
ఈమధ్య ఎవరికైనా జ్వరం వస్తే వైరల్ ఫీవరని హాస్పిటల్లో అడ్మిట్ చేసి, ప్లేట్‌లెట్స్ ఎక్కించేస్తున్నారు. అసలిది ఎంతవరకు కరెక్ట్ అనే అనుమానం ప్రజల్లో ఉంటోంది. అసలు ప్లేట్‌లెట్స్ ఎవరికి ఎక్కించాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కించాలి? వివరంగా చెప్పండి.
శరీరంలో ప్లేట్‌లెట్లు ఏమాత్రం తగ్గినా వెంటనే ప్లేట్‌లెట్లు ఎక్కించాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అది సరికాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాల ప్రకారం ప్లేట్‌లెట్ల సంఖ్య పదివేల కంటే తగ్గితేగానీ వాటిని ఎక్కించకూడదు. ఒకవేళ పదివేల కన్నా ఎక్కువగా ఉండి రక్తస్రావం అవుతుంటే మాత్రం ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. శరీరానికి సహజంగానే తగ్గిపోయిన ప్లేట్‌లెట్స్‌ను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తి ఉంటుంది. అందుకే అత్యవసర సమయాల్లో మాత్రమే ప్లేట్‌లెట్స్ ఎక్కించాలి.
సరైన వ్యాధి నిర్ధారణ అవసరం
శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య ఎందుకు తగ్గుతుందనే అంశంపై సరైన వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స సులువవుతుంది. డెంగ్యూ కారణంగా కొందరిలో ప్లేట్‌లెట్ల సంఖ్య చాలా వేగంగా పడిపోతూ ఉంటుంది. వీరికి డెంగ్యూ చికిత్సతో పాటు అవసరాన్ని బట్టి ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతే వారం పదిరోజుల్లో ఆ పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. మలేరియా కారణంగా ప్లేట్‌లెట్లు పడిపోతే మలేరియాకే చికిత్స అందించాలి. ఏవైనా మందుల కారణంగా ప్లేట్‌లెట్లు పడిపోతూ ఉంటే వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, ఆ మందులు మానేయాల్సి ఉంటుంది. ముందు ప్లేట్‌లెట్లు పడిపోవడానికి సరైన కారణం తెలుసుకుని చికిత్స చేయించుకోవాలి.
అందుబాటులో అత్యాధునిక చికిత్సా విధానాలు
శరీరంలో ఏ కారణంతో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గినా ఇప్పుడు మెరుగైన వైద్యం అందించగలుగుతున్నారు. గతంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గితే రోగులు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉండేది. కానీ అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఇప్పుడు అత్యాధునిక విధానాల్లో చికిత్స అందిస్తుండటం వల్ల చాలామందిని ప్రాణాపాయం నుంచి రక్షించగలుగుతున్నారు. రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గితే దాత నుంచి లేదా సేకరించిన రక్తం నుంచి కేవలం ప్లేట్‌లెట్లను మాత్రమే వేరుచేసి ఎక్కించే అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్ (ఎస్‌డీపీ), రాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్ (ఆర్‌డీపీ) అనే రెండు పద్ధతులలో రక్తం నుంచి ప్లేట్‌లెట్లను వేరు చేసి, అవసరమైన వారికి ఎక్కిస్తున్నారు. ఎస్‌డీపీ విధానంలో దానుంచి నేరుగా ప్లేట్‌లెట్లను సేకరిస్తారు. ఆర్‌డీపీ విధానంలో సేకరించిన రక్తం నుంచి ప్లేట్‌లెట్లను వేరుచేస్తారు. అయితే ఎస్‌డీపీ విధానంలో ఒకసారికి 50 వేల నుంచి 60 వేల వరకు ప్లేట్‌లెట్లను సేకరించే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment