డెంగీ డేంజర్‌ | dengue Fever in Tribal Areas East Godavari | Sakshi
Sakshi News home page

డెంగీ డేంజర్‌

Published Thu, Aug 16 2018 3:03 PM | Last Updated on Thu, Aug 16 2018 3:03 PM

dengue Fever in Tribal Areas East Godavari - Sakshi

రేఖపల్లి పీహెచ్‌లో చికిత్స కోసం వచ్చిన పేషంట్లు

వీఆర్‌పురం (రంపచోడవరం): వీఆర్‌పురం మండలంలో డెంగీ జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒకే రోజున ఓ అంగన్‌వాడీ కార్యకర్తతో పాటు మరో వృద్ధురాలు డెంగీ లక్షణాలతో మృతి చెందడంతో జ్వరం బారిన పడిన ప్రతిఒక్కరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కాలు బయటకు మోపలేని పరిస్థితి ఉంటే, మరోపక్క డెంగీ జ్వరాలు వెంటాడడం, ఆ లక్షణాలతో ఇద్దరు మృత్యువాత పడడంతో జ్వర బాధితుల్లో ఆందోళన నెలకొంది. వడ్డిగూడెం, వీఆర్‌పురంలోని రామాలయం వీధి, బీసీ కాలనీ, రేఖపల్లి ఎస్సీ కాలనీ, గొల్లగూడెం, సీతంపేట తదితర గ్రామాల్లోని ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచాన పడిన పరిస్థితులు నెలకొన్నాయి. వారిలో కొంతమంది రక్తపరీక్షలు చేయించుకోగా డెంగీ పాజిటివ్‌ అని తేలడంతో వారందరూ తెలంగాణ రాష్ట్రం భద్రాచలం వెళ్లి ప్రైవేట్‌ వైద్యం చేయించుకొని ప్రాణాలు దక్కించుకునేప్రయత్నాలు చేస్తున్నారు.

డెంగీ లక్షణాలతో ఇద్దరి మృతి
రేఖపల్లి గొల్లగూడేనికి చెందిన కుంజా అక్కమ్మ(45) స్థానికంగా  అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఆమె నాలుగు రోజుల క్రితం జ్వరం బారిన పడడంతో రేఖపల్లి పీహెచ్‌సీలో చికిత్స పొందింది. జ్వరం నయం కాకపోవడంతో సోమవారం ఆమెకు డెంగీ పరీక్ష చేయించారు. డెంగీ(రియాక్టివ్‌) లక్షణాలు తీవ్ర స్థితిలో ఉన్నట్టు తేలడం, మంగళవారం సాయంత్రం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆమె మృతిచెందింది. అలాగే ఉమ్మిడివరం గ్రామానికి చెందిన కుర్సం సీతమ్మ(60) కూడా డెంగీ బారినపడి  భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. అదే లక్షణాలతో సీతమ్మ మనుమరాలు చిచ్చడి సంజీత కూడా భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు.

క్షీణిస్తున్న రక్తకణాలు
వీఆర్‌పురం గ్రామానికి చెందిన ముత్యాల నందినీ అనే మహిళకు డెంగీ లక్షణాలు లేకున్నా తెల్ల రక్తణాల సంఖ్య 45 వేలకు పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు స్పందించి గ్రామాల్లో హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేసి మా ప్రాణాలను రక్షించాలని ప్రజలు వేడుకొంటున్నారు.

జ్వరం వస్తే అశ్రద్ధ చూపవద్దు
ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఎవరైనా జ్వరం బారిన పడితే  అశ్రద్ధ చూపకుండా పీహెచ్‌సీకి వచ్చి చికిత్స చేయించుకోవాలి. మండలంలో డెంగీ పాజిటివ్‌ కేసులతో పాటు రియాక్టివ్‌ కేసులు కూడా నమోదయ్యాయి. పరిసరాల పరిశుభ్రత పాటించి, దోమతెరలు వాడితే డెంగీ దోమల నుంచి రక్షణ పొందగలుగుతారు. అలాగే డెంగీ కేసులు నమోదైన గ్రామాల్లో వైద్య సిబ్బందితో డోర్‌ టూ డోర్‌ సర్వే చేయించాం. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.– ఎం.సుందర్‌ప్రసాద్,రేఖపల్లి పీహెచ్‌సీ మెడికలాఫీసర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement