్యసాయి ఈఎన్టీ ఆస్పత్రిలో వైద్యులు డాక్టర్ బి.జయప్రకాశ్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి చెందిన పరశురాముడు పశువులకు వేసే సూదిమందు ఇచ్చే నీడిల్ (సూదిని) నోటిలో పెట్టుకుని పరధ్యానంగా ఉన్నాడు. ఈ సమయంలో ఆ సూది పొరపాటున గొంతులోకి వెళ్లింది. దీంతో అతను ఉక్కిరిబికిరి అయ్యాడు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారి విపరీతమైన దగ్గు, గొంతునొప్పితో బాధపడుతుండడంతో ఆస్పత్రిలో చేరాడు. పరిశీలించిన వైద్యులు అత్యాధునిక వైద్యపరికరాలైన టెలిస్కోపిక్ బ్రాంకోస్కోప్ ద్వారా చాకచక్యంగా ఆ సూదిని బయటకు తీశారు. ఇప్పటివరకు తాను నిర్వహించిన చికిత్సల్లో ఇది ఎంతో క్లిష్టమైందని డాక్టర్ జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు. -
చెవిలో హోరుమని శబ్దమా? అయితే అనుమానించాల్సిందే!
జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, విరేచనాలూ, వాంతులూ... ఇలా మనలో నిత్యం కనిపించే సాధారణ లక్షణాలు ఏవి కనిపించినా అది కరోనాకు చెందిందే అని అనుమానించే పరిస్థితి. అలాంటిది... నిన్న మొన్నటివరకూ ఒక్క చెవి మాత్రమే కాస్త వెసులుబాటుగా ఉండేది. ఇప్పుడు చెవికి సంబంధించిన ఓ సమస్య సైతం కరోనాను అనుమానించే లక్షణంగా పేర్కొంటున్నారు నిపుణులు. సరికొత్త అధ్యయనాల ప్రకారం... చెవిలో రింగుమనే హోరు కరోనా లక్షణాలను సూచిస్తోందని చెబుతున్నారు. ఆ కొత్త లక్షణం గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ సంక్షిప్త కథనం. ఇటీవల కరోనా / కోవిడ్–19 సోకిన వారిలో చెవులో హోరున శబ్దం కూడా ఓ లక్షణంగా కనిపిస్తోందని సరికొత్త అధ్యయనాల్లో తేలింది. ఇప్పటివరకూ టినైటస్ అనే కండిషన్లో ఏదో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఉన్నట్లుగా చెవిలో గుయ్ మంటూ లేదా రింగుమంటూ హోరు వినిపించేది. అచ్చం అలాంటి హోరే ఇప్పుడు కోవిడ్–19 అటాక్ అయినప్పుడు కొంతమందిలో కనిపించడం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. దాంతో ఇప్పుడు చెవిలో టినైటస్ హోరు, వినికిడి లోపాలను సైతం కోవిడ్ లక్షణాల్లోని ఒకటిగా ఇప్పుడు గుర్తిస్తున్నారు. ఈ తరహా సమస్యలు మొత్తం కోవిడ్ రోగుల్లోని 7 – 20 శాతం మందిలో కనిపిస్తున్నట్లు అధ్యయనవేత్తలు గుర్తించారు. గతంలోనూ శరీరానికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కొన్ని రోజుల తర్వాత చెవిలో టినైటస్ లాంటి రింగింగ్ హోరుతో పాటు ఒకింత అరుదుగా కొందరిలో వినికిడి సమస్యలు రావడం, వర్టిగో వంటి లక్షణాలు కనిపించడం జరిగేది. ఇప్పుడు కరోనా కూడా అలాంటి వైరల్ ఇన్ఫెక్షనే కావడం వల్లనో ఏమోగానీ అచ్చం అదే తరహ లక్షణాలు / కోవిడ్–19 ఇన్ఫెక్షన్ తర్వాత కూడా కనిపిస్తున్నాయి. అయితే చిత్రం ఏమితంటే... చెవిలో హోరు, వర్టిగో, వినికిడి సమస్యలు అనేవి కొంతమంది లో తాత్కాలికంగా కొంతకాలంపాటే కనిపించి... ఆ తర్వాత పూర్తిగా నార్మల్ అయినప్పటికీ... మరికొంతమందిలో మాత్రం... పైన పేర్కొన్న చెవి సమస్యలు శాశ్వతంగా ఉండిపోతున్నాయి. మరికొందరిలో బినైన్ పెరాక్సిమల్ పొజిషన్ వర్టిగో (బీపీపీవీ) లక్షణాల్లాగా ఉండిపోతున్నాయి. అంటే హానికరం కాని వర్టిగో మాదిరిగా అన్నమాట. ఇక ఇలాంటి సమస్యలన్నీ మళ్లీ అందరిలోనూ ఒకేలా చోటు చేసుకోవడం లేదు. కొందరిలో ఒక చెవిలో మాత్రమే సమస్య కనిపించడం, మరికొందరిలో రెండు చెవుల్లోనూ ఉండటం జరుగుతోంది. అలాగే ఈ లక్షణాలూ, తీవ్రత ప్రభావాలు సైతం ఒక్కొక్కరిలో కొందరిలో 30 శాతం నుంచి మరికొందరిలో 90 శాతం వరకు ఉండటం మరో విశేషం. అలాగే పెద్దవయసు ఉన్నవారిలోనూ, వారిలో ఇతరత్రా ఏవైనా రోగ్య సమస్యలు ఉన్నప్పుడూ ఇలాంటి చెవి సమస్యల తీవ్రత ఎక్కువగా, ఉన్నట్లు పరిశీలనలో తేలింది. ఇలా ఎందుకు జరుగుతోందనే అంశంపై ఇప్పుడు మరింత విస్తృతమైన అధ్యయనాలు జరుగుతున్నాయి. చెవి దిబ్బడ.. వినికిడి లోపం.. ఏం చేయాలి..? ఇప్పుడు అకస్మాత్తుగా వినికిడి లోపంగానీ లేదా చెవిలో ఆగని హోరుగానీ కనిపించే వారు ఇప్పుడు దాన్ని కూడా కోవిడ్–19 లక్షణాల్లో ఒకటిగా పరిగణించి తక్షణం కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాగే వెంటనే ఈఎన్టీ వైద్యులను సంప్రదించి, వారి సూచనలతో వినికిడి పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవాలి. దీనివల్ల వినికిడి కోల్పోకుండా ఉండటానికి లేదా కోల్పోయిన వినికిడి శక్తిని దాదాపుగా చాలావరకు పునరుద్ధరించుకోడానికి వీలవుతుంది. ఇందుకోసం ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే అంత మంచిది. అంటే ఇలాంటి లక్షణాలు కనిపించిన 24 గంటలలోపే చికిత్స మొదలుపెట్టడం మేలు. లేదంటే సమయం గడిచేకొద్దీ నార్మల్ అయ్యేందుకు గల అవకాశాలు క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉండవచ్చు. చికిత్స తొలిదశల్లో వినికిడి సమస్యలను మామూలు సమయంలో ఇచ్చే చికిత్సలతోనే వినికిడిని పునరుద్ధరించడానికి ప్రయత్నించవచ్చు. అయితే వినికిడి శక్తిని పూర్తిగా పొందలేని వారికి కాక్లియర్ ఇంప్లాంట్తోనూ చికిత్స చేసి వినికిడి లోపాన్ని సరిచేయవచ్చు. అలాగే ఇప్పుడు కోవిడ్ వల్ల కలిగిన లక్షణాలకూ గతంలో టినైటస్, బ్యాలన్సెంగ్ కోల్పోయినప్పుడు చేసే చికిత్సలనే చేసి ఫలితాలను రాబట్టవచ్చు. అయితే చెవిలో హోరు ఒక లక్షణంగా కనిపిస్తున్నవారూ... పోస్ట్ కోవిడ్ తర్వాత వినికిడి తగ్గినట్లుగా అనిపిస్తున్నవారు వీలైనంత త్వరగా ఈఎన్టీ నిపుణలను సంప్రదించడం మంచిది. డాక్టర్ ఈ.సీ. వినయకుమార్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ -
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్
గుంటూరు మెడికల్: పుట్టుకతోనే చెవుడు సమస్యతో బాధపడుతున్న బాలుడి రెండు చెవులకు రూ.12 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌ను గుంటూరులో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశారు. దేశంలోనే మొదటిసారిగా రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారు. దీంతో గుంటూరు ఈఎన్టీ వైద్యులు తొలిసారిగా రెండు చెవులకు ఆపరేషన్ చేసి బాలుడి వినికిడి సమస్యను తొలగించారు. గుంటూరు కొత్తపేటలోని బయ్యా ఈఎన్టీ హాస్పిటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ బయ్యా శ్రీనివాసరావు ఈ వివరాలు తెలిపారు. గుంటూరుకు చెందిన పఠాన్ ఆరిఫ్‌ఖాన్, రిహానాల రెండో సంతానం హర్షద్‌ఖాన్ (3)కు పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంది. తల్లిదండ్రులు డాక్టర్ బయ్యా శ్రీనివాసరావును సంప్రదించగా ఆరునెలల కిందట ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేశారు. రెండునెలల కిందట హర్షద్‌ఖాన్ తల్లిదండ్రులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వివరించగా ఆయన రెండో చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసేందుకు ఆదేశాలు జారీచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకంలో ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ రెండు చెవులకు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సౌకర్యం కల్పించారు. ఈ సౌకర్యాన్ని వినియోగించి బాలుడికి ఉచితంగా ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ బయ్యా శ్రీనివాసరావు చెప్పారు. ఆరునెలల కిందట ఒక చెవికి, నవంబర్ 30న రెండో చెవికి విజయవంతంగా ఆపరేషన్ చేశామన్నారు. ఆపరేషన్లోసర్జన్ డాక్టర్ బయ్యా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈఎన్టీ పరీక్షలకు కసరత్తు
నల్లగొండ టౌన్ : జిల్లాలో ఒకవైపు కంటివెలుగు వైద్యశిబిరాలను ముమ్మరంగా నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ.. ఫిబ్రవరి మాసంలో ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతుతోపాటు డెంటల్ ) పరీక్షలను నిర్వహించడానికి కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో గత ఆగస్టు 15న ప్రారంభమైన కంటివెలుగు శిబిరాలను ఈ నెల 26 వరకు పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ కొంత ఆలస్యమయ్యే అవకాశం కని సిస్తోంది. ఆ శిబిరాలను యధావిధిగా కొనసాగిస్తూనే ఈఎన్టీ పరీక్షల శిబిరాలను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించడానికి అ వసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌నుంచి ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లో నివసిస్తున్న కుటుంబాల స భ్యులందరి ఆరోగ్య వివరాలతో కూడిన నివేదికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన శిక్షణను ఏఎన్ఎంలకు పూర్తి చేశారు. ఏఎన్ఎంల వద్ద ఉన్న ల్యాప్‌ట్యాప్‌ల్లోకి 2014 సమగ్ర కుటంబ సర్వే లెక్కల ప్రకారం కుటుంబాల ఆరోగ్య వివరాలు ఎస్కెఎస్ నుంచి డౌన్లోడ్ ఆయ్యా యి. దీనిలో ఆయా కుటుంబ యజమాని ఆధార్ నంబర్‌ను నమోదు చేస్తే ఆ కుటుంబ సభ్యుల వివరా లు, ఆరోగ్య స్థితిగుతులు తెలిసిపోనున్నాయి. వాటి ఆధారంగా వారి వద్దకు వెళ్లి సభ్యుల ఆరోగ్య స్థితిగతులను ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ కుటుంబంలోని సభ్యులు మరణిస్తే వారి పేరును తొలగించడం, కొత్త సభ్యులు వస్తే నమోదు చేయడం వంటి సదుపాయం కూడా కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గంగవరప్రసాద్ ఈ నెల 16వ తేదీలోగా హెల్త్ ప్రొఫైల్‌ను పూర్తి చేసి తమకు అందజేయాలని ఆయా వైద్యాధికారులకు, డిప్యూటి డీఎంహెచ్ఓలకు, ఏఎన్ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏఎన్ఎంలు హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన అన్ని కుటుంబాల హెల్త్ ప్రొఫైల్‌ను రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు పంపించనున్నారు. తదనంతరం అక్కడినుంచి ఇచ్చే గైడ్‌లైన్స్ మేరకు ఫిబ్రవరిలో ఈఎన్టీ పరీక్షల క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. శిబిరాల కోసం అవసరమైన ఈఎన్టీ డాక్టర్లు, ఆడియాలజిస్టులు, డెంటల్ డాక్టర్ల నియామకంతో పాటు పరీక్షలకు కావాల్సిన పరికరాలను రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆదేశాలు రాగానే ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఈఎన్టీ పరీక్షలు నిర్వహించడానికి ఏ ర్పాట్లు చేసుకుంటున్నాం. ఇప్పటికే ఆ యా కుటుంబ సభ్యుల హెల్త్ ఫ్రొఫైల్‌ను అన్ని పట్టణాలు, గ్రామాలలో సి బ్బంది సేకరిస్తున్నారు. హెల్త్ ప్రొఫైల్ ఆ ధారంగా కమిషనర్ ఇచ్చే గైడ్‌లైన్స్ ప్రకా రం శిబిరాలను ఏర్పాటు చేయనున్నాం. – డాక్టర్ గంగవరప్రసాద్, డీఎంహెచ్ఒ -
తప్పుడు రిపోర్టుతో నాలుకకు ఎసరు!
మహబూబాబాద్ అర్బన్: వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడి గొంతు మూగబోయింది. కేన్సర్ ఉన్నా.. లేదని తప్పుడు రిపోర్టు ఇవ్వడం.. చివరకు నాలుక తొలగించాల్సి వచ్చింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగుచూసింది. కేసముద్రం మండలం మహమూద్పట్నంకు చెందిన శ్రీనివాస్ నాలుకకు పుండ్లు కాగా.. జిల్లా కేంద్రంలోని శ్రీరామకృష్ణ నర్సింగ్ హోమ్‌లోని ఈఎన్టీ వైద్యుడు భార్గవ్ వద్దకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు.. శ్రీనివాస్ నాలుక చిన్న ముక్కను కోసి ల్యాబ్‌కు పంపాడు. మూడు రోజుల తర్వాత కేన్సర్ లేదని రిపోర్టు వచ్చింది. దీంతో మూడు నెలలు మందులు వాడాలని రాసిచ్చాడు. అయితే.. మందులు వాడినా నాలుక పైన పుండ్లు తగ్గకపోవడంతో శ్రీనివాస్ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి ఈఎన్టీ వైద్యుడు పరీక్షించగా కేన్సర్ అని తేలింది. వైద్యుడి సలహా మేరకు శ్రీనివాస్ హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి వెళ్లగా కేన్సర్ నాలుక మొత్తానికి వ్యాపించిందని, నాలుక పూర్తిగా తొలగించకుంటే శరీరమంతా వ్యాపించి ప్రాణాలకు ముప్పు ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో గత్యంతరం లేక నాలుకను తీయించుకున్నాడు. కేన్సర్ వ్యాప్తికి కారకుడైన డాక్టర్ భార్గవ్‌పై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన, ధర్నా నిర్వహించారు. టౌన్ ఎస్ఐ అరుణ్‌కుమార్ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. -
బాలుడి గొంతులో ఎముక తొలగింపు
అనంతపురం న్యూసిటీ: బాలుడి గొంతులు ఇరుక్కున్న చికెన్ ముక్క (ఎముక)ను సర్వజనాస్పత్రి ఈఎన్టీ వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. నల్లమడ మండలం రెడ్డిపల్లికి చెందిన నరేష్కుమార్, సంధ్య దంపతుల కుమారుడు ఐదేళ్ల వినయ్‌కుమార్ ఈ నెల 25వ తేదీన భోజనం చేసే సమయంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. నరకయాతన పడుతున్న బాలుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన కదిరి ఆస్పత్రి, అక్కడి నుంచి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఆపరేషన్ విజయవంతం : సర్వజనాస్పత్రి వైద్యులు సకాలంలో స్పందించారు. గురువారం రాత్రంతా వారి పర్యవేక్షణలోనే ఉంచారు. శుక్రవారం ఉదయం ఈఎన్టీ హెచ్ఓడీ డాక్టర్ నవీద్‌అహ్మద్ నేతృత్వంలో వైద్యులు డాక్టర్ రాజేష్, డాక్టర్ అనూష, అనస్తీషియా వైద్యులు డాక్టర్ శ్రీహరిల బృందం అరగంట పాటు శ్రమించి ఈసోఫాగోస్కోపీ ద్వారా బాలుడి గొంతులో ఇరుక్కున్న ఎముకను తొలగించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, లేకపోతే ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారేదని హెచ్ఓడీ డాక్టర్ నవీద్ అహ్మద్ పేర్కొన్నారు. ఎముకను తొలగించడంతో బాబు కుటుంబీకులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈఎన్టీ వైద్యులను సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ అభినందించారు.