యూపీని వణికిస్తున్న విష జ్వరాలు.. హెమరాజిక్‌ డెంగీ కాటు వల్లే | 40 Children Among 50 To Die Of Dengue In UP District | Sakshi
Sakshi News home page

యూపీని వణికిస్తున్న విష జ్వరాలు.. హెమరాజిక్‌ డెంగీ కాటు వల్లే

Sep 4 2021 4:21 AM | Updated on Sep 4 2021 8:48 AM

40 Children Among 50 To Die Of Dengue In UP District - Sakshi

ఫిరోజాబాద్‌/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో డెంగీతోపాటు విష జ్వరాలు చిన్నారుల ప్రాణాలను కబళిస్తున్నాయి. జ్వరాల కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 50కి చేరిందని, మృతుల్లో 40 మంది చిన్నారులు ఉన్నారని ప్రభుత్వ అధికారులు శుక్రవారం ప్రకటించారు. జ్వరాల కాటుపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాజధాని లక్నోలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆగ్రా, ఫిరోజాబాద్‌ జిల్లాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని, జ్వర పీడితులకు వైద్య సాయం అందించాలని, మరణాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు.

బాధితులకు ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న ఐసోలేషన్‌ పడకలు కేటాయించాలన్నారు. కోవిడ్‌ బాధితుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను జ్వర పీడితుల వైద్యం కోసం వాడుకోవాలని చెప్పారు. ఫిరోజాబాద్‌లో జ్వరాల తీవ్రతపై కేంద్రం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ), నేషనల్‌ వెక్టర్‌ బార్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌కు చెందిన నిపుణులను ఫిరోజాబాద్‌కు పంపించింది.  మథుర, ఆగ్రా జిల్లాల్లోనూ విష జ్వరాల కేసులు పెరుగుతున్నాయని యూపీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ దినేష్‌ కుమార్‌ ప్రేమీ చెప్పారు. ఫిరోజాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం 3,719 మంది బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు.

హెమరాజిక్‌ డెంగీ కాటు వల్లే..
ప్రమాదకరమైన హెమరాజిక్‌ డెంగీ కాటు వల్లే చిన్నారులు ఎక్కువగా బలవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) బృందం తెలియజేసిందని ఫిరోజాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌  చంద్రవిజయ్‌ సింగ్‌ అన్నారు. ఈ రకం డెంగీ వల్ల బాలల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య హఠాత్తుగా పడిపోతుందని, రక్తస్రావం అవుతుందని వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ముగ్గురు వైద్యులను ఆయన సస్పెండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement