సరిగా స్పందించలేదు: సీఎం ఆగ్రహం
సాక్షి, అమరావతి : గరగపర్రు, చాపరాయి గ్రామాల్లో చోటుచేసుకున్న ఘటనలపై అధికారులు, పార్టీ ఎమ్మెల్యేలు సరిగా స్పందించలేదని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. చాపరాయిలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల గిరిజనులు మృత్యువాతపడ్డారని, కొంచెం అప్రమత్తంగా ఉంటే ఇబ్బంది కాదన్నారు.
తాను జోక్యం చేసుకున్న తర్వాత గానీ రెండు గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని, ఇందుకు అందరూ పనిచేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లోనూ పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విశాఖ భూముల కుంభకోణంపై అయ్యన్నపాత్రుడు, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని నానిలు చేసిన కామెంట్లను పరోక్షంగా ప్రస్తావించారు. నేతలందరూ ఇష్టానుసారం చేసిన కామెంట్ల జాబితాను బయటకు తీయిస్తానని చెప్పి ఇకపై ఇలాంటి కామెంట్లు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.