సాక్షి, హైదరాబాద్ : డెంగీ నియంత్రణ చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శ్రీకారం చుట్టింది. దోమల ఉత్పత్తికి బ్రేక్ వేసేందుకు రంగం సిద్ధం చేసింది. రేడియేషన్ ద్వారా పునరుత్పత్తి లేని మగ దోమలను ఉత్పత్తి చేసి, వాటిని ఆడ దోమలపైకి వదలడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవాలనేది దీని ఉద్దేశం. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం కీలకమైన నివేదిక విడుదల చేసిందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అంటే జన్యుమార్పిడి దోమలను ఉత్పత్తి చేయడం ద్వారా, క్రమంగా దోమలన్నింటినీ నిర్మూలించాలనేది దీని ఉద్దేశమని ఆ వర్గాలు విశ్లేషించాయి. ఇదిలావుంటే గతేడాది బ్రిటన్‌కు చెందిన ఒక ప్రముఖ సంస్థ దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారించేందుకు ఇలాంటి ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసిందని వ్యవసాయంలో జన్యు మార్పిడి నిపుణులు డి.నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
జన్యుమార్పిడి పద్ధతి కావడంతో దీనికి కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆయన వివరించారు. స్టెరైల్ క్రిమి టెక్నిక్‌ను మొదట అమెరికా వ్యవసాయశాఖ అభివృద్ధి చేసింది. పంటలు, పశువులపై దాడి చేసే కీటకాలు, తెగుళ్లను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా ఉపయోగించారు. ఈ సాంకేతికతను మానవ వ్యాధులపై ప్రవేశపెట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నిస్తోంది. మగ దోమలను సేకరించి వాటిని తమ లేబొరేటరీలో వాటి గుడ్ల ద్వారా అనేక రెట్ల దోమలను సృష్టిస్తుంది. వాటిని రేడియేషన్ పద్ధతిలో స్టెరిలైజేషన్ చేయడం ద్వారా వాటిలో పునరుత్పత్తి లక్షణం పోతుంది. అనంతరం వాటిని దోమలున్న ప్రాంతాల్లో విడుదల చేస్తారు. అయితే ఇదంతా ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది. సాధ్యాసాధ్యాలపై అస్పష్టత ఉన్నా అందుబాటులోకి వస్తే మాత్రం ఆశించిన ఫలితం ఉండనుంది.
దోమల స్టెరిలైజేషన్ ఎలా?
మున్ముందు ప్రపంచ జనాభాలో సగం మందికి డెంగీ ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ‘డెంగీ నివారణకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నా, దోమల నియంత్రణకు చేపడుతున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడంలేదు. అందువల్ల కొత్త విధానాలు చాలా అవసరం. ఇందులో దోమల స్టెరిలైజేషన్ పద్ధతి ఆశాజనకంగా ఉంది’ అని ఆమె ఆ నివేదికలో అభిప్రాయపడ్డారు. డెంగీ, చికున్‌గున్యా, జికా వంటి వ్యాధులను నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నాల్లో భాగంగా రేడియేషన్ ఉపయోగించి మగ దోమలను పునరుత్పత్తి రహితంగా చేసే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది.
స్టెరైల్ క్రిమి టెక్నిక్ మొదట అమెరికా వ్యవసాయశాఖ అభివృద్ధి చేసింది. పంటలు, పశువులపై దాడి చేసే కీటకాలు, తెగుళ్లను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా ఉపయోగించారు. మానవ వ్యాధులపై పోరాడటానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆరోగ్య రంగానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల విశ్లేషణ ప్రకారం జన్యుమార్పిడి, రేడియేషన్ ద్వారా స్టెరిలైజేషన్ చేయడంలో ప్రసిద్ధి చెందిన ఏదో ఒక సంస్థను ఎంచుకుంటారు. ఆ సంస్థ మగ దోమలను సేకరించి వాటిని తమ లేబరేటరీలో వాటి గుడ్ల ద్వారా అనేక రెట్లు దోమలను సృష్టిస్తుంది. వాటిని రేడియేషన్ పద్ధతిలో స్టెరిలైజేషన్ చేయడం ద్వారా వాటిలో పునరుత్పత్తి లక్షణం పోతుంది. అనంతరం వాటిని దోమలున్న ప్రాంతాల్లో విడుదల చేస్తారని నిమ్స్ ప్రముఖ వైద్యులు డాక్టర్ గంగాధర్ అభిప్రాయపడ్డారు. దీన్నే జన్యుమార్పిడి దోమల ఉత్పత్తి అంటారని ఆయన వివరించారు.
పట్టణీకరణ వల్లే...
వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటివరకు 40 వేల మందికి పైగా డెంగీ పరీక్షలు చేస్తే, వారిలో పావు వంతు మందికి డెంగీ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో రెండో స్థానంలో తెలంగాణ ఉందని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో డెంగీ నివారణ పద్ధతులపై రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వేగవంతమైన ప్రణాళికలేని పట్టణీకరణ, పెరిగిన తేమ, విస్తరించిన వర్షాకాలం, వాతావరణ పరిస్థితులలో వైవిధ్యం ఫలితంగా డెంగీ విజృంభిస్తోంది. అలాగే పేలవమైన నీటి నిల్వ పద్ధతులు దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉంటున్నాయి. 2019లో భారతదేశంలో గణనీయంగా డెంగీ కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment