toxic fever
-
యువతికి ఇటీవలే నిశ్చితార్థం.. కన్నీటిసంద్రంలో కుటుంబం
కల్లూరు : భవిష్యత్‌తో ఆ యువతి ఎన్నో కలలు కన్నది. వివాహం నిశ్చయమైన నేపథ్యంలో పెద్దలు త్వరలోనే ముహూర్తం నిర్ణయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంతలోనే మాయదారి విషజ్వరం ఆమెను కబళించింది. వివరాలిలా... కల్లూరు గ్రామపంచాయతీ పరిధి రామానగర్ కాలనీకి చెందిన కుంచాల వీరయ్య కుమార్తె వెంకటేశ్వరమ్మ (20)కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ మేరకు త్వరలోనే ఇరువైపులా పెద్దలు కూర్చుని ముహూర్తం నిర్ణయించాలని భావిస్తున్నారు. ఇంతలోనే వెంకటేశ్వరమ్మ విష జ్వరంబారిన పడగా, కల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా ఆమె సోమవారం మృతి చెందింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. కాగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు పలువురు పరామర్శించారు. చదవండి: కాపురానికి రావడం లేదని సెల్‌టవర్ ఎక్కి భర్త హల్చల్ చదవండి: తీజ్ సంబరాల్లో విషాదం: వ్యక్తి ఆత్మహత్య -
విష జ్వరాలపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ప్రబలుతున్న విష జ్వరాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసేందుకు హార్వర్డ్ యూనివర్సిటీలో సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ను నిర్వహిస్తున్న లక్ష్మీ మిట్టల్ గ్రూపు సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు విష జ్వరాలపై అధ్యయన ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించేందుకు హామీ ఇచ్చింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన హార్వర్డ్ వర్సిటీలోని సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ బీ4 ప్రోగ్రాం మేనేజర్ సవితా జి అనంత్‌కు గిరిజనులకు ప్రబలే విషజ్వరాలపై ఉన్నత విద్యా మండలి ఓ నివేదికను అందజేసింది. వాటిపై పరిశోధన చేసేందుకు సహకారం అందించాలని కోరగా, దానికి ఆమె సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్నత విద్యలో పరిశోధనలను పెంచేందుకు చర్యలు చేపడుతున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి పలు విదేశీ వర్సిటీలు, సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. అందులో భాగంగానే హార్వర్డ్ వర్సిటీకి వెళ్లిన మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ లక్ష్మీ మిట్టల్ గ్రూపు నిర్వíßస్తున్న సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. అలాగే తలసేమియా వ్యాధికి సంబంధించిన పరిశోధనలకు కూడా సహకరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. డిసెంబర్లో ఆ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
‘విష జ్వరాలన్నీ డెంగీ కాదు’
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ప్రతి విష జ్వరం డెంగీ కాదని, ప్రతి జ్వరం మలేరియా కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రకరకాల వైరల్ ఫీవర్స్‌కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు, సెలైన్ బాటిళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మంగళవారం మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులతో కలసి సూర్యాపేటలోని జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవలపై రోగులను ఆరా తీశారు. మెడికల్ కళాశాల భవనా న్ని పరిశీలించారు. విషజ్వరాలపై ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకోవా లని సూచించారు. డాక్టర్లు, సిబ్బంది నెల రోజులు సెలవు పెట్టొద్దని ఆదేశించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఆస్పత్రులకు ఏ లోటు లేకుండా చూస్తామని చెప్పారు. కాగా, నల్లగొండ రహ్మత్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్‌రఫీ కుమార్తె ఆఫీయా మెహ్వీన్ (7) డెంగీ వ్యాధి సోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. -
విష జ్వరాలు..
సాక్షి, మంచిర్యాలటౌన్: జిల్లాలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణం, పల్లె తేడా లేకుండా డెంగీ, టైఫాయిడ్, మలేరియాతోపాటు వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారు. మంచిర్యాలలోని ప్రభుత్వాసుపత్రికి నిత్యం 300 వరకూ ఓపీలు వస్తుండడం జ్వరం తీవ్రతకు అద్దం పడుతోంది. గత పదిహేను రోజుల నుంచి ఆ సంఖ్య 550 వరకూ పెరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులైతే రోగులతో కిటకిటలాడుతున్నాయి. పారిశుధ్యలోపం, దోమలు జ్వరాలకు ప్రధాన కారణం కాగా, వాతావరణంలో వస్తున్న మార్పులతో వైరల్ ఫీవర్ ఇంట్లోని వారందరినీ చుట్టుముడుతోంది. ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. కాళ్లు కదలడం లేదని, చేతులు వణుకుతున్నాయని, కీళ్లలో ఒక్కటే నొప్పిగా ఉందని, ఒళ్లంతా సలుపుతుందని, ఇలా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా చాలా మంది మంచాన పడుతున్నారు. ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. ఇటీవల డెంగీతో జిల్లాలో పది మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో మరింత భయంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులు ఉరుకులు పెడుతున్నారు. గడిచిన పదేళ్లలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని స్వయంగా వైద్యులే చెబుతున్నారు. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే చాలు ఆ వైరల్ జ్వరాలు మెల్లగా మిగిలిన కుటుంబ సభ్యులకు సోకుతున్నాయి. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం రక్తపరీక్షల్లో రక్తకణాలు తగ్గాయని, డెంగీ వ్యాధిగా నిర్ధారణ చేయడంతో మరింత భయానికి రోగులు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో డెంగీ నిర్ధారణలో కొన్ని పాజిటివ్ కేసులు ఉన్నా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్లడ్‌బ్యాంకులోనే రక్తకణాలు తగ్గిన వారి రక్తపరీక్షలు మరోసారి చేసిన తర్వాతే నిర్ధారిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఇటీవల 172 మందికి పరీక్ష చేయగా 46 మందికి డెంగీ వ్యాధి ఉన్నట్లుగా గుర్తించారు. పారిశుధ్యమే సమస్య.. పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఎన్నికల హడావుడిలో అధికారులు బిజీగా ఉండడంతో పల్లెలను అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోనూ సరైన పారిశుధ్య పనులు చేపట్టడం లేదు. దీంతో పట్టణంలోని ప్రజల్లో సగం మంది జ్వరాల బారిన పడ్డారు. దోమలు విజృంభించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడంతో డెంగీ, వైరల్ ఫీవలర్లకు కారణమవుతున్నాయి. ప్రతి శుక్రవారం జిల్లాలో డ్రై డేగా పాటించాలని అధికారులు భావించారు. కొద్ది వారాలు చేపట్టినా డ్రై డేను అధికారులు మరిచిపోయారు. ప్రైవేట్ బాధుడు.. జ్వరంతో వస్తున్న రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు ఫీజుల రూపేనా బాధుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందుతుందన్న నమ్మకం లేకపోవడంతో వేలకు వేలు అప్పులు చేసి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా వైరల్ ఫీవర్‌ను సైతం రక్తకణాలు తగ్గిపోయాయని, డెంగీ సోకిందని భయబ్రాంతులకు గురిచేస్తూ, వేలాది రూపాయలను అమాయక ప్రజల నుంచి పిండుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికైనా పట్టించుకుని పారిశుధ్య సమస్య తీర్చాలని, జ్వరాలతో వస్తున్న రోగులకు ఆసుపత్రుల్లో సరైన పరీక్షలు చేయాలని పలువురు కోరుతున్నారు. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
- గ్రామాల్లో లోపించిన పారిశుద్ధ్యం - పట్టించుకోని అధికారులు, పంచాయతీ సిబ్బంది - జ్వరాలతో అల్లాడుతున్న గ్రామీణులు - మందు బిళ్లలతో సరిపెడుతున్న వైద్యసిబ్బంది - ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్న రోగులు ఎమ్మిగనూరు రూరల్: గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మరీముఖ్యంగా విషజ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. అత్యధిక శాతం గ్రామాల్లో మురుగు కాలువలు లేవు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బురద, మురుగునీరు ఇళ్ల ముందుకు చేరుతోంది. వాటిని దోమలు ఆవాసంగా చేసుకుంటున్నాయి. రాత్రి అయ్యిందంటే చాలు దోమల మోత మోగుతోంది. వాటి కాటు వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరాలతో గ్రామాలకు గ్రామాలే తల్లడిల్లుతున్నా అధికారులకు మాత్రం ఏమీ పట్టడంలేదు. తూతూమంత్రంగా గ్రామాలను సందర్శిస్తూ తమ పని అయిపోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మిగనూరు మండల పరిధిలోని వెంకటగిరి, మసీదపురం, కందనాతి, సోగనూరు, ఎర్రకోట, కడిమెట్ల, ఏనుగుబాల, కడివెళ్లతో పాటు పలు గ్రామాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. వెంకటగిరిలో 100 మంది, ఎర్రకోటలో 100 మంది, మసీదపురంలో 60, మిగిలిన గ్రామాల్లో 10నుంచి 20 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ గ్రామాలకు ప్రభుత్వ వైద్య సిబ్బంది సరిగా రావడం లేదు. ఒకవేళ వచ్చినా మందు బిళ్లలతో సరిపెడుతున్నారు. దీంతో జ్వరాలు తగ్గకపోవడంతో ప్రజలు ప్రైవేటు వైద్యులు, ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఒక్కోసారి ఆర్ఎంపీలను పిలిపించుకొని ఇంటి దగ్గరే సెలైన్ బాటిల్స్ పెట్టించుకుంటున్నారు. ఎమ్మిగనూరులో 50 పడకల ఆస్పత్రి, హాలహార్విలో పీహెచ్సీ ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల ఎర్రకోటలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి జ్వరాల ప్రభావం ఉన్న కాలనీలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి..జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. అయినా ఇంతవరకు అతీగతీ లేదు. లోపిస్తున్న పారిశుద్ధ్యం గ్రామాల్లో జ్వరాలు ప్రబలటానికి పారిశుద్ధ్య లోపమేనని పలువురు ఆరోపిస్తున్నారు. పలు గ్రామాల్లో వీధులు మురికికూపాలను తలపిస్తున్నాయి. ఇళ్ల ముందే అపరిశుభ్రత నెలకొని దుర్గంధం వెదజల్లుతోంది. ఎస్.నాగలాపురం, మసీదపురం, వెంకటగిరి, పెసలదిన్నె, దేవబెట్ట, దైవందిన్నె, ఏనుగుబాల, సోగనూరు గ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పారిశుద్ధ్యం మెరుగుదలకు అధికారులు చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచం పట్టిన పెద్దకడబూరు – దాదాపు 200 మందికి జ్వరాలు పెద్దకడబూరు: విష జ్వరాలతో మండల కేంద్రం మంచం పట్టింది. వారం క్రితం కురిసిన వర్షాలకు మురుగునీరు రోడ్లపై నిలిచి పరిసరాలు కలుషితమయా్యయి. ఇక దోమలు కూడా వృద్ధి చెంది వ్యాధులకు కారణమయ్యాయి. బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలలో దాదాపు 200మందికి పైగా రోగాల భారిన పడ్డారు. ఆర్థిక స్థోమత లేక స్థానిక ఆర్ఎంపీలతోనే చికిత్సలు పొందుతున్నారు. వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వీడి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. -
దట్టమైన అడవిలో...
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో విపక్ష నేత జగన్ పర్యటన - చాపరాయి జ్వరాల బాధితులకు ఓదార్పు సాక్షి ప్రతినిధి, కాకినాడ: మావోయిస్టులకు పెట్టని కోట.. దట్టమైన అడవులు.. దుర్భేద్యమై న కొండలు.. ప్రమాదకరమైన లోయలు.. రాళ్లతో కూడిన ఎగుడు దిగుడు దారి.. ఏకధాటిగా కురుస్తున్న వర్షం.. ఇదంతా చూస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు. అటువంటి తూర్పు కనుమల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం చాపరాయిలో విషజ్వరాల బారిన పడ్డ గిరిజనులను స్వయంగా పరామర్శించి, వారి కష్టాలను తెలుసుకునేందుకు వచ్చారు. గిరిపుత్రుల వెతలు విని జగన్ చలించిపోయారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. రంపచోడవరం నుంచి చాపరాయి చాపరాయిని సందర్శించేందుకు జగన్ శుక్రవారం రాత్రే రంపచోడవరం చేరుకున్నారు. శనివారం ఉదయమే ఆ గ్రామానికి బయలుదేరారు. తొలుత రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చాపరాయి గిరిజనులను పరామర్శించారు. అనంతరం మారేడుమిల్లి మీదుగా అడవిబాట పట్టారు. దట్టమైన అడవిలో ఆయన పర్యటన సాగింది. దారి పొడవునా గిరిజనులను కలుసుకుని మాట్లాడారు. ఎక్కడికక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడారికోటలో పెద్ద ఎత్తున తరలివచ్చిన గిరిజనులనుద్దేశించి ప్రసంగించారు. తరువాత ఘాట్‌రోడ్డులో వర్షంలోనే గంటపాటు ప్రయాణించి చాపరాయికి చేరుకున్నారు. బురదమయమైన రహదారిలో వాహనం ఎక్కడ జారిపోతుందో తెలియని ప్రమాదకర పరిస్థితుల్లో ఆయన ప్రయాణం సాగించారు. -
వినపడలేదా... గిరిజన వేదన
సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం - ముఖ్యమంత్రికి పేదవాడంటే కోపం - విష జ్వరాలతో 17 మంది చనిపోవడం బాధాకరం - అధైర్యపడొద్దు.. అన్నివిధాలా తోడుగా ఉంటా.. - చాపరాయి గ్రామస్తులకు జగన్ భరోసా... ఏజెన్సీలో పర్యటన సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘చంద్రబాబుకు పేదవాడంటే కోపం. మానవత్వం లేని ఆయన పాలనలో పేదలకు ఒరిగింది శూన్యం. మన బాధలను వినిపిస్తే చంద్రబాబుకు కొద్దోగొప్పో బుద్ధి జ్ఞానం వస్తాయేమో చూద్దాం. గడ్డి పెడితే ఆయనలో మానవత్వం వస్తుందేమో ఆశిద్దాం. చాపరాయి గ్రామంలో 17 మంది విష జ్వరాల బారిన పడి చనిపోవడం బాధాకరం. మళ్లీ ఇలాంటి మరణాలు సంభవించకుండా, సమస్యలు పరిష్కారమయ్యేలా మనమంతా కలిసి పోరాటం చేద్దాం. ఎవరూ అధైర్యపడొద్దు. మీకు అన్ని విధాలా అండగా ఉంటా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనులకు భరోసా కల్పించారు. ఆయన శనివారం తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో పర్యటించారు. విష జ్వరాలతో గిరిజనులు మృత్యువాత పడ్డ చాపరాయి గ్రామాన్ని సందర్శించారు. అంతకుముందు కడారికోటలో గిరిజనులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి పార్టీ తరపున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. గిరిపుత్రుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని చెప్పారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటోతోపాటు తన ఫొటో కూడా పెట్టుకునేలా అందరికీ మంచి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘మన నియోజకవర్గంలో దాదాపు సంవత్సరం కాలంలోనే ఎంతోమంది చనిపోయారు. కాళ్ల వాపు వ్యాధితోపాటు మలేరియా జ్వరాలు, విష జ్వరాల బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదేసమయంలో మరో 57 మంది తల్లీబిడ్డలు చనిపోయారు. రక్త హీనత(ఎనీమియా)తో అడవి బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నారు. నేను సంవత్సర కాలంలోనే మూడోసారి ఈ ప్రాంతానికి వచ్చాను. ప్రతిపక్ష నేత ఏజెన్సీ కి వస్తున్నాడని తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు గిరిజనుల సమస్యలపై మాట్లాడుతుంటారు. జగన్ తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ ఏమైనా జరిగిందా? అని చూస్తే ఏమీ జరగదు. మళ్లీ ఏదైనా ఘటన జరిగితే జగన్ వస్తాడేమో అన్న భయంతో ఏదేదో మాట్లాడుతారు. ఏదేదో చేస్తామని చెబుతారు. బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు చాపరాయిలో మే 29 నుంచి జూన్ 25వ తేదీ వరకు 17 మంది చనిపోయారు. దాదాపు 35 మంది అనారోగ్యం పాలై చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు. ఇంత ఘోరం జరుగుతుంటే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. అనారోగ్యం పాలైన గిరిజనులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నా మంత్రులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. బాధిత గిరిజనులకు వైద్య సేవలందించాల్సిన ఏఎన్ఎంలను ఇష్టానుసారంగా బదిలీ చేస్తున్నారు. గ్రామాల్లో 108, 104 అంబులెన్స్‌లు ఎక్కడా కనిపించడం లేదు. ఏజెన్సీలో 11 మండలాలు ఉండే కేవలం 7 అంబులెన్స్‌లు మాత్రమే ఉండడం దారుణం. అవైనా సక్రమంగా పనిచేస్తున్నాయా? అంటే అదీ లేదు. రోడ్డు లేదు.. నీరు లేదు చాపరాయి గ్రామానికి రోడ్డు లేదు. తాగడానికి మంచినీరు లేదు. ఒక్కటి కూడా పక్కా ఇల్లు లేదు. చేయడానికి కూలీ పని లేదు. ఉపాధి హామీ పని లేదు. రేషన్ సరుకుల కోసం 14 కిలోమీటర్లు నడవాలి. తెచ్చుకోవడానికి డబ్బు లేదు. విద్యుత్ సౌకర్యం లేదు. అంబులెన్స్ రాదు. ఆస్పత్రికి వెళ్లాలంటే 34 కిలోమీటర్లు నడవాలి. కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు వచ్చాయని గ్రామసభలో ప్రకటించి ఇవ్వడం లేదు. ఐటీడీఏ చేయాల్సిన పనులను కూడా ఓ పద్ధతి ప్రకారం నీరుగార్చేస్తున్నారు. చనిపోయినవారికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. మంత్రులు వచ్చినప్పుడు అడుగుతారని నోర్లు మూయిస్తున్నారు. గ్రామంలో ఆర్వో ప్లాంట్ పెడితే ఈ మరణాలు సంభవించవు. ఇలా చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాదు. గిరిజనులకు మంచి చేయాలన్న తపన కూడా లేదు. ఈ గ్రామంలో 350 మంది ఉంటే పాఠశాలను ఎత్తివేశారు. పౌష్టికాహారం లేక చిన్నపిల్లల్లో రక్తహీనత ఏజెన్సీలో రోడ్లు లేక, బస్సులు రాక గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. రేషన్ దుకాణాల్లో ఇచ్చేదే చాలీచాలని బియ్యం. ఆ దుకాణాల్లో సబ్బులు కొనుక్కుంటేనే బియ్యం ఇస్తారట! ఇదెక్కడి న్యాయం? గిరిజన సహకార సంఘాల్లో పనిచేసే వారికి కూడా జీతాలు ఇవ్వడం లేదు. పౌష్టికాహారం లేక చిన్నపిల్లల్లో రక్తహీనత పెరిగిపోతోంది. రంపచోడవరం ఆసుపత్రిలో పిల్లలకు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. వారి శరీరంలో ఉంటున్న రక్తం కేవలం 4 శాతమే. జీతాలు ఇవ్వకపోతే ఎవరు పనిచేస్తారు? రోగులు ఆసుపత్రులకు వెళితే అక్కడ వైద్యులు ఉండడం లేదు. ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం మూడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడానికి డాక్టర్లు ఇష్టపడడం లేదని మంత్రులు చెబుతున్నారు. డాక్టర్లు ఇక్కడికి రావడానికి సిద్ధంగానే ఉన్నారు. ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి, వైద్యులను ఎంపిక చేయడానికి సిద్ధంగా లేదు. కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్లను తీసుకొస్తున్నారు. వారికి మూడు నెలలకోసారి, నాలుగు నెలలకోసారి ఒక నెల జీతం ఇస్తున్నారు. కాంట్రాక్ట్ నర్సులకు కూడా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వకపోతే ఎవరు పనిచేస్తారు? బాధితులకు తోడుగా ఎవరు నిలుస్తారు? ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోగులు ఎలా బతుకుతారో ప్రభుత్వమే చెప్పాలి. గిరిజన సలహా మండలిని పక్కనపెట్టారు గిరిజన ప్రాంతాల్లో నీళ్లుండవు, రోడ్లు ఉండవు, పట్టించుకునే నాథుడే ఉండడు. ఐటీడీఏ నిధుల వినియోగాన్ని గిరిజన సలహా మండలి పర్యవేక్షించాల్సింది ఉంటుంది. గిరిజన సలహా మండలి అనేది చట్టప్రకారం వచ్చిన హక్కు. గిరిజన ప్రాంతాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల నుంచి గెలిచినవారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనే కారణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడేళ్లుగా గిరిజన సలహా మండలిని నియమించడం లేదు. ఫలితంగా ఐటీడీఎ నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారు అని అడిగే నాథుడు లేకుండా పోయాడు. ప్రభుత్వం గిరిజన సలహా మండలిని నియమించి ఉంటే గిరిపత్రులకు ఎంతో మేలు జరిగేది. గిరిజనులకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబులో ఏ కోశానా లేదు. చంద్రబాబుకు పేదవాడు అంటే కోపం. ఆయన హయాంలో ఏ ఒక్క పేదవాడీకి మేలు జరగలేదు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పేదలు బాగుపడ్డారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తోంది. మిగిలిన రూ.65 వేల పరిస్థితి ఏమిటి? అని అడిగితే.. ఇళ్లు, ఆస్తులు అమ్ముకోండి అని చెబుతోంది. ప్రభుత్వ నిర్వాకం వల్ల పేద విద్యార్థులు అర్ధాంతరంగా చదువులు మానేయాల్సిన దుస్థితి దాపురించింది’’ అని జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. -
విషజ్వరంతో చిన్నారి మృతి
ధర్మవరం అర్బన్ : పట్టణంలోని దుర్గానగర్‌లో సోమవారం ఉదయం రెండేళ్ల చిన్నారి సఫియా విష జ్వరంతో మృతిచెందింది. వివరాల్లోకెళితే.. బాబు, అమీనా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె సఫియా నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. అక్కడ రక్తపరీక్షలు చేసి, సాధారణ జ్వరమని నిర్ధారించారు. చిన్నారి నీరసంగా ఉండటంతో కామెర్లు వచ్చాయని, సందులు అయ్యాయని భావించిన తల్లిదండ్రులు సోమవారం ఉదయం అంత్రంతోపాటు గాజుతో రచ్చ(కాల్చడం) పెట్టించారు. అనంతరం ఇంటి వద్ద ఆడుకుంటున్న సఫియా ఉన్నట్లుండి కళ్లు తేలేసి కిందపడింది. తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రెండేళ్ల కూతురు కళ్లముందే చనిపోవడంతో ఆ తల్లి రోదన అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మునిసిపల్ అధికారులు దుర్గానగర్‌లో పర్యటించి మృతురాలి ఇంటి పరిసరాలను శుభ్రం చేయించారు. చిన్నారి కుటుంబ సభ్యుల వద్ద డిప్యూటీ డీఎంహెచ్‌వో వివరాలు సేకరించారు. వార్డు కౌన్సిలర్ లక్ష్మిదేవి, టీడీపీ నాయకులు బోయ రవిచంద్రలు బాధితులను పరామర్శించి ఓదార్చారు. -
విషజ్వరంతో భార్యాభర్తలు మృతి
గజపతినగరం (విజయనగరం): విష జ్వరం బారిన పడిన భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగాచాల్లపెంట గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గొంత రాము, పాపమ్మ దంపతులు విషజ్వరంతో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెందారు. దీంతో వారి నలుగురు పిల్లలు అనాథలయ్యారు. -
నిజామాబాద్ జిల్లాలో విషజ్వరాల పంజా
-
చిత్తూరు జిల్లాలో విషజ్వరాలు
-
మాజేరులో మరణమృదంగం
-
విష జ్వరంతో చిన్నారి మృతి
ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన 18 నెలల వయసున్న చిన్నారి విష జ్వరం బారిన పడి సోమవారం మృతి చెందింది. వివరాల ప్రకారం.. నూకల మహేష్, శ్రీదేవి దంపతుల కుమార్తె హాసినికి రెండు రోజుల నుంచి జ్వరం వస్తోంది. తల్లిదండ్రులు చిన్నారికి స్థానికంగా వైద్యం చేయించినప్పటికీ నయం కాలేదు. దాంతో విషజ్వరంతో బాధపడుతున్న చిన్నారిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ హాసిని సోమవారం కన్నుమూసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను జ్వరం మింగేసిందని తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది.