ప్లేట్‌లెట్స్‌  అంటే ఏమిటి?  ఎందుకు తగ్గుతాయి? | What is platelet Why is it reduced | Sakshi
Sakshi News home page

ప్లేట్‌లెట్స్‌  అంటే ఏమిటి?  ఎందుకు తగ్గుతాయి?

Published Mon, Dec 17 2018 12:57 AM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM

What is platelet Why is it reduced - Sakshi

మా అబ్బాయి వయసు తొమ్మిదేళ్లు. ఈమధ్య వైరల్‌ ఫీవర్‌తో చాలా ఇబ్బంది పడ్డాడు. ప్లేట్‌లెట్స్‌ తగ్గాయన్నారు. హైదరాబాద్‌ తీసుకుపోయి ప్లేట్‌లెట్స్‌ ఎక్కించి వైద్యం చేసిన నాలుగైదు రోజులకు ఆరోగ్యం మెరుగుపడింది. అసలీ ప్లేట్‌లెట్స్‌ అంటే ఏమిటి? అవెందుకు తగ్గుతాయి? ప్లేట్‌లెట్స్‌ తగ్గినట్లు ఎలా తెలుస్తుంది? దయచేసి వివరంగా తెలియజేయండి. 

రక్తకణాల్లో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌ అని ప్రధానంగా మూడు రకాల కణాలు ఉంటాయి. ఈ మూడూ ఎముక మజ్జ (బోన్‌మారో) నుంచి ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తూ, శరీరం రోగాలమయం కాకుండా కాపాడుతుంటాయి. ఎర్రరక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్‌ ద్వారా శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సిజన్‌ అందుతుంది. ఇక మిగిలినవి ప్లేట్‌లెట్స్‌. శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి అవి తోడ్పడతాయి. ఇవి ప్రతి వ్యక్తిలోనూ ఒకే విధంగా ఉండాలని లేదు. సాధారణంగా ఒక వ్యక్తిలో ఇవి 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటాయి. పైగా ఇవి ఒక్కోరోజు ఒక్కోలా ఉండవచ్చు. ప్లేట్‌లెట్‌ కణం జీవిత కాలం ఏడు నుంచి పదిరోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత అవి చనిపోతాయి. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్‌లెట్స్‌ మళ్లీ రక్తంలో చేరతాయి.

ప్లేట్‌లెట్స్‌ విధుల్లో ముఖ్యమైనది రక్తస్రావాన్ని నివారించడం. శరీరానికి గాయమైనపుపడు కాసేపు రక్తం స్రవిస్తుంది. ఆ తర్వాత దానంతట అదే ఆగిపోతుంది. ఈ ప్రక్రియ వెనక రక్తనాళం, ప్లేట్‌లెట్లు, రక్తం గడ్డకట్టే వ్యవస్థల పాత్ర చాలా కీలకమైనది. ఇలా రక్తాన్ని గడ్డకట్టించడం ద్వారా ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలే ప్లేట్‌లెట్స్‌. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ తదితర కారణాల వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గుతాయి. దాంతోపాటు కొంతమందిలో ప్లేట్‌లెట్ల ఉత్పత్తి తక్కువగా ఉండటానికి కారణం వారిలో పుట్టుకతో ఉండే లోపాలే. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది.

గుండెసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు రక్తం పలుచబడటానికి వాడే మందుల వల్ల కొందరిలో ప్లేట్‌లెట్ల సంఖ్య, నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంది. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ మరీ తక్కువగా ఉన్నప్పుడు ఏ గాయమూ లేకపోయినా రక్తస్రావం అవుతుంది. ప్లేట్‌లెట్లు తమ విధిని సక్రమంగా నిర్వర్తించలేకపోతే రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం గానీ, ప్లేట్‌లెట్ల నాణ్యత తగ్గిపోవడంగానీ కారణం కావచ్చు. ప్లేట్‌లెట్ల సంఖ్య  సాధారణంగానే ఉన్నా అవి నాణ్యంగా లేకపోతే రక్తస్రావం ఆగదు. 

ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గితే కనిపించే లక్షణాలు 
సాధారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పదివేలకు తగ్గేవరకు ఏలాంటి లక్షణాలూ కనిపించవు. ఒకవేళ అంతకన్నా తగ్గితే మాత్రం శరీరంలోని వివిధ అవయవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవుతుంది. నోటి లోపలి పొర, చిగుర్లు, ముక్కు లోపలి పొరల్లోంచి రక్తస్రావం కావచ్చు. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిన ప్రతిఒక్కరిలోనూ అనారోగ్య లక్షణాలు కనిపించాలని లేదు. కొందరిలో ఏ లక్షణాలూ కనిపించవు. ముఖ్యంగా డెంగ్యూ ఉన్నప్పుడు తీవ్ర జ్వరం ఉంటుంది. వ్యాధి లక్షణాలన్నీ ఉంటాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటాయి. అలాంటప్పుడు ప్లేట్‌లెట్ల సంఖ్య ఎంత ఉందో పరీక్షించి, వైద్యపరంగా తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement