చుండ్రు ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రత్యేకించి శీతాకాలంలో. చుండ్రు అనగానే తలలో మాత్రమే వస్తుందని అనుకుంటాం. కానీ కనురెప్పలు, కనుబొమ్మలపై సైతం చుండ్రు ఏర్పడుతుంది ఇది సాధారణంగా శీతాకాలం లేదా సీజన్ మార్పుల సమయంలో కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది సాధారణమే అయినా..చికిత్స చేయకుండా వదిలివేస్తే ప్రమాదకరం అని కూడా సూచిస్తున్నారు. ఇది ఎందుకు వస్తుంది, లక్షణాలు, నివారణ మార్గాలు చూద్దాం రండి!
కనురెప్పలతోపాటు మీసాలు , ముక్కు మీద కూడా చుండ్రు కనిపిస్తుంది! ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా, కనురెప్పల చుండ్రును చికిత్స చేయకుండా వదిలేస్తే కొన్ని తీవ్రమైన ప్రమాదాలొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లెన్స్ ధరించేవారు, ఇన్ఫెక్షన్లను నివారించడానికి కనురెప్పల చుండ్రు పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఐలైనర్, మస్కరాతో నిద్రించే అలవాటు ఉండే వారు కూడా అప్రమత్తంగా ఉండాలి.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (స్టెఫిలోకాకస్) కనురెప్పల ద్వారా ఉత్పత్తి అయ్యే నూనెలలో తగ్గుదల, డెర్మటైటిస్,సెబోరిహెక్ డెర్మటైటిస్ మూలంగా కనుబొమ్మలు, కనురెప్పలపై చుండ్రు సమస్య తలెత్తుతుంటుంది. బ్లెఫారిటస్ డెర్మటైటిస్ వల్ల కనురెప్పల అంచుల్లోవాపు, మంట, ఇరిటేషన్ లాంటివి వస్తాయి. సెబోరిహెక్ డెర్మటైటిస్ లో క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్ ఎదుర్కొంటాం.
లక్షణాలు
కనురెప్పల చుండ్రు బైటికి పెద్దగా కనిపించకపోయినప్పటికీ, కనురెప్పల దురద, కనురెప్పలు ఎర్రగా మారడం, కళ్లలో మంట లేదా కనురెప్పల అడుగుభాగంలో పొలుసుల చుండ్రు , కళ్ల వెంబడి నీళ్లు, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంట్రుకలపై చుండ్రు ఉండటం కేవలం సౌందర్య సమస్య కాదు, కంటి ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది.
కళ్లు ఎప్పుడూ చికాకు పెట్టడం, ఎర్రబడటం, కను బొమ్మలు ఊడిపోవడం పొడిబారడం, కార్నియల్ దెబ్బతినడం స్టైస్ లాంటి సమస్యలొస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, కండ్లకలక లేదా కెరాటిటిస్ (కార్నియా వాపు) వంటి దీర్ఘకాలిక కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇరిటేషన్ వల్ల కళ్లను ఎక్కువగా రుద్దడం వల్ల కార్నియాలు బలహీనపడతాయి, ఇది కెరాటోకోనస్ (కార్నియా సన్నబడటానికి, కోన్ ఆకారంలోకి ఉబ్బడానికి కారణమయ్యే కంటి వ్యాధి) వంటి పరిస్థితులకు దారితీయవచ్చు.
చిట్కాలు:
రాత్రి పడుకోబోయే ముందు టేబుల్ స్పూను బాదం ఆయిల్ తీసుకుని దాన్ని వేడి చేసి, గోరువెచ్చగా ఉన్నపుడు కనుబొమ్మలు, కనురెప్పల మీద సున్నితంగా మసాజ్ చేయాలి. ఉదయం లేచిన తర్వాత చల్లటి నీళ్లతో కనురెప్పలు, కనుబొమ్మలు శుభ్రంగా కడుక్కోవాలి.
కల్లీలేని కొబ్బరి నూనె, అలోవెరా జెల్ కలిపి, దురదగా ఉన్న చోట్ల మృదువుగా అప్లయ్ చేయాలి .ఫంగస్ కారణంగా కనుబొమ్మలు, కనురెప్పలపై ఏర్పడే చుండ్రు పోగొట్టడానికి టీ ట్రీ ఆయిల్ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఫంగల్ సుగుణాలు చాలా ఉన్నాయి. టేబల్ స్పూను టీట్రీ ఆయిల్ తీసుకుని దాన్ని మైక్రోవేవ్ లో కొన్ని సెకన్ల పాటు వేడిచేయాలి. ఈ నూనెను కాటన్ బాల్ సాయంతో కనుబొమ్మలపై, కనురెప్పలపై సున్నితంగా రాసి పది నిమిషాలు అలాగే ఉంచి, తరువాత శుభ్రంగా కడగాలి.
నోట్ : ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. సమస్య తీవ్రతను గుర్తించి సమస్య మరీ ముదరకుండా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment