- ఇంట్లోకి అనుమతించని యజమాని
- శవంతో ఆరుబయటే వర్షంలో తడిసిన కుటుంబీకులు
సాక్షి, హైదరాబాద్ : డెంగీతో ఓ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. శవాన్ని ఇంట్లోకి తెచ్చేందుకు ఇంటి యజమాని అంగీకరించలేదు. దీంతో ఆ కుటుంబం శవంతో రోడ్డుపైన వానలో తడుస్తూ రోదించడం పలు వురిని కలచివేసింది. జగద్గిరిగుట్టలోని వెంకటేశ్వరనగర్ లో నివసించే ఈశ్వరమ్మకు ఇద్దరు కుమారులు. జగదీశ్ గుప్తా అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటోంది. రెండేళ్ల క్రితం భర్త ఆంజనేయులు కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.
పెద్ద కుమారుడు సురేశ్‌కుమార్ (11)కు ఇటీవల డెంగీ జ్వరం రావడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ సురేశ్ బుధవారం రాత్రి మృతిచెందాడు. కాగా, బాలుడి శవాన్ని ఇంట్లోకి తెచ్చేందుకు జగదీశ్ ఒప్పుకోలేదు. దీంతో వర్షంలో తడుస్తూ తెల్లవారే వరకూ శవంతో రోడ్డుపైనే ఉన్నారు. కనీస కనికరం చూపని ఇంటి యజమాని తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు స్పందించి బాలుడి అంత్యక్రియలకు కావాల్సిన ఆర్థిక సాయం అందించి ఈశ్వరమ్మకు తోడ్పడ్డారు.
డెంగీతో బాలుడి మృతి..
Published Fri, Sep 15 2017 3:06 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement