Weekly roundup: కమలా హారీస్‌ సరికొత్త రికార్డు.. 36 ఏళ్ల తర్వాత.. | weekly roundup: presidential candidate Kamala Harris key updates in usa | Sakshi
Sakshi News home page

Weekly roundup: కమలా హారీస్‌ సరికొత్త రికార్డు.. 36 ఏళ్ల తర్వాత..

Published Sun, Jul 28 2024 9:07 AM | Last Updated on Sun, Jul 28 2024 11:08 AM

weekly roundup: presidential candidate Kamala Harris key updates in usa

ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూపు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. అనూహ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ పోటీ నుంచి వైదొలగటంతో.. వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ తెరమీదకు వచ్చారు. ఎట్టకేలకు ఆమె అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా ఖరారు అయ్యారు. వారం రోజుల నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నిక పోరులో చోటుచేసుకున్న కీలక పరిణామాలు ఇవే.. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష బరి నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గత ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ‘ఎక్స్’లో ఒక లేఖను పోస్ట్ చేశారు. దేశ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల కోసమే ఈ తీసుకున్నట్లు తేల్చి చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన బైడెన్ అనూహ్యంగా వైదొలగటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌తో గత నెలలో జరిగిన డిబేట్‌లో  బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా వయసు కారణంగా మతిమరుపు సమస్యను ఎదుర్కొన్నారు. దీంతో ఎన్నికల పోటీ నుంచి బైడెన్ తప్పుకోవాలని సొంత పార్టీ నేతలే ఒత్తిడి పెంచారు. అందుకే ఆయన ఎన్నికల పోటీ నుంచి వైదొలిగినట్లు సమాచారం. 
 

ఇక.. ఆయన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె అసాధారణ భాగస్వామి అని ప్రశంసలు కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ మహిళ కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారాయన. అదేవిధంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంట్‌ను ఓడించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగడంతో నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరవుతారు అనే ఆసక్తి నెలకొంది. ఉపాధ్యక్షురాలు కమలా వైపు మొగ్గు కనపడుతున్నా.. పార్టీ నిబంధనావళి ప్రకారం ఓపెన్ కన్వెన్షన్ (ఎవరైనా పోటీ పడవచ్చు) జరుగుతుంది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవడానికి రాష్ట్రాల వారీగా నిర్వహించిన బైడెన్ తిరుగులేని మెజార్టీ కూడగట్టుకున్నారు. 4000పై చిలుకు డెలిగేట్లలో 3900 మంది డెలిగేట్లను బైడెన్ గెలుచుకున్నారు. నిబంధనల ప్రకారం ఆగస్టులో అధ్యక్ష అభ్యర్థిని ఖరారు చేయడానికి జరిగే జాతీయ కన్వెన్షన్ వీరందరూ బైడెన్‌కు అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం బైడెన్ స్వయంగా వైదొలిగారు కాబట్టి.. డెమోక్రాటిక్ టికెట్ కోసం పార్టీ సభ్యులెవరైనా పోటీపడవచ్చు. దీన్నే ఓపెన్ కన్వెన్షన్ అంటారు.
 

కమలా హారిస్‌కు అవకాశాలు మెరుగ్గా ఉన్నా.. డెమోక్రాటిక్ పార్టీ ముఖ్యనేతలైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్, మిసిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌లు ఆమెకు ప్రధాన పోటీదారాలుగా ఉంటారని భావిస్తున్నారు. నామినేషన్ జాబితాలో పేరు లేనప్పటికీ డెలిగేట్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే వీలు కూడా ఉంది. నాలుగువేల పైచిలుకు డెలిడేట్లు ఆగస్టులో తమ తదుపరి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. తొలి రౌండ్ ఫలితాలు తేలకపోతే 700 మంది సూపర్ డెలిగేట్లను ఓటు వేయడానికి అనుమతిస్తారు. డెమోక్రాటిక్ నామినీ ఎన్నికయ్యే వరకు ఓటింగ్ కొనసాగుతుంది.  ఈ ప్రక్రియలో ముమ్మర లాబీయింగ్, తెరవెనక మంత్రాంగాలు జరగటం ఖాయం.

డెమోక్రాటిక్ పార్టీ టికెట్ కోసం కమలాకు గట్టి పోటీదారులుగా మారుతారని భావించిన పలు పలు రాష్ట్రాల గవర్నర్లు తమ మద్దతు ఉపాధ్యక్షురాలికేనని బాహాటంగా ప్రకటించారు. ఇక పార్టీలోని సహచరులకు కమలా ఆదివారమే 100 పైగా ఫోన్ కాల్స్ చేసి మద్దతు కూడా గట్టునే పనిలో నిమగ్నమయ్యారు. భారతీయ అమెరికన్, ఆఫ్రికా అమెరికన్ చట్ట సభ్యులు, బైడెన్ అనుచరులు కమలకు మద్దతుగా ముమ్మర లాబీయింగ్ మొదలుపెట్టారు. వివిధ రంగాలలోని మహిళలు కూడా ఆమెకు మద్దతు ప్రకటించారు. బైడెన్ ప్రచార బృందం కూడా సోషల్ మీడియాలో తమ అకౌంట్ల పేర్లను హారిస్ పేరు మీదకు మార్చేసింది. ప్రచార టీంలో 1000 మంది ఉద్యోగులు ఆమె కోసం పని చేయడానికి సిద్ధం అయ్యారు. గట్టి పోటీదారులు అయిన పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్ ఆదివారమే ఆమెకు మద్దతు తెలిపారు.

కీలక నేతల మద్దతు...
ప్రతినిధుల సభ మాజీ స్పీకర్, డెమోక్రాటిక్ పార్టీలో కీలక నాయకురాలు నాన్సీ పెలోసి కూడా సోమవారం కమలకు మద్దతు ప్రకటించారు. శ్రామిక కుటుంబాల కోసం శ్రమించే సునిశిత మేథోశక్తి గల రాజకీయ నాయకురాలు అని కమలను అభివర్ణించారు. అమెరికాలో అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు, హయత్ గ్రూప్ వారసుడు, ఇల్లినాయీ గవర్నర్ జేబి ఫ్రిట్జ్‌కర్, రెండు సార్లు కెంటకీ గవర్నర్‌ ఆండీ బెషియర్ అభ్యర్థిత్వ రేసులో ఉంటారని భావించినా వారిద్దరూ కమలకే జై కొట్టారు. మిసిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌లు  కూడా అదే బాటలో నడిచారు. మేరీ ల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ కూడా హారిస్‌కే మద్దతు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ మద్దతు కూడా కమలకు లభించింది. కమలకు ఉదారంగా విరాళాలు ఇవ్వాలని సోమవారం హిల్లరీ పిలుపునిచ్చారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు లభిస్తే ఇక కమలకు తిరుగు ఉండదు. కమల్ ప్రత్యర్థులుగా ప్రస్తుతానికి రాయ్ కూపర్ (67) , అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ పేర్లు వినిపించాయి.

అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1976 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు కమలా హారిస్‌కు మద్దతు తెలిపారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా పేరు అనధికారికంగా ఖరారు కావడంతో ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఆమె ఎవరిని ఎన్నుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం మొదటిసారి రోజంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బైడెన్ బృందంతో ఆమె సమావేశమయ్యారు. అదే బృందంతో కలిసి పని చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 106 రోజులే ఉండటంతో, గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మరోవైపు.. కరోనా బారినపడి ఐసోలేషన్ లో ఉన్న జో బైడెన్ ఫోన్‌లో సమావేశంలో పాల్గొన్నారు. కమలా హారిస్‌ను గెలిపించడానికి కృషి చేయాలని డెమోక్రాట్లకు విజ్ఞప్తి చేశారు. తాను కోలుకోగానే ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.ప్రస్తుతానికి హారిస్ కు 40 మందికి పైగా డెమోక్రాటిక్ సెనేటర్లు,  దాదాపు  వంద మంది హౌస్ సభ్యుల మద్దతు ఉంది. అంతే కాదు కాంగ్రెషనల్ బ్లాక్ కాకస్, కాంగ్రెషనల్ హిస్పానిక్ కాకస్, కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్ తో పాటు సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ అనే రెండు కీలక సంఘాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ఇక ఉపాధ్యక్ష రేసులో కెంటకీ గవర్నర్ ఆండీ బేషీర్, యూఎస్ ట్రాన్స్ పోర్టేషన్ సెక్రటరీ పీట్ బుట్టిగీగ్, నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్, అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్ కర్, మిషిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఉండొచ్చని భావిస్తున్నారు.


రికార్డ్ స్థాయిలో విరాళాలు...
కమల హారిస్ ప్రచారం మొదలుపెట్టిన తొలి రోజే పార్టీని విరాళాలు వెల్లువెత్తాయి. 24 గంటల్లో 81 మిలియన్ డాలర్లు వచ్చాయి. అందులో 60 శాతం మొదటిసారి ఇచ్చారు. అధ్యక్ష అభ్యర్థిగా ఒక రోజులోనే ఇంత మొత్తం విరాళంగా రావడం  డెమోక్రాట్ల చరిత్రలో తొలిసారి.

ట్రంప్‌పై విమర్శలు.. 
ట్రంప్ లాంటి అవినీతిపరులను, ద్రోహులను ఎన్నికల్లో ఓడించడమే తన ధ్యేయం అని కమలా హారిస్ అన్నారు. ఆమె మంగళవారం విస్కాన్సిస్ రాష్ట్రంలో డెమోక్రాటిక్ పార్టీ సమావేశంలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. అభ్యర్థిత్వానికి సరిపడ మద్దతు కూడగట్టుకున్న తర్వాత కమలా మాట్లాడినా మొదటి సమావేశం ఇది. గతంలో కాలిఫోర్నియా ప్రాసిక్యూటర్ గా  పని చేశానని, తన రికార్డు ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు. ట్రంప్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మహిళలను వేధించిన దుర్మార్గులను, అమాయకపు ప్రజలను దగా చేసిన మోసగాళ్లను, సొంత లాభం కోసం నిబంధనలను అతిక్రమించిన దుష్టులను ఎన్నికలలో ఓడించాలని పిలుపునిచ్చారు. కాగా తొలుత బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రజలను నుంచి వచ్చిన విరాళాలను కమల కు బదిలీ చేయడం ఆపాలని ట్రంప్ బృందం కోరింది. ఈ మేరకు ఫెడరల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

సర్వేల్లో కమలదే పైచేయి...
అధ్యక్ష రేసులో జో బైడెన్ పై ఆధిపత్యం ప్రదర్శించిన ట్రంప్ కు కమలా వచ్చి రాగానే కళ్లెం వేశారు. మానసిక చురుకుదనం, సవాళ్లను ఎదుర్కొనే సత్తా విషయంలో ట్రంప్ కంటే హారిస్ కే అమెరికన్లు జై కొట్టడం విశేషం. ఈ విషయమై రాయిటర్స్/  ఇప్సోస్ చేసినా తాజా సర్వేలో 56 శాతం మంది హారిస్ ఓటు వేయగా, ట్రంప్ కు 49 శాతమే ఓట్లు దక్కాయి. పలు సర్వేలల్లో కూడా కమలా దూసుకుపోతున్నారు.

కమలా హారిస్‌కు భారీ అడ్వాంటేజ్‌
ఇటు తల్లి నుంచి ఆసియా, అటు తండ్రి నుంచి నల్లజాతి మూలాలుండటం హారిస్‌కు భారీ అడ్వాంటేజ్‌గా మారుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో ప్రబల శక్తులుగా ఉన్న ఈ రెండు వర్గాల ఓట్లూ ఆమెకే పడటం ఖాయమంటున్నారు. ఆగస్టు 19–21 తేదీల మధ్య జరిగే డెమొక్రాట్ల జాతీయ సదస్సులో హారిస్‌ అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర పడటం లాంఛనమే. అదే ఊపులో ట్రంప్‌ను ఓడిస్తే 248 ఏళ్ల అమెరికా చరిత్రలో తొలి అధ్యక్షురాలిగా, ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా మూలాలున్న నేతగా, నల్ల జాతి మహిళగా... ఇలా ఆ దేశ చరిత్రలోనే అరుదైన పలు రికార్డులను హారిస్‌ సొంతం చేసుకోనున్నారు. అంతేకాదు, ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ఐదో అమెరికన్‌గా కూడా నిలుస్తారు.  

150 ఏళ్ల విరామం తర్వాత జార్జ్‌బుష్‌..  
1836లో ఉపాధ్యక్షుడు మార్టిన్‌ వాన్‌ బురెన్‌ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత మళ్లీ ఉపాధ్యక్షుడు నేరుగా అధ్యక్షుడు కావడానికి ఏకంగా 150 ఏళ్లు పట్టింది! 1988లో నాటి ఉపాధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ.బుష్‌ అధ్యక్షుడు అయ్యారు. చివరగా ఆ ఘనత సాధించిన నేత ఆయనే. 1988 తర్వాత తొలిసారిగా ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ నేరుగా ప్రెసిడెంట్‌ అయిన తొలి నేతగా రికార్డు సొంతం చేసుకునే దిశగా కమలా హారిస్‌ వడివడిగా దూసుకెళ్తున్నారు. 

అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షులుగా ఉంటూ నేరుగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలిచిన నేతలు నలుగురు. వారు జాన్‌ ఆడమ్స్, థామస్‌ జెఫర్సన్, మార్టిన్‌ వాన్‌ బురెన్, జార్జ్‌ హెచ్‌.డబ్ల్యూ.బుష్‌. ఎనిమిది మంది ఉపాధ్యక్షులు అప్పటి అధ్యక్షుల మృతి కారణంగా ఆ పదవిని చేపట్టారు. వారు జాన్‌ టైలర్, మిలార్డ్‌ ఫిల్మోర్, ఆండ్రూ జాన్సన్, చెస్టర్‌ ఆర్థర్, థియోడర్‌ రూజ్‌ వెల్ట్, కాల్విన్‌ కూలిడ్జ్, హారీ ట్రూమాన్, లిండన్‌ జాన్సన్‌. గెరాల్డ్‌ ఫోర్డ్‌ మాత్రం ఉపాధ్యక్షునిగా ఉంటూ, నాటి అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఆ పదవి చేపట్టారు. 

ఇద్దరు ఉపాధ్యక్షులు మాజీలయ్యాక, అంటే పదవీకాలం ముగిసిన కొన్నాళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. వారిలో ఒకరు రిచర్డ్‌ నిక్సన్‌ కాగా రెండోవారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌. హారీ ట్రూమన్, చెస్టర్‌ ఆర్థర్‌ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే అధ్యక్షులయ్యారు! థామస్‌ హెండ్రిక్స్,  విలియం కింగ్‌ ఉపాధ్యక్షులు అయిన ఏడాదిలోపే మరణించారు. జార్జ్‌ క్లింటన్, జాన్‌ కాల్హన్‌ వరుసగా రెండుసార్లు ఉపాధ్యక్షులుగా వేర్వేరు అధ్యక్షుల హయాంలో పని చేశారు.  

అమెరికా ఉపాధ్యక్షురాలు,  డెమొక్రాటిక్ అభ్య‌ర్థి క‌మ‌లా హారిస్‌కు.. మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్‌ ఒమాబా మ‌ద్ద‌తు ప్రకటించారు. నా స్నేహితురాలు హారీస్‌ అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నామని, ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈమేరకు ట్వీట్‌ చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో నా స్నేహితురాలు యూనైటెడ్‌ స్టేట్స్‌కు అధ్బుతమైన అధ్యక్షురాలిగా అవుతుంది. రెండు రోజుల క్రితం కమలా హ్యారిస్‌కు మేము ఫోన్‌ చేశాం. మిచెల్‌, నేను ఆమెతో మాట్లాడాం. తనకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు చెప్పాము. ఈ క్లిష్టమైన సమయంలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆమె గెలుపొందేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం.  నీ పట్ల మాకు గర్వంగా ఉంది. నువ్వు చరిత్ర సృష్టిస్తామని తెలుసు’అని  అని బరాక్ ఒబామా  ట్వీట్ చేశారు.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌(59) అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఖరారు అయ్యారు. ఈ విషయాన్ని శనివారం ఆమె స్వయంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపారామె. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ‘ఎక్స్‌’ ఖాతాలో ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె తమ అభ్యర్థి అని డెమోక్రటిక్‌ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కమలా హారిస్‌ నేపథ్యం.. 
కమలా హారిస్‌ పూర్తి పేరు.. కమలాదేవి హారిస్‌. ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి.  తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైవాసి. పైచదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. కమల తండ్రి డొనాల్డ్ హ్యారిస్‌. జమైకాకు చెందిన ఆయన అర్థశాస్త్ర ప్రొఫెసర్. అమెరికాలో జన్మించిన కమల.. తల్లి భారతీయురాలు కాబట్టి భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు కమల. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టరేట్ అందుకొన్నారు.

అటార్నీ జనరల్‌గా..
హోవార్డ్‌లో చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకురాలిగా పోటీ చేశారామె. చదువు పూర్తి చేసిన తర్వాత క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో కెరీర్ క్రిమినల్ యూనిట్‌లో మేనేజింగ్ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్‌ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్‌గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు కమల. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు.

సెనేటర్‌ నుంచి తక్కువ టైంలో.. 
2017లో క్యాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. తద్వారా కరోల్ మోస్లే తర్వాత ‘అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’లో అడుగుపెట్టిన తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2020లో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. కమలా హారిస్‌ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్‌ కూడా ఆమే. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవికే గురిపెట్టారు. డెమోక్రటిక్‌ పార్టీ ఆ​మె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తే.. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌(78)తో ఆమె పోటీ పడనున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా గెలిస్తే.. అగ్ర రాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించినట్లే అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement