లోగిలి
టూకీగా ప్రపంచ చరిత్ర
కేవలం మెదడు తూకంలోని తేడాల ఆధారంగా జంతువుల మేధోశక్తిని అంచనా వేసుకోలేం. మనిషి మెదడుకంటే ఏనుగు మెదడు కనీసం 20 రెట్లు పెద్దదిగా ఉంటుంది. తెలివిలో 2000 రెట్లు తక్కువగా ఉంటుంది.
మొదటి ఘట్టం తొలిదశలో సంఖ్యాపరంగా జంతువుల విస్తృతి పెద్దగా లేదుగానీ, పలురకాల స్తన్యజంతువులు అప్పటికే రంగంలో దిగిపోయాయి. ఊరకే దిగిపోవడంగాదు, ఒక్కొక్కటి ఒక్కోదిశగా ప్రత్యేకతలను సంతరించుకోవడం మొదలెట్టాయి. గడ్డి మేస్తూ శాకాహార జీవితంలో కొన్ని తరగతులు స్థిరపడగా, వాటిల్లో కొన్ని పలుకారణాల మూలంగా చెట్లమీదికి నివాసం మార్చుకుని శాకాజీవితానికి అలవాటుపడుతున్నాయి. మరికొన్ని మాంసాహారులుగా మిగిలిపోగా, తిమింగలాల వంటి కొన్ని జంతువులు నీటిలో బతికే జీవితానికి తిరోగమించాయి. ఏ తరహా జీవితాన్ని స్వీకరించినా, సీనోజోయిక్ జంతువులు తమ ప్రమేయం లేకుండానే కొద్దికొద్దిగా పెరుగుతున్న మెదడును తమ జీవనవిధానానికి పరికరంగా ఉపయోగించుకుంటున్నాయి. అయితే, అదే జాతికి చెందిన ఇప్పటి వారసులతో పోలిస్తే ఆ శకంలో జంతువులకు మెదడు చాలా చిన్నది. ఉదాహరణకు ఖడ్గమృగానికున్న మెదడులో కనీసం పదోవంతైనా లేనివి వాటి పితామహులైన ‘టిటరాథోరియం’ పేరుగల ఆ తరం జంతువులు. మనకు తెలిసిన ఖడ్గమృగమే ఏమంత తెలివైన జంతువు కాదు. దీన్నిబట్టి అప్పటి జంతువుల మేధోశక్తి ఎంత ముతకగా ఉండేదో మనమొక అంచనాకు రావచ్చు.
ఇక్కడ గమనించవలసిన మరో అంశం ఏమిటంటే, 25 కోట్ల సంవత్సరాలుగా జీవి తమ మెదడును పెంచుకునేందుకు చేసే ప్రయత్నం సీనోజోయిక్ యుగంలో లాభదాయకమైన ఫలితాలను ప్రారంభించింది. అప్పటినుండి అది నిరంతరంగా పెరుగుతూ, 40వేల సంవత్సరాలనాడు మానవునితో ఆగిపోయింది. ఇక్కడే ఆగుతుందో ఇంకా పెరుగుతుందో ఇప్పుడిప్పుడే చెప్పలేం. పెరుగుదలను ప్రోత్సహించే అవసరాలు ముందు ముందు ఏమి రానున్నాయో ఎవరికి తెలుసు? అయితే, అది దగ్గరి భవిష్యత్తులో జరిగేది కాదని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఇప్పుడు ఉన్నదాన్నే మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. తనకుండే మేధోసామర్థ్యంతో మనిషి ఉపయోగించుకుంటున్నది కేవలం 18 నుండి 20 శాతమే!
దీన్నిబట్టి మరో అంతరార్థం మనకు వెల్లడౌతుంది. పరిణామక్రమంలో భౌతిక మార్పులకంటే ముందుగా జరిగేది మెదడు పెరుగుదలేననిపిస్తుంది. ఆ పెరిగిన మెదడు జీవిని తన అలవాట్లూ, తదనుగుణంగా శరీరనిర్మాణం సంతరించుకునేలా బలవంతంగా తోసుకుపోతున్నట్టు కనిపిస్తుంది. ఇదేనిజమైతే, కొన్ని వేల సంవత్సరాల తరువాత మనిషి శరీరం ఏ ఆకారం తీసుకుంటుందో! చెవులు చేటల్లాగా, ముక్కు తొండంలాగా పెరిగే అవకాశాలు మాత్రం లేవు. ఏమిటి ఆ ధీమా అంటారా - అవి అదివరకున్న పరిమాణంతోనే ఉపయోగం తక్కువై, జ్ఞానేంద్రియాల సైజు మనిషి కుదించిపోయింది. ఉదాహరణకు మెదడులో వాసన గ్రహించే గ్రంథులనే తీసుకుంటే, అవి కుక్కకు బాతుగుడ్డు సైజులో ఉండగా, మనిషిలో నలిగిపోయిన యాలకతొక్క సైజుకు తగ్గిపోయాయి.
‘మెదడును పూర్తి స్థాయిలో మనం ఎందుకు వినియోగించుకోవడం లేదు?’ అనే సందేహం ఇక్కడ కలగొచ్చు. అవగాహన కోసం పాతతరం మోటారుకారు స్పీడామీటరును గుర్తుకు తెచ్చుకోవాలి. అందులో సున్నా నుండి నూట ఇరవైకిలోమీటర్ల వేగందాకా చూపించైతే ఉంటుందిగానీ, గరిష్టస్థాయి వేగంతో బండిని నడపడం సాధ్యపడదు. 60 కిలోమీటర్ల వేగం అందుకోగానే కారు భాగాలు ఎక్కడివక్కడ విడిపోతాయేమోనన్నంత అందోళన కలిగిస్తుంది. ఆ కుదుపులకూ ప్రకంపనాలకూ లోపల కూర్చున్న మనుషులు గంటా గంటన్నర వ్యవధికి అలసిపోతారు. మరికొంత దూరం ఆ వేగాన్ని కొనసాగిస్తే, ఇంజనులో నీళ్ళు పూర్తిగా ఆవిరై, మెత్తని లోహభాగాలు కరిగిపోవడం మొదలౌతుంది. అంటే, ఆ గరిష్టవేగంతో పరిగెత్తే శక్తి ఇంజనుకు ఉన్నా, ఆ వేగాన్ని స్వీకరించగల సత్తా దాని ‘బాడీ’కి లేదు; ఆ వేగానికి సహకరించే రహదారి లేదు. అదే ఈ తరం కార్లైతే 120 కి.మీ. వేగాన్ని సునాయాసంగా అందుకుంటాయి. ఆ వేగాన్ని భరించగల బాడీ నిర్మాణం ఇప్పుడొచ్చింది. అనుకూలమైన రహదారులు ఇప్పుడు అందుబాటుకొచ్చాయి. అయినా, కొత్తతరం స్పీడామీటరు చూపించే గరిష్టవేగాన్ని అందుకునేందుకు ఇప్పుడు గూడా సాధ్యపడదు. ఇక మానవుని శరీరం విషయానికొస్తే, వర్తమానజీవితం ఒత్తిళ్ళకే తట్టుకోలేక, ‘స్పేర్ పార్ట్స్’ కోసం ఆస్పత్రులకు పరుగులు పెడుతూంటే, పూర్తిస్థాయి మెదడును ఎక్కడ వాడుకోగలడు?
మెదడు సైజును గురించి మాట్లాడుకునే సందర్భంలో మనం గుర్తుంచుకోవలసిన విషయం మరొకటుంది. కేవలం మెదడు తూకంలోని తేడాల ఆధారంగా జంతువుల మేధోశక్తిని అంచనా వేసుకోలేం. మనిషి మెదడుకంటే ఏనుగు మెదడు కనీసం 20 రెట్లు పెద్దదిగా ఉంటుంది. తెలివిలో 2000 రెట్లు తక్కువగా ఉంటుంది. అందువల్ల, మొదట మనం చూడవలసింది శరీరం బరువులో మెదడు తూగే నిష్పత్తి. మనిషిలో ఈ నిష్పత్తి 1:47. రెండవది - మనం అంచనాలోకి తీసుకోవలసింది కేవలం పెద్దమెదడును. ఎందుకంటే, పెద్దమెదడు వెలుపలి పొరగా ఏర్పడిన ‘గ్రే మేటర్ (బూడిద రంగు పదార్థం)’లో మాత్రమే ఆలోచనకు సంబంధించిన మేధోకణాల ఉనికి మనకు కనిపించేది.
రచన: ఎం.వి.రమణారెడ్డి