వినపడలేదా... గిరిజన వేదన | YS Jaganmohan Reddy fires on CM Candrababu | Sakshi
Sakshi News home page

వినపడలేదా... గిరిజన వేదన

Published Sun, Jul 2 2017 12:53 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

శనివారం చాపరాయిలో ప్రతిపక్ష నేత జగన్‌కు తన కష్టాలు వివరిస్తున్న సర్పంచ్‌ నర్సమ్మ - Sakshi

శనివారం చాపరాయిలో ప్రతిపక్ష నేత జగన్‌కు తన కష్టాలు వివరిస్తున్న సర్పంచ్‌ నర్సమ్మ

సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
- ముఖ్యమంత్రికి పేదవాడంటే కోపం  
విష జ్వరాలతో 17 మంది చనిపోవడం బాధాకరం
అధైర్యపడొద్దు.. అన్నివిధాలా తోడుగా ఉంటా.. 
చాపరాయి గ్రామస్తులకు జగన్‌ భరోసా... ఏజెన్సీలో పర్యటన 
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘చంద్రబాబుకు పేదవాడంటే కోపం. మానవత్వం లేని ఆయన పాలనలో పేదలకు ఒరిగింది శూన్యం. మన బాధలను వినిపిస్తే చంద్రబాబుకు కొద్దోగొప్పో బుద్ధి జ్ఞానం వస్తాయేమో చూద్దాం. గడ్డి పెడితే ఆయనలో మానవత్వం వస్తుందేమో ఆశిద్దాం. చాపరాయి గ్రామంలో 17 మంది విష జ్వరాల బారిన పడి చనిపోవడం బాధాకరం. మళ్లీ ఇలాంటి మరణాలు సంభవించకుండా, సమస్యలు పరిష్కారమయ్యేలా మనమంతా కలిసి పోరాటం చేద్దాం. ఎవరూ అధైర్యపడొద్దు. మీకు అన్ని విధాలా అండగా ఉంటా’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనులకు భరోసా కల్పించారు.

ఆయన శనివారం తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో పర్యటించారు. విష జ్వరాలతో గిరిజనులు మృత్యువాత పడ్డ చాపరాయి గ్రామాన్ని సందర్శించారు. అంతకుముందు కడారికోటలో గిరిజనులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి పార్టీ తరపున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. గిరిపుత్రుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని చెప్పారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫొటోతోపాటు తన ఫొటో కూడా పెట్టుకునేలా అందరికీ మంచి చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు.

 ఆయన ఇంకా ఏం చెప్పారంటే...
‘‘మన నియోజకవర్గంలో దాదాపు సంవత్సరం కాలంలోనే ఎంతోమంది చనిపోయారు. కాళ్ల వాపు వ్యాధితోపాటు మలేరియా జ్వరాలు, విష జ్వరాల బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదేసమయంలో మరో 57 మంది తల్లీబిడ్డలు చనిపోయారు. రక్త హీనత(ఎనీమియా)తో అడవి బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నారు. నేను సంవత్సర కాలంలోనే మూడోసారి ఈ ప్రాంతానికి వచ్చాను. ప్రతిపక్ష నేత ఏజెన్సీ కి వస్తున్నాడని తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు గిరిజనుల సమస్యలపై మాట్లాడుతుంటారు. జగన్‌ తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ ఏమైనా జరిగిందా? అని చూస్తే ఏమీ జరగదు. మళ్లీ ఏదైనా ఘటన జరిగితే జగన్‌ వస్తాడేమో అన్న భయంతో ఏదేదో మాట్లాడుతారు. ఏదేదో చేస్తామని చెబుతారు.
 
బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు
చాపరాయిలో మే 29 నుంచి జూన్‌ 25వ తేదీ వరకు 17 మంది చనిపోయారు. దాదాపు 35 మంది అనారోగ్యం పాలై చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు. ఇంత ఘోరం జరుగుతుంటే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. అనారోగ్యం పాలైన గిరిజనులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నా మంత్రులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. బాధిత గిరిజనులకు వైద్య సేవలందించాల్సిన ఏఎన్‌ఎంలను ఇష్టానుసారంగా బదిలీ చేస్తున్నారు. గ్రామాల్లో 108, 104 అంబులెన్స్‌లు ఎక్కడా కనిపించడం లేదు. ఏజెన్సీలో 11 మండలాలు ఉండే కేవలం 7 అంబులెన్స్‌లు మాత్రమే ఉండడం దారుణం. అవైనా సక్రమంగా పనిచేస్తున్నాయా? అంటే అదీ లేదు. 
 
రోడ్డు లేదు.. నీరు లేదు
చాపరాయి గ్రామానికి రోడ్డు లేదు. తాగడానికి మంచినీరు లేదు. ఒక్కటి కూడా పక్కా ఇల్లు లేదు. చేయడానికి కూలీ పని లేదు. ఉపాధి హామీ పని లేదు. రేషన్‌ సరుకుల కోసం 14 కిలోమీటర్లు నడవాలి. తెచ్చుకోవడానికి డబ్బు లేదు. విద్యుత్‌ సౌకర్యం లేదు. అంబులెన్స్‌ రాదు. ఆస్పత్రికి వెళ్లాలంటే 34 కిలోమీటర్లు నడవాలి. కొత్త పింఛన్లు, రేషన్‌ కార్డులు వచ్చాయని గ్రామసభలో ప్రకటించి ఇవ్వడం లేదు. ఐటీడీఏ చేయాల్సిన పనులను కూడా ఓ పద్ధతి ప్రకారం నీరుగార్చేస్తున్నారు. చనిపోయినవారికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. మంత్రులు వచ్చినప్పుడు అడుగుతారని నోర్లు మూయిస్తున్నారు.  గ్రామంలో ఆర్‌వో ప్లాంట్‌ పెడితే ఈ మరణాలు సంభవించవు. ఇలా చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాదు. గిరిజనులకు మంచి చేయాలన్న తపన కూడా లేదు. ఈ గ్రామంలో 350 మంది ఉంటే పాఠశాలను ఎత్తివేశారు.
 
పౌష్టికాహారం లేక చిన్నపిల్లల్లో రక్తహీనత
ఏజెన్సీలో రోడ్లు లేక, బస్సులు రాక గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. రేషన్‌ దుకాణాల్లో ఇచ్చేదే చాలీచాలని బియ్యం. ఆ దుకాణాల్లో సబ్బులు కొనుక్కుంటేనే బియ్యం ఇస్తారట! ఇదెక్కడి న్యాయం? గిరిజన సహకార సంఘాల్లో పనిచేసే వారికి కూడా జీతాలు ఇవ్వడం లేదు. పౌష్టికాహారం లేక చిన్నపిల్లల్లో రక్తహీనత పెరిగిపోతోంది. రంపచోడవరం ఆసుపత్రిలో పిల్లలకు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. వారి శరీరంలో ఉంటున్న రక్తం కేవలం 4 శాతమే.
 
జీతాలు ఇవ్వకపోతే ఎవరు పనిచేస్తారు?
రోగులు ఆసుపత్రులకు వెళితే అక్కడ వైద్యులు ఉండడం లేదు. ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం మూడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడానికి డాక్టర్లు ఇష్టపడడం లేదని మంత్రులు చెబుతున్నారు. డాక్టర్లు ఇక్కడికి రావడానికి సిద్ధంగానే ఉన్నారు. ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి, వైద్యులను ఎంపిక చేయడానికి సిద్ధంగా లేదు. కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్లను తీసుకొస్తున్నారు. వారికి మూడు నెలలకోసారి, నాలుగు నెలలకోసారి ఒక నెల జీతం ఇస్తున్నారు. కాంట్రాక్ట్‌ నర్సులకు కూడా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వకపోతే ఎవరు పనిచేస్తారు? బాధితులకు తోడుగా ఎవరు నిలుస్తారు? ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోగులు ఎలా బతుకుతారో ప్రభుత్వమే చెప్పాలి.
 
గిరిజన సలహా మండలిని పక్కనపెట్టారు
గిరిజన ప్రాంతాల్లో నీళ్లుండవు, రోడ్లు ఉండవు, పట్టించుకునే నాథుడే ఉండడు. ఐటీడీఏ నిధుల వినియోగాన్ని గిరిజన సలహా మండలి పర్యవేక్షించాల్సింది ఉంటుంది. గిరిజన సలహా మండలి అనేది చట్టప్రకారం వచ్చిన హక్కు. గిరిజన ప్రాంతాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల నుంచి గెలిచినవారంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అనే కారణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడేళ్లుగా గిరిజన సలహా మండలిని నియమించడం లేదు. ఫలితంగా ఐటీడీఎ నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారు అని అడిగే నాథుడు లేకుండా పోయాడు. ప్రభుత్వం గిరిజన సలహా మండలిని నియమించి ఉంటే గిరిపత్రులకు ఎంతో మేలు జరిగేది. గిరిజనులకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబులో ఏ కోశానా లేదు. చంద్రబాబుకు పేదవాడు అంటే కోపం.

ఆయన హయాంలో ఏ ఒక్క పేదవాడీకి మేలు జరగలేదు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పేదలు బాగుపడ్డారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తోంది. మిగిలిన రూ.65 వేల పరిస్థితి ఏమిటి? అని అడిగితే.. ఇళ్లు, ఆస్తులు అమ్ముకోండి అని చెబుతోంది. ప్రభుత్వ నిర్వాకం వల్ల పేద విద్యార్థులు అర్ధాంతరంగా చదువులు మానేయాల్సిన దుస్థితి దాపురించింది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement