మన శరీరంలో అనేక గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి చాలా కీలకమైనది. మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకృతిలో శ్వాసనాళానికి రెండువైపులా ఉండే ఈ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. కొందరిలో ఈ గ్రంథి చాలా పెద్ద సైజుకు పెరిగిపోతుంది. ఇలా థైరాయిడ్ గ్రంథి అసాధారణమైన సైజుకు పెరగడాన్ని ‘గాయిటర్’ అంటారు.
గాయిటర్ రకాలు...
ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డిఫ్యూస్ గాయిటర్, రెండోది నాడ్యులార్ గాయిటర్. సాధారణ పరిమాణం కంటే థైరాయిడ్ గ్రంథి ఉబ్బిపోయి ఇరువైపులా సమానంగా పెరగడాన్ని ‘డిఫ్యూస్ గాయిటర్’గా పరిగణిస్తారు. ఇక రెండోది ‘నాడ్యులార్ గాయిటర్’. ఈ నాడ్యులార్ గాయిటర్‌లో థైరాయిడ్ గ్రంథిలోని ఏదైనా ఒక భాగంలో ఒకటి లేదా ఇంకా ఎక్కువ సంఖ్యలో గడ్డలు ఏర్పడతాయి. థైరాయిడ్ గ్రంథిలో ఇలా గడ్డలు పెరగడాన్ని నాడ్యులార్ గాయిటర్ అంటారు.
గాయిటర్ సమస్య వచ్చిన కొంతమందిలో సాధారణంగా థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో ఎలాంటి మార్పులూ కనిపించవు. కానీ మరికొందరిలో మాత్రం థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా గానీ లేదా తక్కువ మోతాదులోగానీ ఉత్పత్తి అవుతుంటాయి. ఒకవేళ హార్మోన్ల ఉత్పత్తి మోతాదులు పెరిగితే దాన్ని ‘హైపర్ థైరాయిడిజం’ అనీ, తగ్గితే ‘హైపోథైరాయిడిజమ్’ అని అంటారు. హైపర్ థైరాయిడిజమ్‌లో జీవక్రియల వేగం పెరగడంతో బాధితులు సన్నబారిపోవడం, హైపో థైరాయిడిజమ్‌లో జీవక్రియలు మందగించడంతో బాధితులు లావెక్కడం అనే ప్రధాన లక్షణాలతో పాటు మరికొన్ని సమస్యలు కనిపిస్తాయి.
నిర్ధారణ పరీక్షలు...
గొంతు దగ్గర బాగా ఉబ్బి కనిపించడం అనే పైకి కనిపించే లక్షణంతో దీన్ని కొంతవరకు నిర్ధారణ చేసినప్పటికీ... పూర్తి నిర్ధారణ కోసం థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలైన టీ3, టీ4, టీఎస్‌హెచ్, అల్ట్రాస్కాన్, ఎఫ్‌ఎన్‌ఏసీ వంటివి అవసరమవుతాయి.
చికిత్స...
థైరాయిడ్ సమస్య నిర్ధారణ కోసం చేసే పరీక్షల ఫలితాల ఆధారంగా గాయిటర్ చికిత్సకు ఎండోక్రైనాలజిస్ట్ ఆధ్వర్యంలో తగిన చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇప్పటికి అందుబాటులో ఉన్న వైద్యపరిజ్ఞానంతో థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం ద్వారా కొంతమందిలో థైరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఇలాంటి రోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
డా. వ్రిందా అగర్వాల్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment