నేడు వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే.. సెరిబ్రల్ పాల్సీ అంటే మస్తిష్క పక్షవాతం. ఇదొక నరాల వ్యాధి. దీనిపై అవగాహన కల్పించేందుకు సెరిబ్రల్ పాల్సీ డేను అక్టోబర్ 6న నిర్వహిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒక కోటీ 70 లక్షలకు పైగా సెరిబ్రల్ పాల్సీ కేసులు నమోదయ్యాయి.
కొందరికి పుట్టుకతో, మరికొందరికి తలకు గాయమైనప్పుడు మస్తిష్క పక్షవాతం సంభవిస్తుంది. దీని కారణంగా మెదడులో ఎదుగుదల లోపించి కండరాలు, కదలికలపై సమన్వయం అనేది లోపిస్తుంది. బాల్యంలో సంభవించే ఈ వైకల్యానికి జన్యుపరమైన లోపాలే ప్రధాన కారణంగా నిలుస్తాయి. భారతదేశంలోని ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ముగ్గురికి మస్తిష్క పక్షవాతం ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మస్తిష్క పక్షవాతం సోకిన పిల్లల్లో దొర్లడం, కూర్చోవడం, నడవడం వంటివి ఆలస్యమవుతాయి. ఇది ఆడపిల్లల కంటే కంటే మగపిల్లలలోనే అధికంగా కనిపిస్తుంది.
మూడు నెలల వయసులో శిశువును ఎత్తిన సందర్భంలో తల వెనక్కి వాలిపోవడం, శరీరమంతా బిగుసుకోపవడం, కండరాల బలహీనత, ఆరు నెలలకు గానీ దొర్లకపోవడం, రెండు చేతులను కూడదీసుకోవడంలో వైఫల్యం, నోటివద్దకు చేతులు తీసుకురావడంలో సమస్యలు.. ఇవన్నీ మస్తిష్క పక్షవాతం లక్షణాలని వైద్యులు చెబుతుంటారు. ఇది కండరాల తీరు, ప్రతిచర్యలు, భంగిమ సమన్వయాన్ని, కదలికలు, కండరాల నియంత్రణను సమన్వయం చేయక ఇబ్బందులకు గురిచేస్తుంది.
గర్భధారణ సమయంలో శిశువు అభివృద్ధిపై ప్రభావం చూపే రుబెల్లా వ్యాధి, శిశువు మెదడుకు రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడటం, ప్రసూతిలో సమయంలో ఆక్సిజన్ కొరత మొదలైనవి మస్తిష్క పక్షవాతానికి దారితీస్తాయి. మస్తిష్క పక్షవాతం నయం చేయలేని వ్యాధులలో ఒకటిగా పరిగణిస్తారు. అయితే మందులు, శస్త్రచికిత్స, స్పీచ్ థెరపీ మొదలైనవి మస్తిష్క పక్షవాతం బాధితులకు ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఈ వ్యాధి బారినపడినవారికి సకాలంలో వైద్యం అందిస్తే వ్యాధిని కొంత వరకు అరికట్టవచ్చని వైద్యులు చెబుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment