మంచిర్యాల జిల్లాలో డెంగీ కాటుకు బలవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్యశాఖ వైఫల్యం, పారిశుధ్యం మెరుగుపరచడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం సాక్షిగా డెంగీ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే 15 మంది డెంగీ కారణంగా మృత్యువాత పడినా.. ఒక్కరే మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. కేవలం వారం వ్యవధిలోనే 17 మందికి డెంగీ సోకినట్లు అధికారిక వర్గాలే వెల్లడించడం జిల్లాలో పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది.
సాక్షి, మంచిర్యాల:
జిల్లాలో డెంగీతో మృత్యువాత పడ్డ వారి వివరాలు (అనధికారికంగా) :
- జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన గుడిమల్ల రాజగట్టు(30), అతని భార్య సోనీ (28), కూతురు శ్రీవర్షిణి (6), తాత ఈదా లింగయ్య (80) మృతి. (ఇందులో సోనీ డెంగీతో మృతిచెందినట్లు అధికారికంగా వెల్లడించారు.)
- కాసిపేట మండలానికి చెందిన రాందేవ్ మృతి. (డెంగీ సోకినట్లు కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి నిర్ధరించింది.)
- కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి సౌందర్య(19).
- కాసిపేట మండలం సోమగూడెంకు చెందిన దుగుట పోశం (64).
- కాసిపేట మండలం కోమటిచేనుకు చెందిన జాడి మల్లయ్య (53).
- కాసిపేట మండలం రేగులగూడకు చెందిన నవీన్ (20).
- క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీజోన్ రాంనగర్‌కు చెందిన యువతి కల్వల స్నేహా (23).
- తాండూర్ మండలం రేచినికి చెందిన గొర్రెల కాపరి గుడిముర్కి తిరుపతి (37) తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ మృతి.
- భీమారం మండలం కొత్తపల్లి›గ్రామానికి చెందిన ఆకుల రాజశ్రీ (19) డెంగీ జ్వరంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి.
- జన్నారం మండలం మొర్రిగూడకు చెందిన కామెర పోశం.
- జన్నారం మండలం దేవునిగూడకు చెందిన అనిల్‌రావు.
- బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామానికి చెందిన దుగుట లక్ష్మి.
- నెన్నెల మండల కేంద్రానికి చెందిన జంపాల రాజేశ్వరి.
వారం రోజుల్లోనే 17 మందికి డెంగీ
వరుసగా వర్షాలు కురుస్తుండడం.. పారిశుధ్య లోపం.. డెంగీ జ్వరాలపై అవగాహన కల్పించకపోవడంతో జిల్లాలో డెంగీ విజృంభణ కొనసాగుతోంది. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని శ్రీశ్రీనగర్ కాలనీకి చెందిన నలుగురు కుటుంబసభ్యులను డెంగీ బలి తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. డెంగీ జ్వరాలు జిల్లాలో ప్రమాదకరంగా మారినా యంత్రాంగం మాత్రం తమ నిద్రమత్తును వదలడం లేదు. అవి డెంగీ మరణాలు కావంటూ కొట్టిపారేస్తూ.. మరణాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నానికే ప్రాధాన్యతనిస్తున్నారు. కాని పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, ప్రమాదకర డెంగీ జ్వరంపై అవగాహన కల్పించడాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రోజురోజుకూ డెంగీ జ్వరపీడితుల సంఖ్య పెరిగిపోతోంది. అధికారిక లెక్కల ప్రకారమే డెంగీ నిర్ధారణ కేసులు కేవలం వారం వ్యవధిలో 17 కేసులు పెరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. అక్టోబర్ 29వరకు జిల్లావ్యాప్తంగా 67 మందికి డెంగీ సోకినట్లు అధికారికంగా వెల్లడించారు. మంగళవారం నాటికి ఆ సంఖ్య 84కు చేరుకుంది. అంటే కేవలం వారం రోజుల్లోనే 17 మందికి డెంగీ సోకినట్లయ్యింది.
15 మంది మృత్యువాత
జిల్లాలో డెంగీ మరణాలు ఆగడం లేదు. డెంగీ జ్వరాలతో మంచిర్యాలలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మరణం తరువాత కూడా డెంగీ మరణాలు కొనసాగుతుండడం ఆందోళనకరంగా మారింది. ఇప్పటివరకు మంచిర్యాలలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, కాసిపేట మండలంలో ఐదుగురు, ఇతర మండలాల్లో కలిపి మొత్తం 15 మంది డెంగీతో మరణించినట్లు ఆయా కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే వీరంతా సాధారణ జ్వరాలు, ఇతరత్రా వ్యాధుల కారణంగానే మరణించినట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. కేవలం మంచిర్యాలకు చెందిన సోనీ మాత్రమే డెంగీతో మృతి చెందినట్లు చెబుతున్నారు.
నివారణ చర్యలేవి..?
జిల్లాలో ఓ వైపు డెంగీ జ్వరాలు విజృంభిస్తుంటే మరోవైపు నివారణ చర్యలు నామమాత్రంగా మారాయి. 15 మంది మృత్యువాత పడినా.. వందలాది మందికి డెంగీ ప్రబలుతున్నా.. సంబంధిత అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఎంతసేపూ.. అవి డెంగీ మరణాలు కావని చెప్పడానికే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే.. ఏ జ్వరమైనా ప్రాణాలు పోవడం నిజమనే విషయాన్ని మాత్రం మరచిపోతున్నారు. పైగా 84 మందికి డెంగీ పాజిటివ్ వచ్చినట్లు అధికారులే వెల్లడించినా.. డెంగీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు పెద్దగా కనిపించడం లేదు. మంచిర్యాలలో నలుగురు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో ఆ కాలనీలో కాస్త హడావుడి చేశారు. ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారు. జిల్లా కేంద్రంలోనే పారిశుధ్యం అధ్వానంగా మారింది. దోమల నివారణకు మందు పిచికారీ చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా మార్చడం, నీటి నిలువను లేకుండా చేయడంవంటి చర్యలు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. పైగా డెంగీ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment