Deadly disease
-
ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం
అయిదేళ్ల ఆ చిన్నారి పేరు రెండు వారాల కిందట ఆసీస్ ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. కారణం.. ఓ ప్రాణాంతక వ్యాధిపై పోరుకోసం చేయనున్న చట్ట సవరణ ప్రతిపాదన బిల్లుకు ఆ చిన్నారి పేరు పెట్టడమే. దీనిని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ ఏకంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఆ చట్టం మావె లా.. ఆ చిన్నారి పేరు మావె హుడ్. విప్లవాత్మక చట్ట సవరణకు ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం దాగి ఉంది. సారా హుడ్, జోయెల్ హుడ్ దంపతుల మూడో కూతురు మావె హుడ్. ఐదు నెలల వయసులో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది మావెలో. వైద్యుల పర్యవేక్షణ, చికిత్సతో కోలుకున్నప్పటికీ ఆ తర్వాతా అనేక సమస్యలు వెంటాడాయి. 18 నెలల వయసులో చిన్నారి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈసారి పాపను పరీక్షించిన వైద్యులు.. మైటోకాండ్రియా లోపంతో వచ్చే లీ సిండ్రోమ్‌కు గురైనట్లు గుర్తించారు. పాపను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ, అప్పటికప్పుడు మాత్రలతో వ్యాధి తీవ్రతను తగ్గించి, మరణాన్ని వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదన్నారు డాక్టర్లు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ పాప పరిస్థితికి తల్లఢిల్లినా, పాపను అప్రమత్తంగా చూసుకోసాగారు. ఇటీవల ఈ విషయం పత్రికల ద్వారా ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్‌కు చేరింది. మావె పడుతున్న కష్టాలను తెలుసుకున్న ఆయన దేశంలో మరే చిన్నారికీ ఇలాంటి అవస్థ రాకూడదంటే ఏం చేయాలో చెప్పాలని వైద్యులనడిగారు. డీఎన్ఏ మార్పిడి ద్వారా ఈ సమస్య పరిష్కరించవచ్చని వాళ్లు చెప్పారు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే.. తల్లి గర్భిణిగా ఉన్నప్పడు చిన్నారిలోని ఆమె డీఎన్ఏ స్థానంలో మరొకరి నాణ్యమైన డీఎన్ఏను ఐవీఎఫ్ పద్ధతిలో ప్రవేశపెడితే ప్రాణాంతక వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చని వివరించారు. అయితే, ఇది కష్టమైన పని. ఎందుకంటే డీఎన్ఏ మార్పిడిపై ఆసీస్‌లో నిషేధం ఉంది. దీంతో ఈ చట్టాన్ని సవరించేందుకు గ్రెగ్ హంట్ తీర్మానించాడు. అందులో భాగంగానే చట్ట సవరణ కోరుతూ బిల్లు ప్రవేశపెట్టడంతోపాటు, ఆ బిల్లుకు మావె పేరు పెట్టాడు. నిజానికి ఆస్ట్రేలియాలో ఏటా కనీసం 56 మంది చిన్నారులు మైటోకాండ్రియా డిసీజ్‌తో జన్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందులో చాలామంది ఐదేళ్లలోపే మరణిస్తున్నారు. ఈ పరిస్థితిని పరిష్కరించి, పసిప్రాణాలను కాపాడడం, తల్లిదండ్రుల కడుపుకోతను అడ్డుకోవాలనే తన ప్రయత్నానికి మనఃస్ఫూర్తిగా సహకరించాలని గ్రెగ్ హంట్ పార్లమెంట్లో విపక్ష సభ్యులందరినీ కోరాడు. ఈ చట్ట సవరణకు ఆమోదం లభిస్తే ఆ తరువాత ఆస్ట్రేలియాలో మైటోకాండ్రియాతో చిన్నారులు మరణించడమేనేది ఉండకపోవచ్చు. మైటోకాండ్రియా డిసీజ్ అంటే... మనిషిని పట్టి పీడించే ప్రాణాంతక వ్యాధుల్లో ఇదొకటి. మన శరీరానికి కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుందనే విషయం తెలిసిందే కదా. అయితే, ఆహారం జీర్ణమై శక్తిగా రూపొందడంలో కీలకంగా వ్యవహరించే పాత్ర మన శరీరంలోని ఉండే కణాల్లోని మైటోకాండ్రియాదే. ఏ కారణం వల్ల అయినా మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోయినా, నిర్జీవమైనా మన శరీరానికి తగిన శక్తి ఆహారం నుంచి అందదు. ఫలితంగా రకరకాల రుగ్మతలు వస్తాయి. అందులో ముఖ్యమైనది ఆర్గాన్ ఫెయిల్యూర్.. అంటే అవయవం పనిచేయకపోవడం. ఇది మరణానికి దారి తీస్తుంది. అలాగే గుండెపోటు, చెవుడు, దృష్టిలోపం, నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం వంటివీ సంభవిస్తాయి. జన్యులోపం వల్లో, వంశపారంపర్యంగానో, జీవన శైలిలో మార్పుల వల్లో వచ్చే ఈ వ్యాధికి ఇప్పటికీ సరైన చికిత్స లేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేలోగా ఎప్పుడైనా సరే ఈ వ్యాధి వచ్చే ప్రమాదముంది. -
అమెరికాను వణికిస్తున్న కొత్త వ్యాధి
అమెరికాను ఒక కొత్త వ్యాధి గజ గజ వణికిస్తోంది. ఇప్పటికే జంతువుల నుంచి వ్యాప్తి చెందే అనేక అంటురోగాలతో అవస్థలు పడుతున్న అమెరికా ఇపుడు జింకలను చూస్తేనే భయపడిపోతోంది. వన్య మృగాలైన జింకలు, దుప్పిల్లో ఇటీవల విస్తృతంగా వ్యాప్తిస్తూ.. వాటి ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తున్న ‘జొంబీ డీర్’ వ్యాధిపై షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు అక్కడి వైద్య నిపుణులు. ‘జొంబీ డీర్’ (క్రానిక్ వాస్టింగ్ డిసీజ్, సీడబ్యుడీ) అని పిలిచే భయంకరమైన వ్యాధి (డెడ్లీ డిసీజ్) ఆనవాళ్లు ఇప్పటివరకూ జింక, దుప్పి జాతుల్లో మాత్రమే కనిపించాయి. కానీ ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందన్నది నిపుణుల తాజా హెచ్చరిక. ఇదే అగ్రరాజ్య ఆరోగ్య శాఖను పరుగులు పెట్టిస్తోంది. సీడబ్యుడీ వైరస్ సోకగానే..దాని లక్షణాలు వెంటనే బహిర్గతం కావు. శరీరం మొత్తంలో విస్తరించిన తర్వాత గానీ ఈ వ్యాధి సోకినట్లు అర్థంకాదు. దీంతో ఈ వ్యాధి తీవ్రత గురించి ఆందోళన పడాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని ఇలినాయిస్ సహా 24 రాష్ట్రాలతొపాటు, రెండుకెనడియన్ ప్రావిన్స్‌లో జొంబీ డీర్ వ్యాపించినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు చెబుతున్నారు. 1960లో కొలరాడోలో, అడవి జింకలో 1981లో మరోసారి గుర్తించామన్నారు. ప్రస్తుతానికి ఈ వ్యాధి మనుషులకు సోకిన కేసులను గుర్తించనప్పటికీ, మానవులకు సోకే ప్రమాదం లేకపోలేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. జొంబీ వైరస్ సోకగానే బరువుతగ్గిపోవడం, బాగా దప్పిక వేయడం, నోటినుంచి చొంగకారడం లాంటి సంకేతాలు కనిపిస్తాయట. ఇప్పటికే వేలకొద్దీ జింకల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి.అలాగే వీటి శారీరక ద్రవాలు మలం, లాలాజలం, రక్తం లేదా మూత్రంలో ఉన్న సీడబ్యూడీ వైరస్ ఎక్కువకాలం పర్యావరణంలో చురుకుగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇవి క్రమంగా మనుషులకు కూడా సోకుతాయని తేల్చారు. మరోవైపు దీని నివారణకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళనకు దారితీస్తోంది. -
ప్రాణాంతక వైరస్ : లక్షణాలు, వ్యాప్తి, నివారణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక వైరస్ ‘నిఫా’ ప్రకంపనలు రేపుతోంది. కేరళను వణికిస్తున్న ఈ కొత్త వ్యాధి ఇప్పటికే 11 మందిని పొట్టన పెట్టుకోగా... మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. వ్యాధి సోకిన పందులు, ఇతర సంక్రమిత జంతువులు ద్వారా లేదా కలుషితమైన పండ్లు (గబ్బిలాలు సగం తినే పండ్లను తినడం) ద్వారా ఈ వైరస్ సోకుతుందని ఇండియన్ జర్నల్ ఆఫ్ వైరాలజీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ పుట్టుక, విస్తరణ, వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యలపై నిపుణుల సూచనలను ఒకసారి చూద్దాం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 1998 లో మలేషియాలో ఈ వైరస్‌ను తొలుత గుర్తించారు. మలేషియా, సింగపూర్లలో 100 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. నిఫా వైరస్ (ఎన్ఐవీ) పారామిక్సోవిరిడే జాతికి చెందినదీ వైరస్. ఈ వైరస్ అటు మనుషులను, ఇటు జంతులను కూడా సోకే ప్రమాదముంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అందించిన సమాచారం ప్రకారం ఇండియాలోనూ గతంలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. మలేషియా నుంచి 2001 ఈ వైరస్ మెల్లగా బంగ్లాదేశ్‌కు పాకింది. దాదాపు ప్రతి ఏడాది ఈ వైరస్ తన ఉనికిని చాటుకుంటోందని సీడీసీ తెలిపింది. ఆ తర్వాత ఇండియాలోని సిలిగురిలో కూడా వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సోకుతున్నట్లు గుర్తించారు. వ్యాధి లక్షణాలు ఈ నిఫా వైరస్ గుర్తించడానికి 5 నుంచి 14 రోజులు పడుతుంది. ఆ తర్వాత శరీరంలో చాలా వేగంగా మార్పులు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం, శ్వాస సంబంధమైన సమస్యలు, లోబీపీ, అపస్మారక స్థితి, ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి, వాంతులు, అలసట, అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. వ్యాధి ముదిరితే మెదడును ప్రభావితం చేసే ఎన్సెఫలైటిస్ కారణంగా రోగి కోమాలోకి వెళ్ళవచ్చు. అయితే ప్రస్తుతం కేరళలో ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు మరికొన్ని లక్షణాలు కూడా గుర్తించారు. జ్వరం, సడెన్‌గా శ్వాస ఆడకపోవడం, లో బీపీతో రోగులు బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనికి లాంటి చికిత్స అందుబాటులో లేదు. అయితే ఆస్ట్రేలియాలో గుర్రాలకు హెండ్రా అనే వైరస్ సోకినపుడు ఇచ్చే చికిత్సనే ఈ నిఫాకు కూడా ప్రస్తుతం ఇస్తున్నారట. నిఫాకు ఆ పేరు ఎలా వచ్చింది? మలేషియాలో సుంగాయ్ నిఫా అనే గ్రామంలో మొదటగా ఈ వైరస్ కనిపించడంతో దానికి నిఫా అనే పేరు పెట్టారు. పందుల తర్వాతి కాలంలో కొన్ని జాతుల గబ్బిలాల ద్వారా ఈ వైరస్ సోకింది. ఈ నిపా వైరస్ ఓ జూనోటిక్ వైరస్. అంటే ఇది మనుషులకు, పశువులకు గాలి ద్వారా లేక లాలాజలం ద్వారా సోకుతుంది. అయితే ఇది గాలి ద్వారా సోకేది కాదని డాక్టర్లు చెబుతున్నారు. 1999లో పశువులకు దగ్గరగా ఉండే రైతులు, ఇతరుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆ సమయంలో 300 పందులు పాక్షికంగా ఈ వైరస్ బారిన పడగా.. వంద మందికి పైగా మరణించారు. మొత్తం 265 మందికి ఈ వైరస్ సోకగా.. 40 శాతం మంది వ్యాధి ముదరడంతో చనిపోయారు. అప్పట్లో వ్యాధి సోకకుండా పది లక్షల పందులను చంపేశారు. తాజాగా గబ్బిలాలను తాకడం లేదా అవి కొరికిన పండ్లు తినడం ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెప్పారు. ఇది ప్రాణాంతకమైన అంటువ్యాధి అని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోగి నుండి దూరంగా ఉండటం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, టాయిలెట్ల వాడకం దగ్గరనుంచి రోగులు ఉపయోగించే బట్టలు, పాత్రలను విడిగా ఉంచాలని సూచిస్తున్నారు. మృతదేహాన్ని తాకకుండా ఉండటంతోపాటు శ్మశానానికి తరలించేటపుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. -
వణికిస్తున్న ‘నిఫా’ : పెరుగుతున్న మృతులు
సాక్షి, కాజికోడ్: కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోళికోడ్(కాలికట్) జిల్లాలో ఈ వ్యాధి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి పదకొండు మంది మృత్యువాత పడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ వ్యాధి సోకిందనే అనుమానాలతో దాదాపు 25మందిని అబ్జర్వేషన్లో ఉంచారు. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. తాజా పరిస్థితులపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని రాష్ట్ర ఆరోగ్య విభాగం డైరెక్టర్ డా. ఆర్ఎల్ సరిత వెల్లడించారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ తొమ్మిదిమంది మరణించారని చెప్పారు. శాంపిళ్లను పరీక్షలకోసం పుణేలోని పరిశోధనా కేంద్రానికి పంపించామన్నారు. అటు జిల్లా కలెక్టర్ యూవీ జోస్ నేతృత్వంలోని ఒక టాస్క్‌ఫోర్స్ బృందం పరిస్థితిని పరిశీలిస్తోంది. మరోవైపు ఈ డెడ్లీ వైరస్ విస్తరణపై కేంద్రం కూడా స్పందించింది. జాతీయ వ్యాధి నియంత్రణ బృందాన్ని కేరళకు వెళ్లాల్సిందిగా కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆదేశించారు. ఈ మేరకు జాతీయ బృందం వెళ్లి అక్కడి పరిస్థితిపై సమీక్షించనుందని ట్విటర్లో వెల్లడించారు. కేరళలో నిఫా వైరస్ వ్యాప్తిపై సమీక్షపై నిర్వహించాం. జాతీయ వ్యాధి నివారణ బృందాన్ని అక్కడికి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని జేపీ నడ్డా ఆదివారం పేర్కొన్నారు. నిఫా వైరస్(ఎన్ఐవి) మనుషుల్లో తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ సమస్యలు రోగులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తాయి. కాగా, పళ్లను తినే గబ్బిలాలు, ఇతర జంతువుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇప్పటివరకు దీనికి ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడం మరింత ఆందోళనకు గురి చేసే అంశం. Reviewed the situation of deaths related to nipah virus in Kerala with Secreatry Health. I have directed Director NCDC to visit the district and initiate required steps as warranted by the protocol for the disease in consultation with state government. — Jagat Prakash Nadda (@JPNadda) May 20, 2018 -
కాకినాడలో డిఫ్తీరియా.. ఆరేళ్ల బాలుడి మృతి
సాక్షి, కాకినాడ : డిఫ్తీరియా... ఐదేళ్ల లోపు చిన్నారులకు వచ్చే ప్రాణాంతక వ్యాధి.. దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరి వేగంగా సోకే అంటువ్యాధి. దీన్ని కంఠసర్పి లేదా గొంతువాపు వ్యాధి అని కూడా అంటారు. పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని భావి స్తున్న తరుణంలో ఈ వ్యాధి విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఒక చిన్నారి మృత్యువాతపడగా, ఐదుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నట్టుగా నిర్ధారణైంది. మరో 15మంది చిన్నారు లకు ఈ వ్యాధి సోకినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. జిల్లా కేంద్రమైన కాకినాడ నగరంలో డిఫ్తీరియా(కంఠసర్పి) ఆందోళన కల్గించేలా విజృంభిస్తోంది. సాధారణంగా ఐదేళ్లలోపు చిన్నారులకు వ చ్చే ఈ వ్యాధి ఐదేళ్ల నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు సోకుతుండడం జిల్లా యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. మూడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా లో వెలుగు చూసిన ఈ డిఫ్తీరియా జిల్లావాసులను భయపెడుతోంది. నాలుగు రోజుల క్రితం ఈ వ్యాధి సోకి ఏటిమొగకు చెందిన పెమ్మాడి కళ్యాణ్ (6) సోమవారం అర్ధరాత్రి మృత్యువాత పడ్డాడు. భర్తతో విడివడి కొడుకు, కూతురితో జీవనం సాగి స్తున్న ఆదిలక్ష్మి కొడుకు కల్యాణ్‌ను పొగొట్టుకోవడంతో కన్నీరుమున్నీరవుతోంది. అదే ప్రాంతానికి చెందిన కట్టా మధు(5) సంజయ్‌నగర్‌కు చెందిన బాసి రమ్య(5), కొవ్వూరు రోడ్డుకు చెందిన కోరుకొండ మనోహర్(12) తో పాటు సంజయ్‌నగర్‌కు చెందిన మరో ఏడేళ్ల చిన్నారికి వైద్యపరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణైంది. వీరుకాకుండా నగరంలో మురికివాడలకు చెందిన సుమారు 15 మంది చిన్నారులకు ఈ వ్యాధి సోకినట్టు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. ఏడేళ్ల లోపు చిన్నారుల వరకు ఈ వ్యాధి సోకకుండా డీపీటీ బూస్టర్ డోస్ ఇస్తే సరిపోతుంది. కానీ వ్యాధి సోకుతున్న వారు 10 ఏళ్లకు పైబడినవారు కావడం, ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో అధికారులున్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖాధికారులు కాకినాడ నగరపాలక వైద్యఆరోగ్య శాఖాధికారులతో కలిసి అధ్యయనం చేస్తున్నారు. మరోపక్క ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కుటుంబ సంక్షేమాశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. వ్యాధికి గురైన వారిని గుర్తించేందుకు ఇంటింటా సర్వే చేపట్టగా, మురికివాడల్లో అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు. వ్యాధి లక్షణాలు తీవ్రమైన జ్వరం రావడం..కొండనాలుక వద్ద టాన్సిల్స్‌పై తెల్లని లేయర్ ఏర్పడం..నాలుకపై పుండ్లు ఏర్పడడం..గొంతు నొప్పి తీవ్రంగా ఉండడం ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. సకాలంలో గుర్తించకపోతే స్వరపేటిక(వాయిస్బాక్సు)కు సోకి ఆ తర్వాత ఊపిరితిత్తులకు చేరుకుని ప్రాణాంతకమవుతుంది. వ్యాధి తీవ్రమైతే ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టమే. దగ్గు..తుమ్ముల ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధిని ఎలా గుర్తించాలి...సోకితే ఏం చేయాలి గొంతుపరీక్ష ద్వారా మాత్రమే ఈ వ్యాధిని గుర్తించాలి. ప్రాథమిక దశలో గుర్తిస్తేనే మెరుగైన వైద్యం అందించవచ్చు. పరిస్థితి విషమిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. సకాలంలో ఆస్పత్రిలో చే ర్చి ఎరిత్రోమైసిన్ లేదా యాంటిబయాటిక్ ఇస్తే సరిపోతుంది. అయితే వ్యాధి తగ్గే వరకు ఈఎన్టీ వైద్యుల పర్యవేక్షణలో వైద్యం చేయిస్తే 15 రోజుల్లోనే కోలుకొనే అవకాశం ఉంది. ఏ సమయంలో వ్యాక్సిన్లు వేయాలి ? సాధారణంగా డిప్తీరియా (కంఠసర్పి), పెర్టుసిస్ (ఊపిరాడకుండా వచ్చే దగ్గు), టెటనస్ (ధనుర్వాతం) నివారణకు చిన్నారులకు 45 రోజులు,75 రోజులు, 105 రోజులకు హైపటైటిస్ బీ, పోలియో వ్యాక్సిన్లతో కలిపి డీపీటీ ఇస్తారు. ఆ తర్వాత 18నెలలకు, ఐదేళ్లకు, ఏడేళ్లకు డీపీటీ బూస్టర్డోస్లివ్వాలి. ఈ వ్యాధికి కారకమైన ‘కార్ని బాక్టీరియం డిప్తీరియా’అనే బ్యాక్టీరియా ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఉంటుంది. వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉన్నంత వరకు ఈ బ్యాక్టీరియా ఏమీ చేయలేదు. ఆ శక్తి తగ్గినప్పుడు ఈ వ్యాధి విజృంభిస్తుంది. వైద్యశాఖ కార్యాచరణ నగరంలో మరీ ముఖ్యంగా మత్స్యకారప్రాంతాల్లో ఈ వ్యాధి విజృంభిస్తున్నందున పదేళ్ల లోపు చిన్నారులందరికి మరోసారి డీపీటీ బూస్టర్ డోస్ ఇవ్వాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులు నిర్ణయించారు. ముందుగా గుర్తిస్తే ప్రాణాంతకం కాదు ఈ వ్యాధి గొంతునొప్పితో ప్రారంభమవుతుంద ని ప్రభుత్వాసుపత్రి ఈఎన్టీ స్పెషలిస్టు ప్రొఫెసర్ డాక్టర్ జీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాధి అంతరించి పోయినదైనా వైరస్ నిద్రాణమై ఉండి మార్పును సంతరించుకుని రావడం వింతేమీ కాదన్నారు. ప్రారంభంలో గొంతు నొప్పికి ఎరిత్రోమైసిన్ వేస్తే నయమవుతుందని దానికి లొంగక పోతే గ్రామాల్లోని ఆర్ఎంపీలు, సాధారణ డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్‌కు సిఫార్సు చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తి కాకుండా చూడాలన్నారు.