అల్జీమర్స్. వయసుతో పాటు వచ్చే మతిమరుపు. ఇది కొందరిలో మరణానికీ దారి తీస్తుంది. అయితే కొన్ని రకాల వృత్తుల్లోని వారికి అల్జీమర్స్ వచ్చే అవకాశమే లేదంటున్నాయి అధ్యయనాలు! ముఖ్యంగా డ్రైవింగ్‌లో ఉండేవాళ్లు ఆల్జీమర్స్‌తో మరణించే ప్రమాదం తక్కువట. అయితే బైక్ నడిపేవాళ్లు ఈ జాబితాలోకి రారు. అలాగే పైలట్లకు కూడా ఇది వర్తించదు. టాక్సీ, అంబులెన్స్ వంటివాటిని నడిపేవాళ్లకే అల్జీమర్స్ వచ్చే అవకాశం తక్కువట.
అల్జీమర్స్ మెదడు వ్యాధి. జ్ఞాపకశక్తిని, ఆలోచనలను, రోజువారీ పని చేసే శక్తిని క్రమంగా తగ్గించేస్తుంది. ఇది వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపతుంది. మెదడు కణాలు దెబ్బతినడం, సరిగా పని చేయకపోవడం అల్జీమర్స్‌కు దారితీస్తుంది. దాంతో గందరగోళంగా మాట్లాడటం, అత్యంత సన్నిహితులను కూడా గుర్తించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
అమెరికాలోని మాస్ జనరల్ బ్రిగమ్ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. 2020 నుంచి 2022 మధ్య మరణించిన 90 లక్షల మంది వైద్య చరిత్రను పరిశీలించారు. వీరిలో 443 రకాల వృత్తులకు సంబంధించిన వారున్నారు. వారిలో 3.88 శాతం మరణాలు, అంటే మూడున్నర లక్షల మంది అల్జీమర్స్‌తో చనిపోయారు. వారిలో ట్యాక్సీ, అంబులెన్స్ డ్రైవర్లు చాలా తక్కువ మంది ఉండటాన్ని పరిశోధకులు గమనించారు.
ఆ డ్రైవర్లకు ఎందుకు రాదంటే...
పరిశోధన ఫలితాలను లోతుగా అధ్యయనం చేసిన మీదట ఆసక్తికరమైన అంశాలు వెల్లడైనట్టు సైంటిస్టులు తెలిపారు. అవేమిటంటే...
→ అల్జీమర్స్ ప్రారంభంలో మెదడులోని హిప్పోకాంపస్ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది.
→ టాక్సీ, అంబులెన్స్ డ్రైవర్లలో రియల్ టైమ్ స్పేషియల్ థికింగ్, నావిగేషన్ ఈ హిప్పోకాంపస్‌కు చక్కని వ్యాయామంలా పని చేస్తున్నాయట.
→ ఈ నిరంతర వ్యాయామం వల్ల వారిలో అది చురుగ్గా, చైతన్యవంతంగా పని చేస్తోంది.
→ అదే బస్సు డ్రైవర్లు, విమానాల పైలట్లలో అంత నావిగేషన్ స్కిల్స్ ఉండటం లేదని అధ్యయన బృందం సారథి డాక్టర్ విశాల్ పటేల్ తెలిపారు.
→ నావిగేషన్స్ స్కిల్స్ పెంచే మానసిక వ్యాయామాలు మెదడును ప్రభావితం చేసి చురుగ్గా ఉంచుతాయని ఆయన వివరించారు.
→ కనుక వాటిపై దృష్టి పెడితే చాలని అధ్యయనకారులు చెబుతున్నారు.
→ మానసికంగా చురుగ్గా ఉంటే అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని తేల్చారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment