ఆరోగ్య మంత్రి గారూ... ఇటు చూడండి! | People Suffering Fevers In Karimnagar District | Sakshi
Sakshi News home page

ఆరోగ్య మంత్రి గారూ... ఇటు చూడండి!

Published Tue, Sep 17 2019 11:03 AM | Last Updated on Tue, Sep 17 2019 11:04 AM

People Suffering Fevers In Karimnagar District - Sakshi

ఐడీ వార్డులో చికిత్స పొందుతున్న జ్వరం బాధితులు

‘‘నగరంలోని హుస్సేన్‌పురకు చెందిన హలీమాబీ విషజ్వరంతో బాధపడుతూ ఆదివారం ప్రభుత్వాసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే వైద్యులెవరూ పట్టించుకోకపోవడంతో మరణించినట్లు బంధువులు ఆరోపించారు. రాత్రి వేళలో ఒక డాక్టర్‌ కూడా అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేయడం వల్లనే మరణించిందని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ను సంప్రదించగా.. రెండు రోజులుగా వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతోందని, దీంతోపాటు రక్తహీనత(ఎనేమియా)తో ఆదివారం రాత్రి  ఆస్పత్రిలో చేరిందని, ఆస్పత్రిలో చేరేసరికే 50వేల రక్తకణాలు మాత్రమే ఉన్నాయని, మెరుగైన వైద్యం అందించినట్లు తెలిపారు.’’

సాక్షి, కరీంనగర్‌: సాక్షాత్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాను విషజ్వరాలు చుట్టుముట్టాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మృత్యుఘోష వినిపిస్తోంది. ఆస్పత్రిలో ఏ వార్డు వద్ద చూసినా విషజ్వరాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రోగులు, వారి బంధువులు కనిపిస్తున్నారు. ప్రాణాంతకమైన డెంగీతోపాటు మలేరియా, టైఫాయిడ్‌ వంటి విషజ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

ఎక్కువ శాతం రక్తంలో ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గిపోయి మెరుగైన వైద్యం అందక  మరణిస్తున్నారు. ప్రస్తుతం శిశువులు, పిల్లలు, మైనర్లతోపాటు వృద్ధులు ఎక్కువగా విషజ్వరాలతో చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో  చేరుతున్నారు. కాగా మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో డెంగీ కేసుల వివరాలు తెలియజేసేందుకు కూడా వైద్యాధికారులు జంకుతున్నారు. 

ఆస్పత్రిలో ఆగని మరణాలు..
జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో వివిధ రోగాలతో బాధపడుతూ సరైన చికిత్స అందక పేద రోగులు మరణిస్తున్నారు. మే 21న ప్రభుత్వాస్పత్రిలో కోనరావుపేట మండలం మార్దన్నపేట గ్రామానికి చెందిన బాలింత ఊరగంట మానస(22) సరైన చికిత్స అందక వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరణించింది. సాధారణ ప్రసవం కోసం కాలయాపన చేసి చివరి నిమిషంలో ఆపరేషన్‌ చేశారని, తీవ్ర రక్తస్రావం అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మానస మృతిచెందిందని బంధువులు ఆందోళన  చేశారు.

ఆగస్టు 11న తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీ, మహాత్మనగర్‌కు చెందిన కనుమల్ల లావణ్య(22) జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. విషజ్వరంతో బాధపడుతూ ఆగస్టు 9న ఆస్పత్రిలో చేరింది. ఫిమేల్‌వార్డులో రెండు రోజులపాటు చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో ఐసీయులోకి షిఫ్ట్‌ చేశారు. రక్తంలో కణాలు తగ్గిపోయాయని ప్లేట్‌లెట్‌ ఎక్కించారు. అయినా కోలుకోక చికిత్స పొందుతూ 11న మృతిచెందింది. వార్డులో ఉన్నపుడు రెండురోజులపాటు వైద్యులు పట్టించుకోకపోవడంతోనే లావణ్య మరణించిందని భర్త రమేష్‌ బంధువులు ఆందోళన చేశారు. 

ప్లేట్‌లెట్స్‌ కొరతతో రోగులకు ప్రాణసంకటం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆడెపు నిఖిల్‌(16) పిల్లల వార్డులో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. విషజ్వరంతోపాటు లివర్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా రక్తంలో ప్లేట్‌లెట్‌ కౌంట్‌ 7వేలకు తగ్గిపోయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆడెపు లత, సత్యనారాయణ కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడ ఉన్నవారిని కలిచివేసింది. కనీసం పేట్‌లెట్స్‌ ఇవ్వడానికి బంధువులు, దాతలు ఎవరూ ముందుకు రావడం లేదని ప్రభుత్వం ఆదుకొని తమ కొడుకు ప్రాణాలు నిలుపాలని  వేడుకుంటున్నారు.

ఇది ఒక్క నిఖిల్‌ పరిస్థితే కాదు. ఇటీవల మంత్రి ఈటల ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంటలో దార హరికృష్ణ(24) డెంగీ వ్యాధితో మృతిచెందాడు. చాలామంది రోగులు ప్లేట్‌లెట్స్‌ సమకూరక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ప్లేట్‌లెట్‌ కౌంట్‌ కనీసం లక్ష దాటితే తప్ప డెంగీ రోగం నయమయ్యే పరిస్థితి లేదు. దాతలు ఇచ్చే రక్తం నుంచి తెల్లరక్త కణాలను వేరు చేసి, డెంగీ వ్యాధిగ్రస్తులకు ఎక్కించాల్సి ఉంటుంది. జిల్లాలో రక్తదాతలు ముందుకు రాకపోవడం, వైద్యాధికారులు ప్రత్యామ్యాయ చర్యలు తీసుకోకపోవడంతో రోగుల పరిస్థితి విషమంగా మారుతోంది.

డెంగీ కేసులు ఇలా..
జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో 2019 ఏప్రిల్‌లో 116 డెంగీ కేసులు నిర్ధారణ కాగా మేలో 153 కేసులు, జూన్‌లో 91, జూలైలో 112, ఆగస్టులో 61, సెప్టెంబర్‌లో ఇప్పటికే 30మందికి డెంగీ నిర్ధారణ అయింది. డీఎంహెచ్‌ఓ పరిధిలో మాత్రం సెప్టెంబర్‌లో 21 కేసులు మాత్రమే నమోదు అయినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. డీఎంహెచ్‌ఓ పరిధిలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 72కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో మలేరియా విజృంభించినప్పటికీ, ఇప్పటి వరకు 4కేసులు మాత్రమే నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో జ్వరపీడితుల్లో అధికసంఖ్యలో డెంగీతో బాధపడుతుండగా, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం తక్కువ సంఖ్యలో డెంగీ బారిన పడుతున్నట్లు చూపుతుండడం గమనార్హం. 

ప్రభుత్వాస్పత్రిలో అదనపు పడకలు....
500 పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో 150 పడకలు మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి కేటాయించారు. మిగతా 350పడకలతో మిగతా వార్డుల్లో రోగులకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం రోగుల సంఖ్య తీవ్రంగా పెరుగుతుండడంతో ఆస్పత్రి  వరండాలో అదనపు పడకలు వేసి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే 100కుపైగా అదనపు పడకలు సమకూర్చినట్లు వైద్యాధికారులు తెలుపుతున్నారు. వరండాల్లోనే వైద్య సేవలు అందిస్తుండడంతో చలిగాలులు, దోమల బెడదతో కనుకు తీయలేని పరిస్థితి ఉందని రోగులు వాపోతున్నారు. ప్రతిరోజు ఆస్పత్రిలో 600 వరకు ఓపీ జరుగుతుండగా 100మందికి పైగా ఇన్‌పేషెంట్లుగా ఆస్పత్రిలో చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement