డెంగ్యూకు కంగు | Dengue: What is the reference range for NS1 test? | Sakshi
Sakshi News home page

డెంగ్యూకు కంగు

Published Thu, Nov 22 2018 12:31 AM | Last Updated on Thu, Nov 22 2018 12:31 AM

Dengue: What is the reference range for NS1 test? - Sakshi

జ్వరం వస్తే వచ్చే బెంగ వేరు కానీ డెంగ్యూ జ్వరం అనగానే వచ్చే భయం వేరు. ఇటీవల విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు చూసి చాలామంది ఆందోళన చెందుతున్నారు.  దీని గురించి  అవగాహన కంటే అపోహలు ఎక్కువ.డెంగ్యూకు కంగు తినిపించేలావిషయాలు తెలుసుకోవడం కోసం ఈ సమగ్ర  కథనం.

డెంగ్యూ అంటే ఏమిటి?
డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్‌ వల్ల వ్యాపించే ఒక వైరల్‌ జ్వరం. ఈ వైరస్‌ను ‘ఎడిస్‌ ఎజిపై్ట’ అనే దోమ వ్యాప్తి చేస్తుంది. టైగర్‌ మస్కిటో అని కూడా దీనిని పిలుస్తారు. చాలా సందర్భాల్లో డెంగ్యూ జ్వరం మిగతా అన్ని జ్వరాల్లాగే తనంతట తానే తగ్గిపోయే  (సెల్ఫ్‌ లిమిటింగ్‌) తరహాది. అయితే  కొంతమందిలో ప్లేట్‌లెట్స్‌ ప్రమాదకర స్థాయి కంటే కిందికి పడిపోతాయి. మరికొందరి అంతర్గత అవయవాల్లోకి రక్తస్రావమయ్యే పరిస్థితి వస్తుంది. అటువంటి సందర్భాల్లో రోగిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించడం అవసరమవుతుంది. అలాంటి సమయంలో తప్ప మిగతా అన్ని వేళల్లోనూ ఇది అనుకున్నంత ప్రమాదకరం కాదని గుర్తిస్తే అపోహలు, దురభిప్రాయాలతో కలిగే ఆందోళన తగ్గిపోతుంది.

డెంగ్యూలో రకాలు : 
ఇటీవల డెంగ్యూలో రకాలను పునర్నిర్వచించారు. ఆ విభజనను అనుసరించి డెంగ్యూలో మూడు రకాలు ఉన్నాయి. అవి... 
1.    ఎలాంటి హెచ్చరికలు చూపకుండా వచ్చే సాధారణ డెంగ్యూ (డెంగ్యూ వితవుట్‌ వార్నింగ్‌ సైన్స్‌)
2.కొన్ని నిర్దిష్టమైన హెచ్చరికలు చూపుతూ వచ్చే డెంగ్యూ (డెంగ్యూ విత్‌ వార్నింగ్‌ సైన్స్‌) 
3.తీవ్రమైన డెంగ్యూ (సివియర్‌ డెంగ్యూ) 

లక్షణాలు : 
∙హెచ్చరికలు చూపకుండా వచ్చే సాధారణ డెంగ్యూ (డెంగ్యూ వితవుట్‌ వార్నింగ్‌ సైన్స్‌) కేసుల్లో : ఈ తరహా డెంగ్యూ వచ్చిన వారు డెంగ్యూ విస్తృతంగా వస్తున్న  (ఎండెమిక్‌) ప్రాంతాలలో నివసిస్తున్న వారై ఉంటారు. ఇలాంటి వారిలో జ్వరం, వికారం/వాంతులు, సాధారణంగా కనిపించే ఒంటినొప్పులు (జనరలైజ్‌డ్‌ బాడీ పెయిన్స్‌), ఒంటి మీద ర్యాష్‌ వంటి బయటి లక్షణాలు కనిపిస్తాయి. టార్నికేట్‌ అనే పరీక్ష చేస్తారు. దీంతో పాటు సాధారణ రక్తపరీక్ష  చేసినప్పుడు డెంగ్యూ వ్యాధిగ్రస్తుల్లో తెల్ల రక్తకణాల సంఖ్య బాగా తక్కువగా కనిపిస్తుంది. 
∙కొన్ని నిర్దిష్టమైన హెచ్చరికలు చూపుతూ వచ్చే డెంగ్యూ (డెంగ్యూ విత్‌ వార్నింగ్‌ సైన్స్‌) కేసుల్లో :  ఈ కేసుల్లో పైన పేర్కొన్న లక్షణాలన్నింటితో పాటు పొట్టలో నొప్పి, ఊపిరితిత్తుల చుట్టూ ఉండే ప్లూరా అనే పొరలో లేదా పొట్టలో నీరు చేరడం, పొట్టలోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం అవుతుండటం, రోగి అస్థిమితంగా ఉండటం, రక్తపరీక్ష చేయించినప్పుడు ఎర్ర రక్త కణాలకూ, మొత్తం రక్తం పరిమాణానికీ ఉన్న నిష్పత్తి కౌంట్‌ పెరగడంతో పాటు ప్లేట్‌లెట్స్‌ సంఖ్య విపరీతంగా పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
∙తీవ్రమైన డెంగ్యూ (సివియర్‌ డెంగ్యూ) కేసుల్లో : అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కారణంగా రోగి తీవ్రమైన షాక్‌కు గురవుతాడు. ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాసప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. తీవ్రమైన రక్తస్రావం కారణంగా రోగి స్పృహకోల్పోవడం లేదా పాక్షికంగానే స్పృహలో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతర్గత అవయవాలు తమ విధులు నిర్వహించడంలో విఫలం అవుతాయి. అంటే ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ అనే కండిషన్‌ ఏర్పడుతుందన్నమాట. 

ఇప్పుడు మరింత అధునాతనమైన నిర్ధారణ పరీ„
ఇప్పుడు అత్యంత అధునాతమైన వ్యాధి నిర్థారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.  ఐపీఎఫ్‌ (ఇమ్మెచ్యూర్‌ ప్లేట్‌లెట్‌ ఫ్రాక్షన్‌) అనే అత్యాధునిక పరీక్ష పెద్ద పెద్ద మెడికల్‌ సెంటర్లలో  అందుబాటులో ఉంది. ప్లేట్‌లెట్లను ఎప్పుడు, ఎంత పరిమాణంలో ఎక్కించాలో తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో ప్లేట్‌లెట్లకు సంబంధించిన కచ్చితమైన వివరాలతో పాటు శరీరంలో ప్లేట్‌లెట్ల ఉత్పత్తికి తోడ్పడే ఎముకలోని భాగమైన బోన్‌మ్యారో పనితీరు కూడా ఈ పరీక్షతో  తెలుస్తుంది. అంతేకాకుండా ప్లేట్‌లెట్లు వృద్ధి చెందుతాయా, లేదా, ఒకవేళ ప్లేట్‌లెట్లు ఎక్కించడం ఎంతమేరకు అవసరం... లాంటి చికిత్సకు ఉపకరించే ఎన్నో విషయాలు ఈ పరీక్ష ద్వారా వైద్యులు నిర్ధారణ చేస్తారు. ఆ మేరకు ప్లేట్‌లెట్స్‌ మార్పిడి, చికిత్స విధానాన్ని అవలంబిస్తారు. ఒకవేళ బోన్‌మ్యారోలో లోపం ఉంటే పైపై చికిత్సలను ఆపేసి, ప్రధానమైన మూలాల్లోకి వెళ్లి మెరుగైన చికిత్సను సకాలంలో అందించి, పేషెంట్‌ ప్రాణాలను కాపాడతారు. డెంగ్యూకు గురైన ప్రతి పేషెంట్‌కీ ప్లేట్‌లెట్ల మార్పిడి అవసరం ఉండదు. 

కొన్ని మందులు డెంగ్యూ రోగులకు ప్రమాదం
సాధారణ జ్వరం వచ్చిన వారికి ఇచ్చినట్లుగా డెంగ్యూ బాధితులకు ఆస్పిరిన్, బ్రూఫెన్‌ వంటి మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్‌ రక్తాన్ని పలచబారుస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు  ప్లేట్‌లెట్స్‌ తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆస్పిరిన్‌ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను మరింత పెంచుకున్నట్టే. ఇది చాలా ప్రమాదకరం కాబట్టే ఈ జాగ్రత్త పాటించాలి. అయితే గుండెజబ్బులు ఉన్నవారు ఆస్పిరిన్‌ మామూలుగానే వాడుతుంటారు. ఇలాంటివారు డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రక్తాన్ని పలచబార్చే మందులు వాడకూడదు. ఇది మరింత ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.  ప్లేట్‌లెట్లు లక్ష కంటే తగ్గినప్పుడు ప్రతిరోజూ పరీక్ష చేయించుకోవాలి. అయితే రోజుకు ఒకసారి మాత్రమే  పరీక్ష చేయించుకోవాలి. జ్వరం తగ్గాక ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి పెరిగాక, మళ్లీ తగ్గి, మళ్లీ పెరుగుతాయి. అయితే ప్లేట్‌లెట్ల సంఖ్య 20,000 కంటే తగ్గితే మాత్రం హాస్పిటల్‌లో చేరడం అవసరం.

నివారణ ఎంతో మేలు...
అన్ని వ్యాధుల లాగే డెంగ్యూ విషయంలోనూ చికిత్స కంటే నివారణ ఎంతో మేలు. డెంగ్యూ వచ్చేందుకు దోహదపడే టైగర్‌దోమ రాత్రిపూట కాకుండా పట్టపగలే కుడుతుంటుంది. నిల్వ ఉండే మంచి నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియకు పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా  జాగ్రత్తపడాలి. వీలైతే వారంలో ఏదో ఒకరోజు ఇంటిలోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటించాలి. 
∙ఇంట్లోని మూలల్లో చీకటి ప్రదేశంలో, చల్లని ప్రదేశాల్లో ఎడిస్‌ ఎజిపై్ట అవాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. అయితే అదే సమయంలో బయటి నుంచి దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధించుకోవడానికి తలుపులకు, కిటికీలకు మెష్‌ అమర్చుకోవడం చాలా మంచిది. 
∙ఈ దోమ నిల్వ నీటిలో గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వాడని టైర్లను తడిలేకుండా చేసి ఎండలో పడేయాలి. తాగు నీరు కాకుండా మిగతా అవసరాల కోసం వాడే నీటిలో బ్లీచింగ్‌ పౌడర్‌ కలపాలి. దీనివల్ల ఎడిస్‌ ఎజిపై్ట గుడ్లు పెట్టకుండా నివారించ వచ్చు. 
∙ఇంట్లో ఉన్నప్పుడూ ఒంటి నిండా ఉండే దుస్తులనే ధరించాలి. హాఫ్‌ స్లీవ్స్‌ కంటే ఫుల్‌ స్లీవ్స్‌ ఉత్తమం. కాళ్లనూ కవర్‌ చేసే పైజామాలు, సాక్స్‌ వేసుకుంటే  మంచిది. 
∙ఎడిస్‌ ఎజిపై్ట దోమలు ముదురు రంగులకు తేలిగ్గా ఆకర్షితమవుతాయి. కాబట్టి లేత రంగుల దుస్తులను ధరించడం మేలు. 
∙దోమలను దూరంగా తరిమివేసే మస్కిటోరిపల్లెంట్స్‌ వాడటం మేలు. పగలు కూడా మస్కిటో రిపల్లెంట్స్‌ వాడవచ్చు. పికారిటిన్‌ లేదా ఆయిల్‌ ఆఫ్‌ లెమన్‌ యూకలిప్టస్‌ లేదా ఐఆర్‌ 3535... కంపోజిషన్‌లోని ఈ మూడింటిలో ఏది ఉన్నా ఆ రిపల్లెంట్స్‌ వాడవచ్చు. ఈ మస్కిటో రిపల్లెంట్స్‌ ప్రతి 4 – 6 గంటలకు ఒకసారి శరీరంపై బట్టలు కప్పని భాగాల్లో స్ప్రే చేసుకోవాలి. అయితే ముఖం మీద స్ప్రే చేసుకునే సమయంలో ఇవి కళ్ల దగ్గర స్ప్రే కాకుండా జాగ్రత్త పడాలి. 

చికిత్స
డెంగ్యూ అనేది వైరస్‌ కాబట్టి దీనికి నిర్దిష్టమైన మందులు లేవు. కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తుంటారు. అంటే సింప్టమేటిక్‌ ట్రీట్‌మెంట్‌ మాత్రమే ఇస్తారు. వ్యాధి వచ్చిన వ్యక్తి బీపీ పడిపోకుండా ముందు నుంచే నోటిద్వారా లవణాలతో కూడిన ద్రవాహారం (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్స్‌– ఓఆర్‌ఎస్‌) ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రోగి షాక్‌లోకి వెళుతుంటే  అప్పుడు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించాలి. రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి తాజా రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్‌ఎఫ్‌íపీ (ఫ్రెష్‌ ఫ్రోజెన్‌ ప్లాస్మా) అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సాధారణంగా 20 వేల నుంచి 15 వేలు అంతకంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. కాబట్టి మరీ తక్కువకు ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోతుంటే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి వస్తుంది. వాటిని ఎప్పుడు ఎక్కించాలన్న అంశాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా డెంగ్యూ  ఎవరికైనా సోకవచ్చు. ముఖ్యంగా గర్భిణుల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వారిలో జ్వరం వస్తే అది డెంగ్యూ కావచ్చేమోనని అనుమానించి తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి.

వ్యాక్సిన్‌ ఉంది... అయితే

ఇప్పుడు డెంగ్యూకు టీకా (వ్యాక్సినేషన్‌) అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచనల మేరకు ఈ టీకాను గతంలో డెంగ్యూ వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండోసారి డెంగ్యూ రావడం చాలా ప్రమాదకరం కాబట్టి అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని నివారించేందుకు ఈ టీకా తోడ్పడుతుంది. అంటే అంతర్గత అవయవాల్లో తీవ్రమైన రక్తస్రావం అయి రోగి 
∙సీబీపీ ప్రతి 24 గంటలకు ఒకసారి చేయాలి.
∙డెంగ్యూ నిర్ధారణ కోసం డెంగ్యూ ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌ పరీక్ష అవసరం కావచ్చు.
∙డెంగ్యూ ఐజీఎమ్‌ అనే పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో వ్యాధి నిర్థారణ రిపోర్టులు వచ్చే సమయం కూడా ఎక్కువే కాబట్టి అవి వచ్చే వరకు ఆగకుండా... లక్షణాలను బట్టి ముందుగానే చికిత్స తీసుకోవడం మంచిది. పైగా దీనికి చేసే చికిత్స కూడా లక్షణాలను బట్టి చేసేదే కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. 
మరింత ప్రమాదకరమైన ఇతర లక్షణాలు
∙ప్లేట్‌ లెట్స్‌ తక్కువైన కారణాన నిరంతర రక్తస్రావం అనే ప్రమాదకరమైన లక్షణమే కాకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇతర లక్షణాలూ కనిపిస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది ఒంట్లో నీరు, లవణాల మోతాదు బాగా తగ్గిపోవడం (సివియర్‌ డీహైడ్రేషన్‌). అంతేకాదు... కొన్ని సందర్భాల్లో హీమోగ్లోబిన్‌ కాన్సన్‌ట్రేషన్‌ పెరుగుతుంది. హెమటోక్రిట్‌ పెరుగుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టదు. రక్తపోటు పడిపోతుంది. లివర్‌ ఎన్‌లార్జ్‌ అయి డ్యామేజ్‌ అయ్యే ప్రమాదమూ ఉంటుంది. హార్ట్‌బీటింగ్‌ నిమిషానికి 60 కంటే తక్కువకు కూడా పడిపోవచ్చు. బ్లీడింగ్, ఫిట్స్‌ వల్ల బ్రెయిన్‌ డ్యామేజ్‌ అయ్యే ప్రమాదమూ ఉంది. మన వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూన్‌ సిస్టం) డ్యామేజ్‌ అయ్యే ముప్పు పొంచి ఉంటుంది. 
∙గుండె స్పందనలు (హార్ట్‌బీట్‌) 60 కంటే తక్కువకు పడిపోవడం అన్నది చాలా ప్రమాదకరమైన సూచన. రోగికి ఇలాంటి పరిస్థితి వస్తే ఇంటెన్సిక్‌ కేర్‌లో ఉంచాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది. సాధారణ డెంగ్యూ నివారణకు దీన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు.

నిర్ధారణ పరీక్షలు 
మొదటి సారి కంటే...  తర్వాతి వాటితోనే మరింత డేంజర్‌ 
సాధారణంగా మొదటిసారి వచ్చే డెంగ్యూ కంటే... ఒకసారి వచ్చి తగ్గాక మళ్లీ వస్తే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే... డెంగ్యూని సంక్రమింపజేసే వైరస్‌లో నాలుగు రకాలున్నాయి. అదే రకం వైరస్‌ మరోసారి వస్తే అది ప్రమాదకరం కాదు. కాని... ఒకసారి వ్యాధికి గురైన వాళ్లలో మరోసారి ఇంకో రకమైన డెంగ్యూ వైరస్‌ వచ్చినప్పుడు అది మరింత తీవ్రరూపంలో కనిపిస్తుంది. అందుకే మొదటిసారి కంటే ఆ తర్వాత వచ్చేవి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. 

డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే యాంటీబయాటిక్స్‌ వద్దు 
చాలా మంది గ్రామీణ డాక్టర్లు డెంగ్యూ లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్‌ మందులు ఉపయోగిస్తుంటారు. అయితే డెంగ్యూ రోగికి జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్స్‌ వాడటం సరికాదు. ఇలా మందుల వల్ల ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గి్గతే అది అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు. ఫలితంగా మందులే ప్రమాదకరం కావచ్చు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే డాక్టర్ల సలహా తీసుకున్నాకే వాడాలి. 

ప్రమాదకర పరిస్థితులకు  ముందస్తు సంకేతాలివి... 
ఇంట్లో ఎవరైనా విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్తున్నా, నలుపు రంగులో  మలవిసర్జనమవుతున్నా, ముక్కులోంచి కానీ, చిగుర్ల్లలోంచి కానీ బ్లీడింగ్‌ అవుతున్నా, దాహంతో గొంతెండి పోతున్నా, చెమటలు పట్టి శరీరం చల్లబడిపోయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. 

మలేరియాకీ...  డెంగ్యూకూ తేడా ఇది... 
మలేరియా, డెంగ్యూ... ఈ రెండూ దోమలతోనే వచ్చే జ్వరాలే అయినా మలేరియా అన్నది ఆడ అనాఫిలస్‌ దోమ కుట్టడం వల్ల వస్తుంది. అదే డెంగ్యూ అన్నది ఎడిస్‌ (టైగర్‌) దోమ కారణంగా వస్తుంది.రెండింట్లోనూ కనిపించే సాధారణ లక్షణం జ్వరం. అయితే మలేరియాలోని రకాలను బట్టి  జ్వరం  అన్నది నిర్దిష్టంగా ఒక నిర్ణీత సమయానికి ప్రతిరోజూ వస్తూ తగ్గుతూ ఉంటుంది. కానీ డెంగ్యూ సోకిన వ్యక్తిలో జ్వరం ఎప్పుడైనా రావచ్చు. డెంగ్యూ వచ్చిన వారిలో వచ్చే నొప్పి ఎముకలు విరిగినంత తీవ్రంగా వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్‌ బోన్‌ ఫీవర్‌’ అని కూడా అంటారు. 

డాక్టర్‌ టి.ఎన్‌.జె. రాజేశ్, 
సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌  ఇంటర్నల్‌ మెడిసిన్‌ – ఇన్‌ఫెక్షియస్‌ 
డిసీజెస్, స్టార్‌ హాస్పిటల్స్,  బంజారాహిల్స్, హైదరాబాద్‌ 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement