వరుసగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వైరల్ జ్వరాలతోపాటు డెంగ్యూ జ్వరం భయపెడుతండటంతో ప్రజలు ఆందోలన చెందుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లక్షణాలతో జ్వరాలు వస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి.
ఢిల్లీని వణికిస్తున్న డెంగ్యూ
దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్సీర్ పరిధిలో ఇటీవల వచ్చిన వర్షాలు, వరదలతో ఢిల్లీలో డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూలై 22 వరకు ఢిల్లీలో మొత్తం 187 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2018 నుంచి పోలిస్తే ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే అత్యధికం. కేవలం జూలై మొదటి మూడు వారాల్లో డెంగ్యూ కేసులు దాదాపు 65 నమోదయ్యాయి. జూన్‌లో 40, మేలో 23 వెలుగు చూశాయి. వీటికి తోడు 61 మలేరియా కేసులు నమోదయ్యాయ్యాయి.
సీఎం సమీక్ష
ఈ నేపథ్యంలో ఢిల్లీలో డెంగ్యూ పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సచివాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరాన్ని పట్టి పీడిస్తున్న డెంగ్యూ కేసులను ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్, మేయర్ షెల్లీ ఒబెరాయ్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.
అధికారులకు కేజీవ్రాల్ ఆదేశాలు
అనంతరం ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 20 డెంగ్యూ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. వాటిలో 19 నమూనాలలో టైప్-2 తీవ్రమైన స్ట్రెయిన్ ఉన్నట్లు తేలినట్లు చెప్పారు. డెంగ్యూ రోగులకు ఆసుపత్రుల్లో పడకలు రిజర్వ్ చేయాలని, ఆసుపత్రులు ‘మొహల్లా’ క్లినిక్‌లలో తగినన్ని మందుల నిల్వ ఉండేలా చూడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు భరద్వాజ్ తెలిపారు.
జరిమానా పెంపు
ఇంటి చుట్టుపక్కలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ఉండటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో దోమలువృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్న ఆయన.. ఈ కారణంగానే దేశ రాజధానిలో పరిస్థితి తీవ్రతరంగా మారినట్లు తెలిపారు. ఈ క్రమంలో డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా దోమల ఉత్పత్తికి అవకాశమిచ్చే ఇళ్లకు రూ. 1000, వాణిజ్య సంస్థలకు రూ. 5000కు జరిమానాను పెంచుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment