మీకు ఇప్పటికే ఓసారి కరోనా సోకిందా? తొలిసారి అనుభవంతో మళ్లీ మరోసారి ఇన్ఫెక్షన్ గనక వస్తే... అది తీవ్రంగా బాధిస్తుందనీ లేదా ప్రాణాంతకమవుతుందేమోనని ఆందోళన పడుతున్నారా? రీ–ఇన్ఫెక్షన్ కేసుల్లో అస్సలు అలాంటి భయమే అవసరం లేదని భరోసా ఇస్తున్నారు అధ్యయనవేత్తలు.
రెండోసారి గనక కరోనా ఇన్ఫెక్షన్ సోకితే దాదాపు 90 శాతం మందిలో అది తీవ్రమైన లేదా క్రిటికల్ లేదా మరణం వంటి వాటికి దారితీయదు. అంతేకాదు... మొదటిసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలో చాలా సీరియస్ అయ్యే అవకాశాలు 2.5 శాతం కాగా... రీ–ఇన్ఫెక్ట్ అయిన వాళ్లలో ఆ అవకాశాలు కేవలం 0.3 శాతం మాత్రమేనని, ఇక క్రిటికల్ అయ్యే పరిస్థితి తొలిసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలో 0.40% కాగా... రెండోసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలో ఇది సున్నా శాతం (0%) అనీ, మరణానికి దారి తీయడం అనే అంశంలోనూ తొలిసారి సోకిన వారు 0.1% కాగా... రెండోసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలోనూ అది సున్నా శాతం (0%) అంటూ భరోసా ఇస్తున్నారు.
కాబట్టి రెండోసారి ఇన్ఫెక్ట్ అయిన వారిలో కొంతవరకు హాస్పిటలైజ్ అయితే అవ్వొచ్చుగానీ... క్రిటికల్, మరణానికి దారితీసే ప్రమాదమే ఉండదన్నది ఖతర్ పరిశోధకులు తేల్చిన అంశం. ఖతర్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌తో పాటు వీల్ కార్నెల్ మెడిసిన్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఓ సంయుక్త అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ బృందం రెండోసారి ఇన్ఫెక్షన్‌కు గురైన దాదాపు 1,300 మందికిపైగా వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించింది.
ఈ వివరాలన్నీ ‘ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ అనే ప్రముఖ మెడికల్ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి. అయితే ఈ పరిశోధనపై కొన్ని విమర్శలూ వినిపిస్తున్నాయి. ఖతర్‌లో అంత తీవ్రంగా కరోనా లేదనీ, అందువల్ల బాగా చల్లగా ఉండే పాశ్చాత్యదేశాల్లోని వాతావరణం కారణంగా... ఇదే అధ్యయనం పాశ్చాత్యులకు అంతే కచ్చితంగా వర్తించకపోవచ్చంటూ కొన్ని దేశాలూ, సంస్థలూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
అయితే... ఫిబ్రవరి 28, 2020 నుంచి ఏప్రిల్ 28, 2021 మధ్యకాలంలో తొలిసారి ఇన్ఫెక్ట్ అయిన 3,53,000 మందిపైనా... వారిలోనే మళ్లీ రీ–ఇన్ఫెక్ట్ అయిన 1,300 మందిపైనా నిర్వహించినందున ఈ అధ్యయనానికి ఎంపిక చేసిన శాంపుల్ పెద్దదిగానే భావించాలనీ, ఇది కొంతమేరకు ఊరటనిచ్చే అంశమేనని మరికొందరు నిపుణులు భరోసా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment