వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరపు వస్తుండటం సహజం. మతిమరపును ఇంగ్లిష్‌లో ‘డిమెన్షియా’ అంటారు. డిమెన్షియాకు కారణాల్లో అత్యంత సాధారణమైంది ‘అల్జైమర్స్’ అయితే... దానితో పోలిస్తే... దానికంటే కొద్దిగా అరుదైనది వాస్క్యులార్ డిమెన్షియా. ఈ సందర్భంగా మతిమరపునకు కారణమయ్యే అల్జైమర్స్ డిమెన్షియా, వాస్క్యులార్ డిమెన్షియాలపై అవగాహన కోసం ఈ కథనం.
డిమెన్షియా, అల్జైమర్స్‌ని ఓ వ్యాధిగా కాకుండా ఓ సిండ్రోమ్‌గా చెప్పవచ్చు. అంటే... నిర్దిష్టంగా ఓ వ్యాధి లక్షణంతో కాకుండా... అనేక లక్షణాల సమాహారంతో కనిపించే ఆరోగ్య సమస్యను సిండ్రోమ్ అనవచ్చు. డిమెన్షియా ఉన్నప్పుడు అది కొత్త అంశాల్ని నేర్చుకునేందుకు దోహదపడే (కాగ్నిటివ్) నైపుణ్యాల్లోని జ్ఞాపకశక్తి (మెమరీ)పైనా, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం (రీజనింగ్)పైనా ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. అల్జైమర్స్ విషయానికి వస్తే ఇది కూడా డిమెన్షియాలో ఒక రకం. అందుకే దీన్ని అల్జైమర్స్ డిమెన్షియా (ఏడీ) అనవచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడిది చాలా సాధారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత నలుగురితో కలవకపోవడం, ఒంటరితనం, మానసిక ఒత్తిడి లాంటి అంశాల కారణంగా అల్జైమర్స్ పెరిగింది.
అల్జైమర్స్ డిమెన్షియా: కొన్ని నెలలు మొదలుకొని ఏళ్ల వ్యవధిలో క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. ఒకసారి అల్జైమర్స్ మొదలయ్యాక బాధితుల్ని మునపటిలా అయ్యేలా చికిత్స సాధ్యం కాదు. కాకపోతే దీనిలో మరపు అన్నది మొదట్లో తాజా తాజా విషయాలు మొదలుకొని... క్రమంగా పాత విషయాల్ని మరచిపోతుంటారు. తాము ఎంతోకాలంగా నివాసమున్న ప్రదేశాల్నీ, కాలాన్నీ (అది పగలా, రాత్రా అన్నదానితో సహా) మరచిపోతారు. ప్రశ్నలకు సమాధానాలివ్వలేకపోవడం, కుటుంబ సభ్యుల్ని అడిగిన ప్రశ్నల్నే మళ్లీ మళ్లీ అడగడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ప్రవర్తనలో మార్పు రావడం... చివరకు సొంత కుటుంబ సభ్యుల్ని సైతం గుర్తుపట్టలేనంతగా మరచిపోతారు.
వాస్క్యులార్ డిమెన్షియా
మతిమరపులకు ‘వాస్క్యులార్ డిమెన్షియా’ అనేది ‘అల్జైమర్స్ డిమెన్షియా’ కంటే రెండో అతి ముఖ్యమైన కారణం. మెదడుకు క్రమంగా రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల వస్తుంది కాబట్టి దీన్ని ‘వాస్క్యులార్ డిమెన్షియా’గా చెబుతారు. ఇది కొందరిలో అకస్మాత్తుగా కనిపిస్తుంది. ఫలితంగా అభ్యాస, అధ్యయన, నేర్చుకునే ప్రక్రియలు... ఇలా ఇవన్నీ మరుస్తూపోవడం వల్ల పరిస్థితి అకస్మాత్తుగా దిగజారిపోతుంది.
మతిమరుపు, అల్జైమర్స్ తెచ్చి పెట్టే అంశాల్లో కొన్ని... జన్యుపరమైనవి: మతిమరపులో జన్యుపరమైన అంశాలు కీలకమైన భూమిక పోషిస్తాయి. కొందరి కుటుంబాల్లో వంశపారం పర్యంగా కనిపిస్తుంటాయి. ఏపీఓఈ 4 ఎల్లీల్ వంటి కొన్ని నిర్దిష్టమైన జన్యువులు ఈ ముప్పులను పెంచుతాయి.
వయసు : పెరిగే వయసు మతిమరపును తెచ్చిపెట్టే అల్జైమర్స్, వాస్క్యులార్ డిమెన్షియాలకు ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్. పైగా ఇది నిరోధించలేని అంశం.
జీవనశైలి (లైఫ్ స్టైల్) : ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించని వాళ్లలో అంటే... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, పొగ, ఆల్కహాల్ అలవాట్ల వంటì అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారిలో ఈ ముప్పులు ఎక్కువ.
దేహంలోని ఇతర సమస్యలు : దీర్ఘకాలికంగా ఉండే డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు మెదడు పనితీరుపై ప్రతికూలం ప్రభావం చూపి, పరోక్షంగా అల్జైమర్స్, వాస్క్యులార్ అల్జైమర్స్‌కూ, గురకను కల్పించే స్లీప్ ఆప్నియాకు కారణమవుతాయి.
వాతావరణ అంశాలు : వాతావరణ కాలుష్యాలూ, విషపూరిత వ్యర్థాలూ చాలావరకు మతిమరపునకు కారణమవుతాయి. అందుకే వీలైనంతవరకు పరిశుభ్రమైన ప్రదేశాలూ, కాలుష్యాలు లేని వాతావరణాలూ వీటి నివారణకు చాలావరకు తోడ్పడతాయి.
ఆహారం : పోషకాలన్నీ ఉండే సమతులాహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా భారతీయ వంటల్లో ఉపయోగించే పసుపు, మెడిటేరియన్ డైట్ (ఆల్మండ్స్, వాల్‌నట్, డార్క్ చాక్లెట్స్, ఆలివ్ ఆయిల్, క్రాన్‌బెర్రీ) వంటివి మతిమరపు నివారణకు తోడ్పడతాయి.
నివారణ... పై అంశాలలో పెరిగే వయసు, జన్యుపరమైన అంశాలు నిరోధించలేనివి. ఇవి మినహా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్‌ను ప్రయత్నపూర్వకంగా అదుపులో ఉంచడం ద్వారా వీటిని చాలావరకు నివారించవచ్చు. ఈ కింది అంశాలు నివారణకు చాలావరకు తోడ్పడతాయి.
వ్యాయామం : దేహాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామాలు చేయాలి. ఫలితంగా మెదడుకు రక్తప్రసరణ పెరిగి, న్యూరాన్లూ వాటి న్యూరల్ కనెక్షన్లు, జీవక్రియల కోసం మెదడు స్రవించే రసాయనాలన్నీ ఆరోగ్యకరంగా ఉంటాయి. దాంతో జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
మెదడుకు మేత : కొత్త భాషలు నేర్చుకోవడం, పుస్తక పఠనం, పజిల్స్ సాధించడం, మెదడుకు మేత కల్పించే పొడుపుకథలు, ఉల్లాసంగా ఉంచే హాబీలు, మానసిక వ్యాయామాలు మెదడును ఆరోగ్యంగా ఉంచి మతిమరపు నివారణకు తోడ్పడతాయి.
దీర్ఘకాలిక వ్యాధుల అదుపు : డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధులను అదుపులో పెట్టుకోవాలి.
నలుగురిలో ఒకరిగా : వేడుకలు, పుట్టినరోజులూ, పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లలో పదిమందినీ కలవడం వంటివి మతిమరపును దూరం చేస్తుంది. చికిత్స : అలై్జమర్స్ డిమెన్షియానూ, వాస్క్యులార్ డిమెన్షియానూ పూర్తిగా తగ్గించే మందులు లేకపోయినప్పటికీ... వాటి పురోగతిని ఆలస్యం చేయడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. లక్షణాల తీవ్రత ఆధారంగా డోనెపెజిల్, రివాస్టిగ్మిన్, మెమాంటిన్, గ్యాలంటమైన్ వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ‘లెకానిమ్యాబ్’ అనే సరికొత్త మందును ఈ ఏడాదే ఎఫ్‌డీఏ ఆమోదించింది. పైవన్నీ నోటిద్వారా తీసుకునే మందులు కాగా... లెకానిమ్యాబ్‌ను రెండోవారాలకు ఒకసారి సూది మందు రూపంలో ఇస్తారు.
(చదవండి: మానవుడికి పంది కిడ్నీ..ప్రయోగం విజయవంతం)
Comments
Please login to add a commentAdd a comment