సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక వైరస్ ‘నిఫా’ ప్రకంపనలు రేపుతోంది. కేరళను వణికిస్తున్న ఈ కొత్త వ్యాధి ఇప్పటికే 11 మందిని పొట్టన పెట్టుకోగా... మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. వ్యాధి సోకిన పందులు, ఇతర సంక్రమిత జంతువులు ద్వారా లేదా కలుషితమైన పండ్లు (గబ్బిలాలు సగం తినే పండ్లను తినడం) ద్వారా ఈ వైరస్ సోకుతుందని ఇండియన్ జర‍్నల్ ఆఫ్ వైరాలజీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ పుట్టుక, విస్తరణ, వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యలపై నిపుణుల సూచనలను ఒకసారి చూద్దాం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 1998 లో మలేషియాలో ఈ వైరస్‌ను తొలుత గుర్తించారు. మలేషియా, సింగపూర్‌లలో 100 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. నిఫా వైరస్ (ఎన్‌ఐవీ) పారామిక్సోవిరిడే జాతికి చెందినదీ వైరస్. ఈ వైరస్ అటు మనుషులను, ఇటు జంతులను కూడా సోకే ప్రమాదముంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అందించిన సమాచారం ప్రకారం ఇండియాలోనూ గతంలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. మలేషియా నుంచి 2001 ఈ వైరస్ మెల్లగా బంగ్లాదేశ్‌కు పాకింది. దాదాపు ప్రతి ఏడాది ఈ వైరస్ తన ఉనికిని చాటుకుంటోందని సీడీసీ తెలిపింది. ఆ తర్వాత ఇండియాలోని సిలిగురిలో కూడా వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సోకుతున్నట్లు గుర్తించారు.
వ్యాధి లక్షణాలు
ఈ నిఫా వైరస్ గుర్తించడానికి 5 నుంచి 14 రోజులు పడుతుంది. ఆ తర్వాత శరీరంలో చాలా వేగంగా మార్పులు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం, శ్వాస సంబంధమైన సమస్యలు, లోబీపీ, అపస్మారక స్థితి, ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి, వాంతులు, అలసట, అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. వ్యాధి ముదిరితే మెదడును ప్రభావితం చేసే ఎన్‌సెఫలైటిస్ కారణంగా రోగి కోమాలోకి వెళ్ళవచ్చు. అయితే ప్రస్తుతం కేరళలో ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు మరికొన్ని లక్షణాలు కూడా గుర్తించారు. జ్వరం, సడెన్‌గా శ్వాస ఆడకపోవడం, లో బీపీతో రోగులు బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనికి లాంటి చికిత్స అందుబాటులో లేదు. అయితే ఆస్ట్రేలియాలో గుర్రాలకు హెండ్రా అనే వైరస్ సోకినపుడు ఇచ్చే చికిత్సనే ఈ నిఫాకు కూడా ప్రస్తుతం ఇస్తున్నారట.
నిఫాకు ఆ పేరు ఎలా వచ్చింది?
మలేషియాలో సుంగాయ్ నిఫా అనే గ్రామంలో మొదటగా ఈ వైరస్ కనిపించడంతో దానికి నిఫా అనే పేరు పెట్టారు. పందుల తర్వాతి కాలంలో కొన్ని జాతుల గబ్బిలాల ద్వారా ఈ వైరస్ సోకింది. ఈ నిపా వైరస్ ఓ జూనోటిక్ వైరస్. అంటే ఇది మనుషులకు, పశువులకు గాలి ద్వారా లేక లాలాజలం ద్వారా సోకుతుంది. అయితే ఇది గాలి ద్వారా సోకేది కాదని డాక్టర్లు చెబుతున్నారు. 1999లో పశువులకు దగ్గరగా ఉండే రైతులు, ఇతరుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆ సమయంలో 300 పందులు పాక్షికంగా ఈ వైరస్ బారిన పడగా.. వంద మందికి పైగా మరణించారు. మొత్తం 265 మందికి ఈ వైరస్ సోకగా.. 40 శాతం మంది వ్యాధి ముదరడంతో చనిపోయారు. అప్పట్లో వ్యాధి సోకకుండా పది లక్షల పందులను చంపేశారు.
తాజాగా గబ్బిలాలను తాకడం లేదా అవి కొరికిన పండ్లు తినడం ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెప్పారు. ఇది ప్రాణాంతకమైన అంటువ్యాధి అని అప్రమత‍్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోగి నుండి దూరంగా ఉండటం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, టాయిలెట్ల వాడకం దగ్గరనుంచి రోగులు ఉపయోగించే బట్టలు, పాత్రలను విడిగా ఉంచాలని సూచిస్తున్నారు. మృతదేహాన్ని తాకకుండా ఉండటంతోపాటు శ్మశానానికి తరలించేటపుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment