
సాక్షి, హైదరాబాద్: దోమల నివారణ కోసం ఇళ్లలో ఫాగింగ్ చేసేందుకు అనుమతించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలను కోరారు. ఫాగింగ్ చేసేందుకు కొంతమంది అనుమతించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, డెంగ్యూ ప్రబలుతున్న నేపథ్యంలో ఫాగింగ్‌కు సిబ్బందిని అనుమతించా లని కోరారు. వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, ఆస్పత్రుల్లో అందుతున్న సేవలపై ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఇళ్లలో ఫాగింగ్‌కు జీహెచ్‌ఎంసీ సిబ్బందిని ప్రజలు అనుమతించడం లేదని, దీంతో ఇంటి లోపలి దోమలు అలాగే ఉండిపోతున్నాయన్నారు. ప్రభు త్వ చర్యలతో ప్రస్తుతం వైరల్ ఫీవర్లు కొంత తగ్గుముఖం పట్టాయని తెలిపారు. చెప్పేంత వరకు సాయంత్రం ఓపీ సేవలు నిలిపేయొద్దని, మెడికల్ క్యాంపులు కొనసాగించాలన్నారు. జ్వరాల తీవ్రత పూర్తిగా తగ్గే వరకూ సెలవుల రద్దు కొనసాగుతుందన్నారు. డాక్టర్లు, సిబ్బందితో పాటు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు.