ఫ్లూ జ్వరం ఎందుకొస్తుంది? రాకుండా ముందుగానే నివారించొచ్చా? | What Is Flu, Know Its Symptoms, Causes, Preventive Tips And Treatment In Telugu - Sakshi
Sakshi News home page

Flu Symptoms And Treatment: ఫ్లూ జ్వరం ఎందుకొస్తుంది? రాకుండా ముందుగానే నివారించొచ్చా?

Published Tue, Oct 24 2023 10:16 AM | Last Updated on Tue, Oct 24 2023 12:11 PM

How To Prevent the Flu: Symptoms And Causes - Sakshi

గత కొద్దికాలంగా జ్వరాలు, దగ్గు, జలుబుతో పాటు శ్వాస సరిగా అందకపోవడం వంటి ఫ్లూ లక్షణాలతో చాలామంది హాస్పిటళ్లకు పరుగులెత్తుతున్నారు. జ్వరం తగ్గాక కూడా పొడి దగ్గు, కొందరిలో కఫంతో కూడిన దగ్గు  ఒక పట్టాన తగ్గకపోవడంతో ఆందోళన పడుతున్నారు. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. బాధితుల నుంచీ  ఇవే కంప్లెయింట్స్‌తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని చాలా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఫ్లూ జ్వరాలు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఇవి ఎందుకిలా వస్తున్నాయి, లక్షణాలేమిటి, ముందస్తు నివారణకూ లేదా ఇప్పటికే వచ్చి ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. 

ఫ్లూలాంటి జ్వరాలు... లక్షణాలూ, జాగ్రత్తలుఇటీవల వస్తున్న ఫ్లూలాంటి జ్వరాలన్నింటికీ ఇన్‌ఫ్లుయెంజా, పారా ఇన్‌ఫ్లుయెంజా వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లు ప్రధాన కారణమని వైద్య నిపుణుల భావన. రెండుమూడేళ్ల కిందట వచ్చిన కరోనా వైరస్‌ తాలూకు తీవ్రత బాగా తగ్గిపోయి, పెద్దగా ప్రమాదకరం కాని కోవిడ్‌ కూడా ఈ జ్వరాల కారణాల్లో ఒకటి కావచ్చునని కూడా వైద్యవర్గాలు భావిస్తున్నాయి. రాబోయేది చలికాలం కావడంతో ఇవే జ్వరాలు... దాదాపు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి వరకు కొనసాగవచ్చని డాక్టర్లు అంచనా 
వేస్తున్నారు.

లక్షణాలు : దాదాపు ఫ్లూ జ్వరాల్లో కనిపించే అన్ని లక్షణాలూ ఈ సీజనల్‌ ఫీవర్స్‌లో కనిపిస్తున్నాయి. ఉదాహరణకు... ∙జ్వరం ∙తలనొప్పి ∙ఒళ్లునొప్పులు ∙గొంతునొప్పి  ∙గొంతు కాస్త బొంగురుగా మారడం ∙కొన్నిసార్లు (తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ఈ లక్షణాలు ఐదు నుంచి దాదాపు గరిష్ఠంగా పదిరోజులు ఉంటాయి. 

నిర్ధారణ పరీక్షలు / చికిత్స 
ముక్కు, గొంతు స్వాబ్‌తో కరోనా లేదా ఇతర ఇన్‌ఫ్లుయెంజా వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఉన్నాయా అని నిర్ధారణ చేయవచ్చు.  తీవ్రత తక్కువగా ఉన్నవాళ్లకి (జ్వరం, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు లక్షణాలు గలవారికి) ఇంటివద్దనే లక్షణాలకు తగినట్లుగా పారాసిటమాల్, ఓఆర్‌ఎస్, దగ్గు సిరప్‌లతో చికిత్స అందించవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి అంటే... విపరీతమైన దగ్గు, ఆయాసం, ఆక్సిజన్‌ తగ్గిపోవడం వంటి లక్షణాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిని హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందించాలి. 

నివారణ / జాగ్రత్తలు:  

  • దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. చేతి రుమాలు లేనప్పుడు తమ ఫుల్‌ స్లీవ్స్‌లోకి తుమ్మడం మంచిది. దీని వల్ల వైరస్‌ లేదా వ్యాధిని సంక్రమింపజేసే సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు. కరోనా సమయంలోలా వీలైతే జ్వరం, దగ్గు తగ్గేవరకు మాస్క్‌ ధరించడం మేలు. ∙దగ్గు లేదా తుమ్మినపుడు  చేతులను అడ్డుపెట్టుకున్నవారు,  తర్వాత చేతుల్ని 20 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కోవాలి లేదా శానిటైజర్‌ వాడాలి. 
  • దగ్గు/తుమ్ము సమయంలో ఒకరు వాడిన రుమాలును వేరొకరు ఉపయోగించకూడదు. దాన్ని తప్పనిసరిగా డిస్పోజ్‌ చేయాలి.
  • జలుబు లేదా ఫ్లూ లక్షణాలున్న వ్యక్తులనుంచి దూరంగా ఉండాలి ∙బాధితుల పక్కబట్టలను, పాత్రలను విడిగా 
  • ఉంచాల్సినంత అవసరం లేదుగానీ... వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒకరి బట్టలు, పాత్రలను మరొకరు వాడకపోవడమే మంచిది. 
  • బాధితుల్ని మిగతావారి నుంచి కాస్త విడిగా (ఐసోలేషన్‌) ఉంచటం మేలు. ∙ఇన్‌ఫ్లుయెంజాకు, కోవిడ్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. వ్యాధి తీవ్రత తగ్గించడానికీ, హాస్పిటల్‌లో చేరికల నివారణకు వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిది. 
  • ఈ జ్వరాలు చాలావరకు పెద్దగా ప్రమాదకరం కావు. అరుదుగా ఎవరిలోనైనా పరిస్థితి మరీ తీవ్రంగా మారితే... తక్షణం బాధితుల్ని ఆసుపత్రికి 
  • తరలించాలి. 

వీళ్లలో తీవ్రత ఎక్కువ...
ఇప్పటికే ఆస్తమా, దీర్ఘకాలిక లంగ్స్‌ సమస్యలు, బ్రాంకైటిస్, దీర్ఘకాలిక గుండెజబ్బులతో బాధపడేవారు, హార్ట్‌ ఫెయిల్యూర్, కరోనరీ ఆర్టరీ డిసీజ్‌ బాధితులు, దీర్ఘకాలిక కిడ్నీ/లివర్‌ వ్యాధులున్నవారు, కొన్ని ఆటోఇమ్యూన్‌ డిసీజ్‌లతో బాధపడుతూ స్టెరాయిడ్‌ చికిత్స తీసుకుంటున్నవారూ, లుకేమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా ఉన్నవారు, వయోవృద్ధులూ వారితోపాటు ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు... వీళ్లందరి లోనూ లక్షణాల్లో తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిద్రలేమి, పల్స్‌ ఆక్సిమీటర్‌తో పరీక్షించినప్పుడు ఆక్సిజన్‌ శాచ్యురేషన్స్‌ తగ్గడం, ఆక్సిజన్‌ మోతాదుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడి బాధితుల్ని ఆసుపత్రులకు తీసుకురావాల్సిన అవసరమూ ఏర్పడుతుంది.

 

డాక్టర్‌ వి రాజమనోహర్‌ ఆచార్యులు, సీనియర్‌ కన్సల్టెంట్‌, పల్మనాలజిస్ట్‌

(చదవండి: నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేపించే వ్యాధి!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement