మిల్వాకీ: ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్నాయి. ప్రత్యర్థి అసలే డొనాల్డ్ ట్రంప్. ఆదినుంచీ దూకుడుగా దూసుకెళ్తున్నారు. అది చాలదన్నట్టు హత్యా యత్నంతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. దాన్ని వీరోచితంగా ఎదుర్కొన్న తీరుతో మరింత ఫేవరెట్‌గా మారారు. అలాంటి ట్రంప్‌ను దీటుగా ఎదుర్కోవాల్సిన డెమొక్రాట్లు మాత్రం ఇంకా కాలూ చెయ్యీ కూడదీసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు.
వయోభారం, మతిమరుపుతో రోజుకో రకంగా తడబడుతున్న అధ్యక్షుడు జో బైడెన్ ఎలా చూసినా ట్రంప్‌కు పోటీ ఇవ్వలేరని దాదాపుగా తేలిపోయింది. అయినా పోటీ నుంచి తప్పుకునేందుకు, మరొకరికి చాన్సిచ్చేందుకు 81 ఏళ్ల బైడెన్ ససేమిరా అంటున్నారు. ఇవి చాలవన్నట్టు బైడెన్ తాజాగా కరోనా బారిన పడ్డారు! దాంతో కీలక దశలో ఎన్నికల ప్రచారానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది.
ఈ వరుస పరిణామాలతో డెమొక్రాట్లు తల పట్టుకుంటున్నారు. పోటీకి ముందే ఓటమి ఖాయమయ్యేలా ఉందని వాపోతున్నారు. బైడెన్‌ను ఎలాగోలా బుజ్జగించి తప్పించేందుకు చివరి నిమిషం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లాస్‌వెగాస్‌లో ప్రచార ఈవెంట్‌లో మాట్లాడాల్సి ఉండగా బైడెన్‌కు కరోనా సోకినట్టు తేలింది. దాంతో డెలావెర్ నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్నారు.
ట్రంప్‌ను మీరు ఓడించలేరు: పెలోసీ
బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాట్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పార్టీ కీలక నేత, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల బైడెన్‌తో ఫోన్లో మాట్లాడినట్టు సీఎన్‌ఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. ట్రంప్‌ను ఓడించడం ఆయన వల్ల కాదని ఆమె స్పష్టం చేసినట్టు చెప్పుకొచి్చంది. ‘‘పోల్స్ కూడా మీరు గెలవలేరనే చెబుతున్నాయి. కనుక తప్పుకుంటే మంచిది. కాదని మొండికేస్తే మీరు ఓడటమే గాక ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల విజయావకాశాలను కూడా చేజేతులా నాశనం చేసిన వారవుతారు’’ అంటూ పెలోసీ కుండబద్దలు కొట్టారట.
Comments
Please login to add a commentAdd a comment