డెంగీ, మలేరియాపై విస్తృత ప్రచారం
జిల్లా కలెక్టర్ ఆదేశం
కాకినాడ వైద్యం : డెంగీ, మలేరియాపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, నిల్వనీటిలో దోమలు ఉంటాయన్నారు. దోమల కారణంగానే డెంగీ సంభవిస్తుందన్నారు. గతేడాది జిల్లాలో 336 డెంగీ కేసులు నమోదు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వ్యాధి నివారణ కోసం వర్షాలు పడక ముందే జూన్ నెలలో గ్రామాల్లో సర్వే చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. దోమల నిర్మూలన కోసం డ్రైనేజీలు, నిల్వనీటి ఆవాసాలపై యాంటీలార్వా స్ప్రే చేయించాలన్నారు. డెంగీ నివారణ కోసం పైరీత్రమ్ మందు చల్లడం, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. గ్రామసభల్లో డెంగీ, మలేరియాపై అవగాహన కల్పించాలని డీపీఓను ఆదేశించారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మహిళా శక్తి సంఘ సభ్యులు, పింఛన్‌దారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కాకినాడ ,రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రులలో డెంగీ మందులు, ప్లేట్‌లెట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కో–ఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కిషోర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్రయ్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, జిల్లా మలేరియా అధికారి పీఎస్‌ఎన్ ప్రసాద్, జెడ్పీ సీఈవో పద్మ, డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు పాల్గొన్నారు.
‘గుడా’ కార్యకలాపాలు ప్రారంభించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గోదావరి అర్భన్ డెవలెప్‌మెంట్ అథారిటీ (గుడా) కార్యకలాపాలను వెంటనే ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టుహాల్‌లో మంగళవారం గుడా తొలి కార్యవర్గ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 15 రోజుల్లో కాకినాడ మున్సిపల్ కార్యాలయంలో గుడా తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని కమిషనర్ అలీంబాషాను ఆదేశించారు. కాకినాడలో 15 రోజుల్లో రెగ్యులర్ కార్యాలయం ఏర్పాటుకు చేయాలని గుడా వైస్ చైర్మన్‌ను కోరారు. ఈ నెల 24 నుంచి గుడా కార్యకలాపాలు ప్రారంభమతున్న నేపథ్యంలో 22 నాటికే గుడా పరిధిలోని 240 పంచాయతీ కార్యదర్శులు, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం మున్సిపల్ అధికారులు, గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్లకు అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో 300 చదరపు మీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వెయ్యి చదరపు మీటర్లు పైబడిన విస్తీర్ణంలోని స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకు గుడా అనుమతి అవసరమన్నారు. గుడా నిర్వహణకు సర్వే, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఆడిట్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల నుంచి కొంతమంది సిబ్బందిని అదనపు బాధ్యతలపై నియమించాలన్నారు. గుడా వైస్ చైర్మన్ వి.విజయరామరాజు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, డీపీఓ టీబీఎస్‌జీ కుమార్, అర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఎస్‌ఎన్‌మూర్తి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రత్నకుమార్ పాల్గొన్నారు.