విష జ్వరాలు.. | People Face Problems With Toxic fever In Mancherial District | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 26 2018 3:36 PM | Last Updated on Fri, Oct 26 2018 3:36 PM

People Face Problems With Toxic fever In Mancherial District - Sakshi

జ్వరంతో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

సాక్షి, మంచిర్యాలటౌన్‌: జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణం, పల్లె తేడా లేకుండా డెంగీ, టైఫాయిడ్, మలేరియాతోపాటు వైరల్‌ ఫీవర్‌లతో బాధపడుతున్నారు. మంచిర్యాలలోని ప్రభుత్వాసుపత్రికి నిత్యం 300 వరకూ ఓపీలు వస్తుండడం జ్వరం తీవ్రతకు అద్దం పడుతోంది. గత పదిహేను రోజుల నుంచి ఆ సంఖ్య 550 వరకూ పెరిగింది. ప్రైవేట్‌ ఆసుపత్రులైతే రోగులతో కిటకిటలాడుతున్నాయి. పారిశుధ్యలోపం, దోమలు జ్వరాలకు ప్రధాన కారణం కాగా, వాతావరణంలో వస్తున్న మార్పులతో వైరల్‌ ఫీవర్‌ ఇంట్లోని వారందరినీ చుట్టుముడుతోంది.  ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. కాళ్లు కదలడం లేదని, చేతులు వణుకుతున్నాయని, కీళ్లలో ఒక్కటే నొప్పిగా ఉందని, ఒళ్లంతా సలుపుతుందని, ఇలా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా చాలా మంది మంచాన పడుతున్నారు. ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. ఇటీవల డెంగీతో జిల్లాలో పది మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో మరింత భయంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు రోగులు ఉరుకులు పెడుతున్నారు. గడిచిన పదేళ్లలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని స్వయంగా వైద్యులే చెబుతున్నారు. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే చాలు ఆ వైరల్‌ జ్వరాలు మెల్లగా మిగిలిన కుటుంబ సభ్యులకు సోకుతున్నాయి. కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు మాత్రం రక్తపరీక్షల్లో రక్తకణాలు తగ్గాయని, డెంగీ వ్యాధిగా నిర్ధారణ చేయడంతో మరింత భయానికి రోగులు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో డెంగీ నిర్ధారణలో కొన్ని పాజిటివ్‌ కేసులు ఉన్నా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్లడ్‌బ్యాంకులోనే రక్తకణాలు తగ్గిన వారి రక్తపరీక్షలు మరోసారి చేసిన తర్వాతే నిర్ధారిస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఇటీవల 172 మందికి పరీక్ష చేయగా 46 మందికి డెంగీ వ్యాధి ఉన్నట్లుగా గుర్తించారు.

పారిశుధ్యమే సమస్య..
పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఎన్నికల హడావుడిలో అధికారులు బిజీగా ఉండడంతో పల్లెలను అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోనూ సరైన పారిశుధ్య పనులు చేపట్టడం లేదు. దీంతో పట్టణంలోని ప్రజల్లో సగం మంది జ్వరాల బారిన పడ్డారు. దోమలు విజృంభించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడంతో డెంగీ, వైరల్‌ ఫీవలర్లకు కారణమవుతున్నాయి. ప్రతి శుక్రవారం జిల్లాలో డ్రై డేగా పాటించాలని అధికారులు భావించారు. కొద్ది వారాలు చేపట్టినా డ్రై డేను అధికారులు మరిచిపోయారు.
 
ప్రైవేట్‌ బాధుడు..
జ్వరంతో వస్తున్న రోగులను ప్రైవేట్‌ ఆసుపత్రులు ఫీజుల రూపేనా బాధుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందుతుందన్న నమ్మకం లేకపోవడంతో వేలకు వేలు అప్పులు చేసి ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా వైరల్‌ ఫీవర్‌ను సైతం రక్తకణాలు తగ్గిపోయాయని, డెంగీ సోకిందని భయబ్రాంతులకు గురిచేస్తూ, వేలాది రూపాయలను అమాయక ప్రజల నుంచి పిండుతున్నారు.  జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా పట్టించుకుని పారిశుధ్య సమస్య తీర్చాలని, జ్వరాలతో వస్తున్న రోగులకు ఆసుపత్రుల్లో సరైన పరీక్షలు చేయాలని పలువురు కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement