
మాట్లాడుతున్న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో డెంగీ, తదితర జ్వరాల బాధితులతో ఆస్పత్రులు కిక్కిరిసి పోతుండటంతో హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడింది. వ్యాధులు సోకేందుకు ఆస్కారమున్న దాదాపు నెలన్నర రోజుల పాటు వైద్యాధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. అన్ని పాఠశాలల్లోనూ ప్రతిరోజూ దోమల నివారణ మందు స్ప్రే చేయాలని, గల్లీలు, రోడ్లపై చెత్త లేకుండా ఏరోజు కారోజు శుభ్రం చేయాలని నిర్ణయించారు. సీజనల్‌వ్యాధుల నియంత్రణపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరాలు వెల్లడించారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోం శాఖ మంత్రి మహమూద్‌అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీతోపాటు శివారు మునిసిపాలిటీల్లోనూ ఏరోజుకారోజు చెత్త తొలగించాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని, వాహనాలను వినియోగించాలన్నారు. నగరంలో నిర్మాణాలు జరగని ఖాళీ ప్లాట్లలో చెత్త వేస్తుండటంతో డంపింగ్ యార్డులుగా మారాయని, వాటిని తొలగించే బాధ్యత యజమానులదేనన్నారు. జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రైవేట్ డాక్టర్లు, మెడికల్ కాలేజీల సహకారంతో వైద్యశిబిరాలు నిర్వహిస్తామన్నారు. సీజనల్ వ్యాధులపై పత్రికల్లో వచ్చే వార్తలపై వెంటనే స్పందించి తగు వివరణలు ఇవ్వాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్పత్రుల్లో చేరుతున్నవారు, పాజిటివ్ కేసులు తదితర వివరాల కోసం కోఆర్డినేటర్‌ను నియమించి, పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నిత్యం పరిస్థితుల్ని సమీక్షిస్తామన్నారు. దోమలు, అంటు వ్యాధుల నివారణకు ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘా లు, బస్తీ కమిటీలు కృషి చేయాలని కోరారు.
ఆందోళన అనవసరం...
అంటు వ్యాధులతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈటల పేర్కొన్నారు. 2017తో పోలిస్తే ప్రస్తుతం డెంగీ కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. అయినా వ్యాధుల నివారణకు విస్తృతచర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులతో పాటు 95 అర్బన్ హెల్త్ సెంటర్లలో ఈవినింగ్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్క ఫీవర్ ఆస్పత్రిలోనే జ్వర బాధితులకు పరీక్షలు నిర్వహించేందుకు 25 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హోం మంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ నగరంలో గణేశ్ ఉత్సవాలు, మొహర్రంల సందర్భంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల సహకారంతో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ, వైరల్ ఫీవర్లు అధికంగా ఉన్న వాడలు, బస్తీలు, కాలనీల్లో వారణ చర్యలతోపాటు ఆయా కార్యక్రమాలను మానిటరింగ్ చేయడానికి సంబంధిత డిప్యూటీ, జోనల్ కమిషనర్లు విధిగా పర్యటించాలని కోరారు.జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ , అంటు వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు, డెంగీ, మలేరియా కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫాగింగ్, స్ప్రేయింగ్ చేపట్టడం, తిరిగి రాకుండా దీర్ఘకాలిక చర్యలను చేపట్టడం అనే త్రిముఖవ్యూహాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ రూపొందించిన కరపత్రాన్ని మంత్రులు ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment