కోరలు చాస్తున్న డెంగీ
► 15 రోజుల వ్యవధిలో 20 మంది మృత్యువాత
► డెంగీతో విలవిల్లాడుతున్న రాచనగరి
► జిల్లా వ్యాప్తంగా 71 కేసుల నమోదు
► ఒక్క మైసూరులోనే 45
మైసూరు: దేశంలో స్వచ్ఛమైన నగరాల జాబితాలో రెండుసార్లు మొదటిస్థానంలో నిలిచిన మైసూరు నగరం ప్రస్తుతం డెంగీ మహమ్మారితో వణుకుతోంది. మైసూరు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా డెంగీ తదితర విష జ్వరాలతో విలవిల్లాడుతున్నాయి. మైసూరు నగరంతో పాటు నంజనగూడు, పిరియాపట్టణ ప్రాంతాల్లో గత 15 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులతో పాటు 20 మందికి పైగా డెంగీ బారిన పడి మృత్యువాత పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 71 డెంగీ కేసులు నమోదవగా అందులో మైసూరు నగరంలోనే 45 కేసులు నమోదయ్యాయి.
దీంతో అప్రమత్తమైన నగర పాలికె డెంగీ అపరిశుభ్రత తాండవిస్తున్న ప్రాంతాల్లో ఫాగింగ్ తదితర నివారణ చర్యలను ముమ్మరం చేసింది. డెంగీ నివారణకు పాలికె నివారణ చర్యలు ముమ్మరం చేసినా ప్రజలు మాత్రం ఇళ్లతో పాటు పరిసరాలను స్వచ్ఛంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో డెంగీ జ్వరాన్ని వ్యాపింప చేసే ఈజిప్ట్ ఈడీస్ దోమల వృద్ధిని అడ్డుకోవడం కష్టసాధ్యమవుతోంది. ఇళ్లల్లోని నీటితొట్లు, ట్యాంకులను ఎప్పటికప్పడు శుభ్రం చేయకపోవడం ఒక కారణం కాగా నగర వ్యాప్తంగా ఉన్న పార్కులు, పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రజలు ప్లాస్టిక్ బాటిళ్లు, పేపర్‌ప్లేట్లను ఎక్కడపడితే అక్కడే పారేస్తుండటంతో ప్రతిరోజు నగరంలో 450 టన్నుల చెత్త వెలువడుతోంది.
అందులో 250 టన్నుల చెత్తను మాత్రమే సంస్కరణ చేస్తున్న పాలికె మిగిలిన 200 టన్నుల చెత్తను అలానే వదిలేస్తుండటంతో డెంగీని వ్యాపింపచేసే దోమలు రాజ్యమేలుతున్నాయి. ఇక నగరంతో పాటు నగర శివార్లలో ఉన్న మొత్తం 48 చెరువులు చెత్త, వ్యర్థాలు కలవడం కూడా ఈజిప్ట్ ఈడీస్ దోమల వృద్ధికి కారణమవుతున్నాయి. ఈ పరిణామాలకు తోడు తొలకరి వర్షాలు కూడా ప్రారంభమవడంతో వాతావరణం చల్లగా మారడంతో డెంగీ దోమలు మరింత విజృంభించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి.
మొక్కలు పెంచడం ద్వారా దోమలకు చెక్...
డెంగ్యూ జ్వరాన్ని వ్యాపింప చేసే ఈజిప్ట్ ఈడీస్ దోమలను లెమన్‌బ్లామ్, మారీగోల్డ్, కాట్నిప్, సిత్రోనెల్లా గ్రాస్, బిసిల్, రోజ్‌మేరి, థేమి, యూకలిప్టస్, ల్యావెండర్, పెప్పర్‌మింట్, గార్లిక్, టీట్రీ, గెరానియ్‌మ్,లెంటాన,లెమన్‌గ్రాస్ మొక్కలు పెంచడం ద్వారా దోమలను నివారించవచ్చు.
చేపల ద్వారా కూడా దోమలకు చెక్....
మురికినీరు,గుంతలు, నీటితొట్లతో పాటు మంచినీటిలో కూడా ఈజిప్ట్ ఈడీస్ దోమలకు సంతానోత్పత్తి వృద్ధి చేసే సామర్థ్యం ఉండడంతో పాలికె ఫాగింగ్ ద్వారా దోమలను నివారిస్తోంది. అయితే ఫాగింగ్ వల్ల దోమలు మాత్రమే నాశనమవుతున్నా గుడ్లుపై మాత్రం ఫాగింగ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండడంతో డెంగీ దోమల నిర్మూలన అసాధ్యమవుతోంది. అయితే గప్పి రకం చేపలను పెంచడం ద్వారా ఈజిప్ట్ ఈడీస్ దోమల నిర్మూలన సాధ్యమవుతుందని తేలడంతో నీటితొట్లు, నిల్వనీటిలో గప్పి చేపలను పెంచాలంటూ ఆరోగ్యశాఖ ప్రజలకు సూచిస్తోంది. –డీ.రందీప్,జిల్లా కలెక్టర్
‘ఈ ఏడాది జవనరి నుంచి మే వరకు జిల్లా వ్యాప్తంగా 459 మందికి డెంగ్యూ పరీక్షలను నిర్వహించగా 71 మందికి డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అయింది.దీంతో డెంగ్యూ జ్వరం మరింత విజృంభించకుండా జిల్లా ఆరోగ్యశాఖ,గ్రా.పం.సభ్యులు.స్వయం సేవా సంఘాల కార్యకర్తలు డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు’. –ఎస్.చిదంబర, సాంక్రమిక రోగాల నియంత్రణాధికారి.