మృతులు లింగయ్య, రాజుగట్టు, సోని, శ్రీవర్షిణి
సాక్షి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్ /రాంగోపాల్‌పేట్: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. ఓ కుటుంబాన్ని వీడని నీడలా వెంటాడి ఛిద్రం చేసేసింది డెంగీ. పదిహేను రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తొలుత భర్త, తర్వాత భర్త తరఫు తాత, ఆపై ముద్దుల కూతురు..ఇప్పుడు ఏకంగా జన్మనిచ్చిన బిడ్డను చూసుకోకుండానే తల్లినే కబళించేసింది మహమ్మారి డెంగీ జ్వరం. వైద్యాధికారుల్ని, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే ఈ హృదయ విదారకర ఘటనల వివరాలిలా ఉన్నాయి.
ఒకరి వెనుక ఒకరు..
మంచిర్యాల జిల్లా కేంద్రం శ్రీశ్రీనగర్‌లో నివాసం ఉంటోన్న ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు గుడిమల్ల రాజగట్టు (30), సోని (28) దంపతులు. రాజగట్టుకు జ్వరం రావటంతో ఈనెల 12న స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి, మూడ్రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఎంతకూ జ్వరం తగ్గకపోగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 16న మృతిచెందాడు. మృతుడికి సంబంధించిన ఐదోరోజు కర్మ కార్యక్రమాలను నిర్వహిస్తుండగానే రాజగట్టు తాత లింగయ్య(80)కు జ్వరం వచ్చింది. దీంతో లింగయ్యను అదేరోజు రామకృష్ణాపూర్ సింగరేణి ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ నెల 20న మరణించాడు.
వీరి మృతిని జీర్ణించుకోకముందే రాజగట్టు, సోని దంపతుల కుమార్తె శ్రీవర్షిణి (6)కి డెంగీ జ్వరం వచ్చింది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 27న దీపావళిరోజు మృతి చెందింది. అప్పటికే సోనీకి నెలలు నిండటం..ఆమెకు కూడా డెంగీ లక్షణాలున్నాయని వైద్యులు నిర్ధారించడంతో.. వైద్యం కోసం ఈనెల 28న సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. మంగళవారం మధ్యాహ్నం సిజేరియన్ ద్వారా సోని మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు కూడా డెంగీ సోకడంతో ఐసీయూ ఉంచి తల్లీ బిడ్డలకు చికిత్సను అందజేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం తల్లి సోని మృతి చెందింది. సోనీని, ఆమెకు పుట్టబోయే బిడ్డనూ ఎలాగైనా రక్షించుకోవాలన్న తాపత్రయంతో రూ.లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతదేహాన్ని బుధవారం రాత్రి మంచిర్యాలకు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి మృతదేహం తరలింపునకు ఉచితంగా అంబులెన్సును సమకూర్చారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
మిగిలింది ఇద్దరే..
ఒకే కుటుంబంలో డెంగీ మహమ్మారి నలుగుర్ని పొట్టనబెట్టుకోవడంతో ఆ కుటుంబం ఇద్దరు మాత్రమే మిగిలారు. మంగళవారం సోనికి జన్మించిన మగశిశువు(3రోజులు)తో పాటు, పెద్దకుమారుడు శ్రీవికాస్. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు.
కన్నీరుమున్నీరవుతున్న కుమారుడు..
కేవలం 15 రోజుల వ్యవధిలో నలుగురిని కోల్పోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకే కుటుంబంలోని తల్లి, తండ్రి, చెల్లెలు ఒకరి తరువాత ఒకరిని కోల్పోయిన రాజగట్టు సోని దంపతుల కుమారుడు శ్రీవికాస్(8)ను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment