మాట్లాడుతున్న ఖమ్మం డీపీఓ శ్రీనివాసరెడ్డి
సాక్షి, కారేపల్లి: డెంగీ కేసుల్లో కారేపల్లి మండలం జిల్లాలో మొదటి స్థానంలో ఉందని ఖమ్మండీపీఓ కే. శ్రీనివాసరెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ కళావతిబాయి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కారేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో వారు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పని చేయాలని, లేదంటే డెంగీ మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు ఏజెన్సీ మండలాల్లో సింగరేణి మండలం డెంగీ కేసుల్లో మొదటి స్థానంలో ఉందని, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కారేపల్లి మండలాన్ని డెంగీ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యంపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాన్ని విధిగా నిర్వర్తించాలన్నారు. డెంగీ దోమల నివారణ చర్యల పై ప్రజలకు అవగహన కల్పించాలని వారు సూచించారు. మండలంలో కారేపల్లి, నానునగర్‌తండా, గాదెపాడు, వెంకిట్యాతండా, భల్లునగర్‌తండా, విశ్వనాథపల్లి, లింగం బంజర, భాగ్యనగర్‌తండా, ఉసిరికాయపల్లి, చీమలపాడు గ్రామాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అన్నారు. గ్రామ కార్యదర్శులు డెంగీ కేసులపై తగిన చర్యలు తీసుకోకపోతే మీ రెగ్యులైజేషన్‌ను నిలిపివేస్తామని డీపీఓ హెచ్చరించారు.
చికెన్ గున్యా వచ్చినప్పుడు ఒళ్లు నొప్పులు తగ్గించుకునేందుకు వాడే పెయిన్ కిల్లర్ టాబ్లెట్‌లతో కిడ్నీలపై ప్రభావం పడి మృత్యువాత పడే ప్రమాదం ఉందని డీఎంహెచ్‌ఓ సూచించారు. అనంతరం భారత్ నగర్ కాలనీ వీధుల్లో రోడ్లపై పారుతున్న మురికి గుంతల సమస్యను తక్షణమే పరిష్కరించాలని జిల్లా అధికారులు కార్యదర్శిని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో డీఎంఓ సైదులు, ఎంపీపీ శకుంతల, ఫార్మసీ విభాగ పర్యవేక్షకురాలు నాగమణి, పీహెచ్‌సీ వైద్యాధికారి వై. హన్మంతరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment