Karepalli
-
కారేపల్లి ఘటనలో కుట్ర కోణం.. కేటీఆర్ ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా కారేపల్లి అగ్నిప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్.. బాధితులను పరామర్శించారు. నలుగురి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కారేపల్లి ఘటన దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో కుట్ర కోణం ఉందో లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైదులను కోరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు. చదవండి: కాళ్లు తెగి ముక్కలై.. బతుకుల్లో నిప్పు పెట్టిన బాణసంచా కాగా, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలిన విషయం తెలిసిందే. కారేపల్లి మండలం చీమలపాడులో ఈఘటన చోటుచేసుకుంది. బాణసంచాతో గుడిసెకు నిప్పు అంటుకోవడతో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి కాళ్లు తెగిపోగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరికొందరికి నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఘటన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వారం రోజుల పోరాటం.. దిగొచ్చిన ప్రియుడు.. ప్రేమజంటకు పెళ్లి
సాక్షి, కారేపల్లి: తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి వారం రోజులపాటు మౌనపోరాటం చేపట్టడంతో దిగొచి్చన ప్రియుడు వివాహం చేసుకున్నాడు. మంగళవారం కారేపల్లి సంతగుడి (శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం)లో మహిళా సంఘాలు, అఖిలపక్ష పార్టీలు, స్థానిక పెద్దలు ప్రేమజంటకు వివాహం జరిపించారు. కారేపల్లికి చెందిన సముద్రాల వేణు తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ మండలంలోని ఎర్రబోడు గ్రామానికి చెందిన కోన సునీత ప్రియుడు ఇంటి ముందు వారం రోజులుగా మౌన పోరాటం చేపట్టిన విషయం విదితమే. చదవండి: TSRTC: జేబీఎస్‌లోనూ యూపీఐ సేవలు ప్రారంభం ఆమెకు మహిళా సంఘాల వారు, అఖిలపక్ష నాయకులు, పెద్దలు అండగా నిలిచారు. ప్రియుడు అంగీకరించడంతో వారే దగ్గరుండి పెళ్లి జరిపించారు. మహిళా సంఘాలు, అఖిలపక్ష నాయకులు లతాదేవి, మెరుగు రమణ, కె.ఉమావతి, బి.సుజాత, దేవి, బి.వీరభద్రం నాయక్, కె.నాగేశ్వరరావు, కె.నరేందర్, శ్రీనివాసరావు, ఎం. సత్యనారాయణ, పిల్లి వెంకటేశ్వర్లు, టోనీ వీరప్రతాప్, డి. ప్రసాద్, టి.నారాయణ, ఎ. రాములు, జి శివ, ఎంపీటీసీ రమాదేవి, సర్పంచ్‌లు ఎ.స్రవంతి, కుర్సం సత్యనారాయణ, రంగారావు పాల్గొన్నారు. చదవండి: కూకట్పల్లి ప్రాంతానికి ఈ నెల 29న నీళ్లు బంద్.. -
ప్రియురాలు ఆగ్రహించింది..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం(కారేపల్లి): పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఇప్పుడు మాట తప్పి మరో యువతితో పెళ్లికి సిద్ధపడిన తన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన మండల పరిధిలోని భాగ్యనగర్‌తండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి చెందిన కుంజా హేమలత ప్రస్తుతం పినపాక మండలం ఐలాపురం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తోంది. చదవండి: (స్నానం చేస్తుంటే వీడియో తీసి.. ఆపై) ఇకారేపల్లి మండలం భాగ్యనగర్‌తండా గ్రామానికి చెందిన గుగులోతు అశోక్ గుండాల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. వీరిద్దరూ భద్రాచలంలోని ఐటీడీఏ బీఈడీ కళాశాలలో చదువుకున్నారు. ఆ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని తనను లొంగదీసుకున్న అశోక్ మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని, కుటుంబ సభ్యులతో హేమలత ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. చదవండి: (నెల రోజుల్లో వివాహం.. అర్ధరాత్రి దారుణహత్య) -
మద్యం మత్తులో భార్య: భర్తను హత్యచేశానంటూ
ఖమ్మం (కారేపల్లి): భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిందంటూ పుకార్లు షికార్లు చేయటంతో కారేపల్లిలో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. మండలంలోని సూర్యతండా గ్రామానికి చెందిన ఓ మహిళ మద్యం మత్తులో గురువారం రాత్రి కారేపల్లి పోలీసు స్టేషన్‌కు వచ్చింది. తనకు తన భర్తకు మధ్య గొడవ జరిగిందని, తన భర్తను హత్య చేశానని, తనను అరెస్టు చేయాలని పోలీసులను వేడుకుంది. దీంతో స్థానిక పోలీసులు బాధిత మహిళ మానసిక స్థితిని గమనించి ఆ గ్రామ పెద్దమనుషులకు సమాచారం అందించి ఆమెను ఇంటికి పంపించారు. భర్త శుక్రవారం ఉదయం 10 గంటలైన ఇంటికి రాకపోవటంతో గ్రామస్తులు ఆ మహిళను ప్రశ్నిస్తూ ఆటోలో మండలంలోని పలు ప్రాంతాల్లో గాలించారు. దీంతో కారేపల్లి బస్టాండ్ సెంటర్, సినిమాహాల్ సెంటర్లో ‘భర్తను భార్య చంపేసింది’ అనే వార్త చకర్లు కొట్టడంతో, ఆ మహిళను స్థానికులు చుట్టుముట్టి పలు ప్రశ్నలతో విసిగించారు. జనం వందలాదిగా గుమిగూడటంతో ఆమెను స్థానిక పోలీసులు కారేపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం కారేపల్లి పోలీసులకు ఆ మహిళ భర్త మేకలతండా ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఉన్నాడని స్థానికుల ద్వారా సమాచారం అందుకోవటంతో ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆమె తన భర్తను చంపలేదని, అన్ని పుకార్లేనని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య కేవలం చిన్న గొడవ జరగడంతో ఆ వ్యక్తి అలిగి బయట ఉన్నట్లు తెలిపారు. -
డెంగీ కేసుల్లో కారేపల్లి మొదటి స్థానం
సాక్షి, కారేపల్లి: డెంగీ కేసుల్లో కారేపల్లి మండలం జిల్లాలో మొదటి స్థానంలో ఉందని ఖమ్మండీపీఓ కే. శ్రీనివాసరెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ కళావతిబాయి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కారేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో వారు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పని చేయాలని, లేదంటే డెంగీ మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు ఏజెన్సీ మండలాల్లో సింగరేణి మండలం డెంగీ కేసుల్లో మొదటి స్థానంలో ఉందని, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కారేపల్లి మండలాన్ని డెంగీ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాన్ని విధిగా నిర్వర్తించాలన్నారు. డెంగీ దోమల నివారణ చర్యల పై ప్రజలకు అవగహన కల్పించాలని వారు సూచించారు. మండలంలో కారేపల్లి, నానునగర్‌తండా, గాదెపాడు, వెంకిట్యాతండా, భల్లునగర్‌తండా, విశ్వనాథపల్లి, లింగం బంజర, భాగ్యనగర్‌తండా, ఉసిరికాయపల్లి, చీమలపాడు గ్రామాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అన్నారు. గ్రామ కార్యదర్శులు డెంగీ కేసులపై తగిన చర్యలు తీసుకోకపోతే మీ రెగ్యులైజేషన్‌ను నిలిపివేస్తామని డీపీఓ హెచ్చరించారు. చికెన్ గున్యా వచ్చినప్పుడు ఒళ్లు నొప్పులు తగ్గించుకునేందుకు వాడే పెయిన్ కిల్లర్ టాబ్లెట్లతో కిడ్నీలపై ప్రభావం పడి మృత్యువాత పడే ప్రమాదం ఉందని డీఎంహెచ్ఓ సూచించారు. అనంతరం భారత్ నగర్ కాలనీ వీధుల్లో రోడ్లపై పారుతున్న మురికి గుంతల సమస్యను తక్షణమే పరిష్కరించాలని జిల్లా అధికారులు కార్యదర్శిని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో డీఎంఓ సైదులు, ఎంపీపీ శకుంతల, ఫార్మసీ విభాగ పర్యవేక్షకురాలు నాగమణి, పీహెచ్సీ వైద్యాధికారి వై. హన్మంతరావు పాల్గొన్నారు. -
ఆ ఇంట్లో నిజంగానే గుప్త నిధులున్నాయా?
సాక్షి, కారేపల్లి(ఖమ్మం) : ఒకప్పుడు చుట్టుపక్కల 40 గ్రామాల రైతులకు బంగారం, వెండి వస్తువులు తాకట్టు పెట్టుకుని పెట్టుబడులు అందించిన ఓ షావుకారి ఇల్లు నేడు శిథిలావస్థకు చేరగా..అక్కడ ఓ నిధితో కూడిన ఇనుప పెట్టె లభ్యమైనట్లు స్థానికంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. కారేపల్లి మసీదు రోడ్డులో గల షావుకారి, స్వాతంత్ర సమరయోధుడు యర్రా రామలింగయ్య నివాసం శిథిలమైంది. వీరి కుమారులు ఒకరు కారేపల్లి మెయిన్ రోడ్డులో నివాసం ఉంటుండగా, మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయ్యి హన్మకొండలో స్థిరపడ్డారు. 30 రోజుల ప్రణాళిక కార్యాచరణలో భాగంగా సింగరేణి పంచాయతీ సిబ్బంది.. ఆదివారం సాయంత్రం జేసీబీతో ఈ పాడుబడిన ఇంటిని కూల్చేశారు. మట్టిని తొలగిస్తుండగా..ఓ ఇనుప పెట్టె బయట పడిందని, దానికి ఓ తాళం వేసి ఉందని, గమనించిన జేసీబీ, ట్రాక్టర్ డ్రైవర్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చారని సమాచారం. ఈ క్రమంలోనే పాడుపడ్డ ఇంటికి సమీపంలో ఉన్న మరో నివాసం వారు వచ్చి ఆ పెట్టెను తమ ఇంట్లో భద్రపరుచుకున్నారని, అందులో బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయని, ఐదుగురికి పంపకాల్లో తేడాలు రావడంతో..విషయం బయటకు పొక్కిందని చర్చ జరుగుతోంది. కారేపల్లిలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ పుకార్లు పోలీసులకూ చేరడంతో అసలు వాస్తవమేనా..? లేక కావాలని పుకార్లు సృష్టించారా..? అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే..యర్రా రామలింగయ్య కుమారుడు యర్రా వెంకటరమణ స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. ‘ ఇంట్లో నాపరాళ్ల కింద ఇనుప పెట్టె ఉన్నదని..మా అమ్మకు మా నాన్నమ్మ చెప్పిందని, పలు సందర్భాల్లో ఒక చోట నాపరాళ్లు తీసి తవ్వినా కన్పించలేదని, ఒక వేళ నిధి దొరికితే..వారసులమైన తమకు లేదా ప్రభుత్వానికి చెందాలి’ అని వివరించారు. -
ఈ ఇళ్లకు దారేది..?
సాక్షి, కారేపల్లి: ఈ ఊరికి ఆ వీధులే ప్రతి రూపాలు.. ఊరు పుట్టినప్పుడు పుట్టిన వీధులు పాలకుల నిర్లక్ష్యంతో నేడు అంద వికారంగా మారాయి. పాత ఊరని, పాత బజార్లని, ఆ పాలకులకు చిన్నచూపుమో..! అభివృద్ధికి ఆమడ దూరంలో పెట్టారు. ఒకప్పుడు జనాల రద్దీతో సందడి సందడిగా ఉండే వీధులు నేడు చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, కంప, తుమ్మ చెట్లతో వెక్కిరిస్తున్నాయి. ఇక వర్షాకాలంలో అయితే ఈ వీధుల దుస్థితి వర్ణణాతీతం. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఊరికి ఎవరింటికైన బంధువులు వస్తే.. ఫలాన వాళ్ల ఇంటికి వెళ్లాలి.. ఆ ఇంటికి దారేది..? ఎటునుంచి పోవాలి..?అనే ప్రశ్నలు వినాల్సిన దుస్థితి ఈ వీధివాసులకు తారసపడటం పరిపాటిగా మారింది. ఇదంతా మండలంలోని ఏ మారుమూల గ్రామమో అనుకుంటే పొరపాటే, ఇది మండల కేంద్రం కారేపల్లిలోని 1, 2, 3, 4, 5, 6వ వార్డుల్లోని పాత శివాలయం, గొందేరుబావి, మదీన సెంటర్, మసీద్ గల్లీ బజార్, భారత్‌నగర్, జంగల్ బజార్ వీధుల దుస్థితి. గొందేరుబావి వీధిలో ఉన్న పాడుపడిన బావిని పూడ్చకపోవడంతో చెత్త చెదారంతో పాటు వర్షం నీరు నిలిచి మురిగిపోయి, దుర్వాసన వెదజల్లుతుంది. దీనికి తోడు విష పురుగులకు నివాసంగా గొందేరు బావి నిలిచిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విషపురుగులకు నిలయంగా పాడుపడిన గొందేరుబావి పిచ్చిమొక్కలతో నిండిన మసీదు గల్లీ ఈ సారైనా బాగుచేస్తారా..? అభ్యర్థులను ప్రశ్నిస్తున్న ప్రజలు.. గత పాలకులు ఎలాగో పట్టించుకోలేదు. ఈ సారైనా మా ఊరిని బాగు చేస్తారా.. చేయ్యరా..? అని ప్రజలు ప్రచారానికి వచ్చిన అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా చేస్తాం, రోడ్లు బాగు చేయకపోతే మీ ఊళ్లోకి రానివ్వకండని.. గట్టిగానే హామీలను గుప్పిస్తున్నారు నాయకులు. -
కారేపల్లిలో పట్టుబడిన బెంగాలీ దొంగ
కారేపల్లి: ఓ వైపు బిహార్ దొంగలు ఇంట్లోకి చొర బడి పిల్లలను ఎత్తుకెళ్లిపోతున్నారు, అడ్డు వచ్చిన వారిని హతమార్చుతున్నారు..అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అపోహలు పెరిగిపోయి.. రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పుకార్లుతో ప్రజలు బెంబేలెత్తి పోతుంటే...! తాజాగా కారేపల్లిలో ఓ బెంగాలీ యువకుడు ఆది వారం తెల్లవారు జామున ఆటోను దొంగిలిస్తూ పట్టు పడిన ఘటనతో కారేపల్లిలో మరొక్కసారి అలజడి ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో కారేపల్లిలో నాటు వైద్యం పేరుతో ఇద్దరు మహిళలు పట్టపగలే ఇంటి తలుపులు కొడుతూ.. మీకు ఆ రోగం తగ్గిస్తాం, ఈ రోగం తగ్గిస్తాం అంటూ అనుమానాస్పదంగా తిరిగి, చివరికి గ్రామస్తుల చేతికి చిక్కి పోలీసులకు అప్పగించిన ఘటన మరువక ముందే..ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఈ బెంగాల్ దొంగ ఘటన ప్రజల్లో మరోక్క సారి భయాందోళనను రేకెత్తించింది. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా చెందిన మోహన్ బిస్వాల్ అనే యువకుడు గత నెల 30వ తేదీన పశ్చిమ బెంగాల్ నుంచి తమ బ్యాచ్ (ముఠా)తో కలిసి హైదరాబాద్‌లోని షేరులింగం పల్లి వద్ద కాంట్రాక్టర్ ఇమ్రాన్ అహ్మద్ వద్ద కన్స్ట్రక్షన్ పనుల్లో భాగంగా హెల్పర్‌గా పని చేసేందుకు వచ్చాడు. దీనికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీ వరకు వ్యాలిడిటీతో అతని వద్ద సరోవర్ జెనిత్ కంపెనీలో పని చేసేందుకు కార్డు సైతం ఉంది. ఇదిలా ఉండగా..తన ముఠాతో పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్ వచ్చిన మోహన్ బిస్వాల్..తప్పిపోయి హైదరాబాద్‌లోని కాకతీయ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కాడు. తన ముఠా కన్పింక క పోవటంతో..తనకు వచ్చిన బెంగాళీ బాషలో అడ్రస్ చెప్పాలంటూ ట్రైన్లో సైతం ప్యాసింజర్లను విసిగించటం, శనివారం అర్థ రాత్రి వరకు ఆ బోగీలో ఉన్న వారిని సైతం లేపి ఇబ్బందులకు గురి చేయటంతో అతన్ని..కారేపల్లి రైల్వే స్టేషన్ వద్దకు రాగానే ఆదివారం తెల్లవారుజాము 3 గం టల సమయంలో బలవంతంగా దింపివేశారు. దీంతో అయోమయానికి గురైన మోహన్ బిస్వాల్ ఏమి చేయాలో తోచక..కారేపల్లిలో ఒంటరిగా కలియతిరుగుతూ..భారత్‌నగర్‌కు చేరు కున్నాడు. ఈ క్రమంలో ఏమిచేయాలో తోచని మోహన్ బిస్వాల్ రోడ్డు ప్రక్కనే ఉన్న ఆటోను నెట్టుకుంటూ..రోడ్డు పైకి తెచ్చాడు. ఆటోలో ఎటేపైన వెళ్దామనుకున్నాడో..ఏమో తెలియని బిస్వాల్ ఆటో ఎంతకు కదలక పోవటంతో..అదే ఇంటిలోని కుంటుంబ సభ్యులను నిద్ర లేపి..తనకు వచ్చిన బెంగాలి బాషతో వారిని బెంబేలెత్తించాడు. దీంతో దొంగ దొంగ అని అరవటంతో..చుట్టు ప్రక్కల వాళ్లు అక్కడికి చేరుకొని..ఇతడు దొంగేనని తలంచి దేహశుద్ది చేశారు. అనంతరం తాళ్లతో కట్టివేసి కారేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. -
దర్జాగా దోచుకున్నాడు..!
అతడు దర్జాగా వచ్చాడు. ఆ ట్రాక్టర్ యజమానికి కాకమ్మ కబుర్లు చెప్పాడు. 28వేల రూపాయలు తీసుకుని, దర్జాగా వెళ్లిపోయాడు. అసలేం జరిగిందో ఆ ట్రాక్టర్ యజమానికి అర్థమవలేదు. ‘నువ్వు మోసపోయావ్’ అని ఇతరులు చెప్పేంతవరకు కూడా అతడికి తెలియలేదు. అసలేం జరిగిందంటే... కారేపల్లి: మండలంలోని దుబ్బతండా గ్రామానికి చెందిన ఆంగోతు కృష్ణకు ట్రాక్టర్ ఉంది. దానికి చిన్న రిపేర్ వచ్చింది. కారేపల్లిలోని మెకానిక్ షెడ్‌కు మంగళవారం తీసుకెళ్లాడు. అంతలోనే ఆ షెడ్ వద్దకు, టిప్‌టాప్‌గా తయారైన ఓ యువకుడు వచ్చాడు. ‘‘మాది ఆంధ్రా. ఇక్కడ రోడ్డు కాంట్రాక్ట్ వర్క్ చేయిస్తున్నాను. మాకు మూడు డోజర్లు ఉన్నాయి. కారేపల్లి పెట్రోల్ బంక్‌లో మాకు ఖాతా ఉంది’’ అని పరిచయం చేసుకున్నాడు. ‘‘మా ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. నేను అర్జంటుగా మా ఊరికి వెళ్లాలి. నాకు రూ.28వేలు కావాలి. లీటర్ డిజిల్ రూ.70 ఉంది కదా! బంక్‌లో రూ.65కే కొట్టిస్తాను. 400 లీటర్ల డీజిల్‌ను ఖాతాలో కొట్టిస్తాను’’ అని, ఆ ట్రాక్టర్ డ్రైవర్‌తో చెప్పాడు. చూడ్డానికి దర్జాగా ఉండి, మొహం దీనంగా పెట్టిన అతడిని చూసిన ఆ ట్రాక్టర్ యజమాని ఆంగోతు కృష్ణకు ఎటువంటి అనుమానం రాలేదు. పూర్తిగా నమ్మేశాడు. మనసులోనే లెక్కలేసుకున్నాడు. లీటర్‌కు రూ.65 చొప్పున 400 లీటర్లకు రెండువేల రూపాయలు మిగులుతాయని అనుకున్నాడు. ‘‘సరే.. ఆ డబ్బు నేనిస్తాను. నాకు డీజిల్ కొట్టించు’’ అని చెప్పాడు. ఆ దర్జా బాబు సరేనన్నాడు. కానీ, కృష్ణ వద్ద అంత మొత్తం లేదు. దీంతో, ఎనిమిది కిలోమీటర్ల దూరంలోగల దుబ్బతండా గ్రామంలోగల తన ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఇంట్లో నుంచి రూ.28వేలు తీసుకుని తిరిగొచ్చాడు. దర్జా బాబు, రెండువేల రూపాయలతో (డీజిల్ పట్టేందుకని) రెండు డ్రమ్ములను కొనిపెట్టాడు. వాటిని తన ట్రాక్టర్‌పై కృష్ణ చేర్చాడు. తన ద్విచక్ర వాహనంపై కారేపల్లి పెట్రోల్ బంక్ వద్దకు ఆ యువకుడు వెళ్లాడు. వాహనాన్ని బంక్ బయట రోడ్డుపై ఉంచాడు. నమోదు కాకుండా ఉండేందుకు తన ద్విచక్రవాహనాన్ని రోడ్డుపై నిలిపి బంక్ వద్దకు వెళ్లాడు. ‘‘మా ట్రాక్టర్ వెనుకాల రెండు డ్రమ్ములతో వస్తోంది. 200 లీటర్ల చొప్పున 400 లీటర్ల డీజిల్ నింపాలి. కంప్యూటర్ బిల్లు కాకుండా, చేతితో రాసిన రశీదులు కావాలి’’ అని, బంక్ ఆపరేటర్లతో చెప్పాడు. ఇంతలో ఆ ట్రాక్టర్ రానే వచ్చింది. డీజిల్ కొట్టే గన్ను ఆంగోతు కృష్ణకు ఆపరేటర్ ఇచ్చాడు. బిల్లులు రాసి, ఆ దర్జా బాబుకు ఇచ్చాడు. అతడు ఆ బిల్లులను ట్రాక్టర్ పైకి ఎక్కి కృష్ణకు ఇచ్చాడు. అతని నుంచి రూ.28వేలు తీసుకుని బంక్ బయటకు వచ్చాడు. రోడ్డు పక్కన ఆపిన తన ద్విచక్ర వాహనంపై దర్జాగా వెళ్లిపోయాడు. డీజిల్ పోయించడం పూర్తయింది. ట్రాక్టర్‌తో వెళుతున్న కృష్ణను బంక్ ఆపరేటర్లు ఆపి, ‘‘డబ్బులు ఇవ్వకుండా వెళుతున్నావేం..?’’ అని గట్టిగా అడిగారు. కృష్ణకు నోట మాట రాలేదు. ‘‘అదేమిటి..? ఆయనేగా కొట్టించింది..? బిల్లు కూడా ఇచ్చాడు’’ అన్నాడు. ఈసారి బంక్ ఆపరేటర్లు అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని, ‘‘ఆయన ఎవరో మాకు తెలియదు. మా ట్రాక్టర్ వస్తుంది, డీజిల్ కొట్టాలన్నాడు. చేతితో రాసిన రశీదు బిల్లు కావాలంటే ఇచ్చాం’’ అని చెప్పారు. అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బిల్లు చెల్లించాల్సిందేనన్నారు. ‘‘నువ్వు మోసపోయావ్’’ అని వాళ్లు చెప్పేదాకా, అసలు జరిగిందేమిటో కృష్ణకు అర్థమవలేదు. అతడు లబోదిబోమంటూ కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలో బండి నెంబర్ కనిపించకుండా ఉండేందుకు, తప్పించుకునేందుకు వీలుగా ఆ ‘దర్జా’ మోసగాడు.. ముందుగానే ప్లాన్ ప్రకారంగా తన ద్విచక్ర వాహనాన్ని బంక్ బయట నిలిపాడన్న విషయం.. అప్పుడుగానీ అందరికీ అర్థమైంది. -
కారేపల్లిలో ఉద్రిక్తత
కారేపల్లి: ‘‘గత 40 సంత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న ప్రాంతాన్ని వదిలి పొమ్మంటే.. మేము ఏడికి పోతాం.. చావనైనా చస్తాం కానీ ఇక్కడి నుంచి మాత్రం పోయేదిలేదని’’ పోడు వ్యవసాయం చేసుకుంటున్న మహిళలు అటవీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం తాడేపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ అధికారులను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక మహిళలు అధికారుల మీదకు తిరగబడటంతో పాటు తోపులాటకు దిగడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన కారుల్లో మహిళలు ఎక్కువగా ఉండటంతో.. అధికారులు పెద్ద ఎత్తున మహిళ సిబ్బందిని పిలిపించి ఆందోళనకారులను శాంతింపచేయడానికి యత్నిస్తున్నారు. -
అటవీ అధికారిపై దాడి
కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి అటవీ రేంజ్ పరిధిలో అటవీ శాఖ సిబ్బందిపై ఇద్దరు ప్రజా ప్రతినిధుల భర్తలు దాడి చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు... టాటా ఏస్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న కలపను గేట్‌కారేపల్లి వద్ద శనివారం అర్ధరాత్రి ఫారెస్ట్ రేంజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న కారేపల్లి ఎంపీపీ పద్మావతి భర్త రాందాస్, గ్రామ సర్పంచ్ ఈరి భర్త చిన్నా కలప అక్రమ రవాణాదారులకు మద్దతుగా దారి కాచి పాపకొల్లు సెక్షన్ అధికారి శ్రీనుపై దాడి చేసి గాయపరిచారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రాందాస్, చిన్నాలపై కేసు నమోదు చేశారు. -
తల్లిదండ్రుల విభేదాలు: కూతురు ఆత్మహత్య
కారేపల్లి (ఖమ్మం) : తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఓ యువతిని ఆత్మహత్యవైపు పురిగొల్పాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చింతలతండాకు చెందిన శైలజ (17) ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు చీటికీ మాటికీ గొడవలు పడుతుండడంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ పనికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఏడవ తరగతి వరకు చదివిన శైలజ కూలి పనులకు వెళుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. -
సీసీ కెమెరాలో రికార్డయిన చోరీ
కారేపల్లి (ఖమ్మం జిల్లా) : కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలోని కోటమైసమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. హుండీ పగులగొట్టి సుమారు రూ.15 వేలు అపహరించారు. ఈ చోరీ దృశ్యాలు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
'లంచం, మంచం తీసుకుని తిప్పించుకుంటావా?'
కారేపల్లి (ఖమ్మం) : 'పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం కోసం లంచం, మంచం తీసుకుని రేపు, మాపు అంటూ తిప్పించుకుంటావా?' అని ప్రశ్నించిన రైతుపై ఓ వీఆర్వో చేయిచేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగింది. బాధితుడి కథనం మేరకు... మండలంలోని మాదారం గ్రామానికి చెందిన రైతు గగులోతు మన్సూర్‌కు పది ఎకరాల పొలం ఉంది. దానికి పట్టాదారు పాస్‌పుస్తకం కావాలని అతడు దరఖాస్తు చేసుకున్నాడు. పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు గాను వీఆర్వో సురేందర్ రైతు నుంచి రూ.40వేలు లంచంతోపాటు ఓ డబుల్‌కాట్ మంచం కూడా తీసుకున్నాడు. అయితే పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా ఐదు నెలలుగా తిప్పించుకుంటుండటంతో మన్సూర్ విసుగెత్తిపోయాడు. శనివారం తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని వీఆర్వో సురేందర్‌ను నిలదీశాడు. దీంతో తననే నిలదీస్తావా అంటూ రైతుపై వీఆర్వో దాడి చేశాడు. రెండు చెంపలూ వాయించేశాడు. దీంతో అక్కడున్న రైతులు తిరగబడగా అతడు తహశీల్దార్ చాంబర్లోకి వెళ్లిపోయాడు. అనంతరం బాధిత రైతు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వీఆర్వోపై ఫిర్యాదు చేశాడు. -
కదిలించిన ‘కారేపల్లి’
కళాశాలలో వసతుల కోసం 2006లో హైకోర్టు జడ్జికి విద్యార్థుల వినతి సీరియస్‌గా తీసుకున్న న్యాయస్థానం వసతుల కల్పనకు ఒక్కో కళాశాలకు రూ.2.75 లక్షలు విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ఇప్పుడు అదేబాటలో పాఠశాల వసతులపై పోరాటం సుప్రీం కోర్టు హెచ్చరించినా మారని అధికారుల తీరు జిల్లాలో పర్యటిస్తున్న సుప్రింకోర్టు నియామక బృందం సభ్యులు ఖమ్మం: ఏ ఉద్యమానికైనా.. కార్యసాధనకైనా తొలి అడుగే కీలకం. తమ కళాశాలలో వసతులు లేవని, తాగునీరు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నామని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు తొమ్మిదేళ్ల క్రితం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసిన విన్నపం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పుడు ఆ విద్యార్థులు వేసిన అడుగుతో జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 2.75 లక్షల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అదేబాటలో ఇటీవల పలువురు విద్యార్థులు, వారి తల్లిండ్రులు, సామాజిక వేత్తలు ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు హైకోర్టు, ఆ తర్వాత సుప్రింకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తులు దీనిని సీరియస్‌గా తీసుకొని, తక్షణమే వసతులు కల్పించాలని ఆదేశించారు. అయితే వారి ఆదేశాలను విద్యాశాఖ, అనుబంధ ఎస్ఎస్ఏ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బేఖాతరు చేశారు. దీంతో స్పందించిన సుప్రింకోర్టు వసతుల పరిశీలనకు తమ బృందాన్ని జిల్లాకు పంపించడం గమనార్హం. కదిలించింది కారేపల్లి విద్యార్థులే.. తమ కళాశాలలో మరుగుదొడ్లు, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని 2006-08 విద్యా సంవత్సరంలో కారేపల్లి జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థినులు పలుమార్లు ఆందోళన నిర్వహించారు. తహశీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు వినతిపత్రాలు సమర్పించారు. అయితే ఎవరూ స్పందించకపోవడంతో 2006 నవంబర్ 29న 120 మంది విద్యార్థునుల హైకోర్టు న్యాయమూర్తిని కలిసి తమ ఇబ్బందులను వివరిస్తూ ఫిర్యాదు చేశారు. 2007 జనవరిలో బెంచి పైకి వచ్చిన ఈ ఫిర్యాదును పరిశీలించిన హైకోర్టు జడ్జి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్, ఇంటర్‌బోర్డు సంచాలకులు, కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, కళాశాల ప్రిన్సిపాల్లకు నోటీసులు జారీ చేశారు. తక్షణమే తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ పనులు త్వరతిగతిన జరిగేలా చూడాలని కొత్తగూడెం సీనియర్ సివిల్ జడ్జిని ఆదేశించారు. అయితే దీనిపై అంతగా అధికారులు స్పందించకపోవడంతో పరిస్థితిని వివరిస్తూ కొత్తగూడెం సీనియర్ జడ్జి హైకోర్టుకు నివేదిక పంపించారు. దీనిపై ఆగ్రహించిన కోర్టు.. కళాశాలకు వెళ్లి పరిశీలించాలని ఇంటర్ బోర్డు కమిషనర్ చక్రపాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ అశితోష్మిశ్రాలకు సూచించింది. వారి పరిశీలన అనంతరం ఈ ఒక్క కళాశాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని బావించిన ప్రభుత్వం ఒక్కో కళాశాలకు నీటి వసతికి రూ.75 వేలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 2 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వసతులు లేవని కోర్టులను ఆశ్రయించారు. వీరితో పాటు మన రాష్ట్రానికి చెందిన జేకే రాజు అనే వ్యక్తి 2009లో వచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారమైనా విద్యార్థులకు వసతులు కల్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనితోపాటు దేశవ్యాప్తంగా వచ్చిన పిటిషన్లు పరిశీలించిన సుప్రింకోర్టు.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నేటికీ పలు పాఠశాలలు వసతులకు నోచుకోలేదు. ఈ క్రమంలో జిల్లాలో పర్యటించి పాఠశాలలు తనిఖీ చేయాలని సుప్రింకోర్టు తమ పరిధిలోని బృందాన్ని పంపించింది. శుక్రవారం రాత్రి ఖమ్మం చేరుకున్న బృందం సభ్యులు ఫిబ్రవరి 2 వరకు పలు పాఠశాలలు పరిశీలించనున్నారు. -
ఖాకీచకుడు
-అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్సై -సెల్ టవర్ ఎక్కిన మహిళలు కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేప్లలి ఎస్సై తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, దుర్భాషలాడారంటూ ముగ్గురు మహిళలు గురువారం ఆందోళనకు దిగారు. తమకు జరిగిన అవమానానికి ఆత్మహత్య చేసుకుంటామంటూ కారేపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న సెల్‌టవర్‌పై ఎక్కారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఘర్షణ నేపథ్యంలో మండల పరిధిలోని పాటిమీదిగుంపు గ్రామానికి చెందిన ధారావత్ చంద్రకళ(వికలాంగురాలు), హలావత్ బుజ్జి, బాణోతుబుల్లికి సంబంధించిన తొమ్మిది మందిపై కారేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి వీరిలో జగన్, రవి, వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రోజంతా అక్కడే ఉంచుకుని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో మిగతా ఆరుగురు నిందితులతో పాటు చంద్రకళ, బుజ్జి, బుల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఎస్సై పి.సంతోష్ విచక్షణ కోల్పోయి తొమ్మిది మందిని తీవ్రంగా కొట్టారు. అక్రమంగా కేసులు పెట్టి, తమ వారిని ఎందుకు కొట్టుతున్నారని ప్రశ్నించగా మహిళలు అని కూడా చూడకుండా దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన చంద్రకళ, బుజ్జి, బుల్లి సెల్‌టవర్ ఎక్కారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని, తమ వారిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఇల్లెందు రూరల్ సీఐ డి.రమేష్, ఎస్సై పి.మహేష్, తహశీల్దార్ ఎం.మంగీలాల్, ఎంపీడీఓ పి.అల్బర్ట్, ఎంపీపీ బాణోతు పద్మావతి అక్కడికి చేరుకున్నారు. ‘మీకు న్యాయం చేస్తాం కిందికి దిగండి’ అంటూ ఇల్లెందు రూరల్ సీఐ రమేష్, తహశీల్దార్ మంగీలాల్, ఎంపీపీ పద్మావతి ఆందోళనకారులతో ఫోన్లో మాట్లాడారు. దీంతో ఆ మహిళలు కిందికి దిగారు. -
భర్తల భరతం పట్టిన భార్యలు
ఖమ్మం : హోలీ సందర్భంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సౌమ్యాతండాలో గిరిజన సంప్రదాయ డూండ్ వేడుక అలరించింది. భర్తలకు వాతలు పడేలా భార్యలు కొట్టడమే ఈ వింత ఆచారం. డూండ్ అంటే వెతకటం అని అర్థం. గతేడాది హోలీకి, ఈ హోలీకి మధ్య తండాలో పుట్టిన మగ పిల్లలను పండుగ రోజు తెల్లవారుజూమున 4 గంటలకు ఒకచోట గెరినీలు దాడి పెడతారు. (ఇక్కడ పురుషులను గేర్యాలు అని, స్త్రీలను గేరినీలని అంటారు). గేర్యాలు కర్రలు పట్టుకుని పిల్లలను వెదుకుతుంటారు. పిల్లవాడు దొరకగానే గేర్యా, గేరినీలు కామదహనం చేసి రంగులు పూసుకుంటారు. సాయంత్రం ఇంటి వద్ద ఒక స్తూపాన్ని (గుంజ) పిల్లవాడిని కట్టి, చుట్టూ తినుబండారులను గంగాళాల్లో (బకెట్లు) ఉంచి వాటిని తాళ్లతో కట్టి చుట్టూ గేరీనీలు (భార్యలు) కర్రలతో కాపలా ఉంటారు. వాటిని తీసుకెళ్లడానికి గేర్యాలు (భర్తలు) ప్రయత్నిస్తుంటే గేరినీలు కర్రలతో వారిని కొడుతూ... పాటలు పాడుతూ చుట్టు తిరుగుతారు. ఈ సమయంలో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపిస్తుంది. గేరినీలను చేధించుకొని ఆ గంగాళాలను ఎత్తుకొచ్చిన వారిని ధీరుడిగా గుర్తిస్తారు. -
ఘనంగా డూండ్ వేడుకలు
కారేపల్లి, న్యూస్‌లైన్ : గిరిజన సంప్రదాయంలో వినూత్నమైన వేడుక డూండ్. భార్యలు భర్తలను కర్రలతో కొట్టడమే దీని ప్రత్యేకత. కారేపల్లి మండలం సామ్యాతండాలో సోమవారం సాయంత్రం ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ వేడుక తండాల్లో ఆనందోత్సాహాలను నింపింది. ఈ ఏడాది ఎవరింట్లో జరిగిందంటే..? ఈ యేడాది సామ్యతండాలో భూక్య శ్రీను, మంజుల దంపతుల ఇల్లు ఈ వేడుకలకు వేదికైంది. గత హోలీ తర్వాత వారికి కుమారుడు జన్మించడంతో పండుగ వారింట్లో నిర్వహించారు. ఈ వేడుక తండావాసుల్లో ఆనందోత్సాహాలను నింపడమే కాకుండా తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిందని ఆ తండా గేర్యా వాంకుడోతు తులిస్యా, భూక్య కోట్యా, గేరీనీలు వాంకుడోతు వీరమ్మ, భూక్య పరోస వివరించారు. ఈ కార్యక్రమాన్ని కులపెద్దలు వాంకుడోతు సామ్య, భూక్య సక్రియ, ఈర్యానాయక్ పర్యవేక్షించారు. డూండ్ అంటే... డూండ్ అంటే వెతకడం అని అర్థం. గత హోలీ నుంచి, ఈ ఏడాది హోలీ మధ్యకాలంలో తండాలో ఎవరి కుటుంబంలో మగపిల్లాడు జన్మిస్తాడో.. అతనిని సంప్రదాయబద్ధంగా హోలీ రోజు తెల్లవారు జామున 4 గంటలకు గేరినిలు తండాలో ఒక చోట దాచి పెడ్తారు(ఇక్కడ పురుషులను గేర్యాలు అని, స్త్రీలను గేరినిలని అంటారు.). గేర్యాలు కర్రలు చేబూని ఎక్కడ దాచారో డూన్డ్ (వెతకడం) చేస్తారు. పిల్లవాడు దొరికాకా గేర్యా, గేరినిలు కామదహనం చేసి రంగులు పులుముకుంటారు. అనంతరం సాయంత్రం మగపిల్లాడి ఇంటి వద్ద ఒక స్తూపం (గుంజ) చుట్టూ గంగాళాల్లో తినుబండరాలు ఉంచుతారు. వాటిని తాళ్లతో ఒకదానికొకటి బిగించి గేరినిలు (భార్యలు) కర్రలతో కాపలా కాస్తారు. ఇక గేర్యాలు వాటిని తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు. తినుబండరాల కోసం వచ్చిన గేర్యాలను కర్రలతో కొడుతూ పాటలు పాడుతూ గేరినిలు స్తూపం చుట్టూ తిరుగుతారు. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపిస్తుంది. ఎవరైతే గేరినిలను చేధించుకుని ఆ గంగాళాలను ఎత్తుకొస్తారో వారిని తండాలో ధీరుడిగా గుర్తిస్తారు. అనంతరం ఆ తినుబండరాలను గేర్యా, గేరినిలు రెండు వాటాలుగా వేసుకుని కామదహనం చేసిన చోటికి వెళ్లి, దాన్ని చల్లార్చతారు. అనంతరం ఆ పక్కనే ఉన్న బీడుల్లో తినుబండరాలు ఆరగిస్తారు. దీంతో డూండ్ వేడుక ముగుస్తుంది. -
పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించిన డీఐఓ
కారేపల్లి, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా 2,98,220 మంది చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసే విధంగా లక్ష్యం నిర్ధేశించుకున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డీఐఓ) వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన మండలంలోని పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం కారేపల్లి పీహెచ్సీలో విలేకరులతో మాట్లాడారు. 3,327 పోలియో కేంద్రాలు, 90 మోబైల్ టీంలు, 62 తాత్కాలిక పోలియో కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వైద్య సిబ్బందితో పాటు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ స్వచ్చంధ సేవా సంస్థల నుంచి వలంటీర్లు మొత్తంగా 13,944 మంది ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. గోదావరి నది పరివాహాక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలైన రేఖపల్లి, జీడికుప్ప, పోచారం, పేరాంటాలపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో రెండు లాంచీ లను, పర్ణశాల, అమలారం, ఏలూరి, తిప్పకుప్ప గ్రామాలకు మూడు బోట్లను ఏర్పాటుచేసి చిన్నారులకు పోలి యో చుక్కలను వేసినట్లు ఆయన తెలిపారు. కొండరెడ్లు, ఆదివాసీలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక వలంటీర్లను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. వచ్చే నెల 11వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ)ద్వారా దేశానికి ఫ్రీ పోలి యో సర్టిఫికెట్‌ను ప్రధాన మంత్రి, రాష్ట్రపతిల చేతుల మీదుగా ఢిల్లీలో అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు కారేపల్లి పీహెచ్సీలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వీరి వెంట కారేపల్లి ప్రాజెక్టు సీడీపీఓ విజయలక్ష్మి, వైద్యురాలు నాగమణి, ల్యాబ్ టెక్నిషియన్ జియావుద్దీన్‌లు ఉన్నారు. -
వీఎస్పీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలి
కారేపల్లి, న్యూస్‌లైన్: ఉద్యోగాలు ఇస్తామంటూ ఆశ చూపి రైతుల వ్యవసాయ భూములను విశాఖ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) యాజమాన్యం లాక్కుని, వారిని కూలీలుగా మార్చిందని వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే (టీఆర్ఎస్) డాక్టర్ తాటికొండ రాజయ్య విమర్శించారు. మాధారం డోలమైట్ మైన్ ముందు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన భూనిర్వాసితులకు ఆయన బుధవారం సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మాధా రం రెవెన్యూ పరిధిలో 227 మందికి చెందిన 927 ఎకరాలను రైతుల నుంచి వీఎస్పీ లాక్కుని, కూలీలుగా మార్చిందని విమర్శించారు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసగిస్తున్న వీఎస్పీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆం ధ్రకు తరలిస్తున్న డోలమైట్ ఉత్పత్తిని అడ్డుకుంటామని హెచ్చరించారు. మాధా రం మైన్ ద్వారా మండలానికి రావాల్సిన రాయల్టీని వీఎస్పీ యాజమాన్యం విస్మరించిందని విమర్శించారు. నాణ్యమైన డోలమైట్‌ను అందిస్తున్న మాధారం గ్రామాన్ని దత్తత తీసుకోకపోవడం దాని దుర్మార్గానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తెలంగాణ ఖనిజ సంపదను కొల్లగొడుతూ, ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించిన ఆంధ్ర పాలకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తరువాత భూనిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేత ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్ళినట్టు చెప్పారు. అనంతరం.. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్‌కు ఫోన్ చేసి భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, నాయకులు దేవీలాల్, బొమ్మెర రామ్మూర్తి, సోమందుల నాగరాజు, చందూనాయక్, కడారి వెంకట్, వీర్యానాయక్, పెద్దబోయన సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
అయ్యో తల్లీ.. ఎంత పని చేశావ్..!
ఉసిరికాయలపల్లి (కారేపల్లి), న్యూస్‌లైన్: భర్తతో తరచూ గొడవలు.. తీవ్ర మానసిక వేదన తట్టుకోలేని ఓ వివాహిత పురుగు మందు తాగింది. తనను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న భర్త- తన బిడ్డడిని అనాధగా మారుస్తాడన్న భయంతోనో.. మరే కారణంతోనో.. నాలుగేళ్ల వయసున్న తన కుమారుడికి కూడా కొద్దిగా పురుగు మందు తాగించింది. ఆమె మృతిచెందింది. ఆ పిల్లాడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు... ఉసిరికాయలపల్లి గ్రామస్తుడు పచ్చిపాల శ్రీనివాస్‌కు తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన లక్ష్మి(25)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల వయసున్న కుమారుడు (నాగసాయి) ఉన్నాడు. ఇల్లెందు మండలంలో గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్గా కాంట్రాక్ట్ పద్ధతిన శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. అతడు ప్రతి రోజు ఉసిరికాయలపల్లి నుంచి ఇల్లెందకు రాకపోకలు సాగిస్తున్నాడు. అతను మరో యువతితో వివాహేతర సంబంధం సాగిస్తూ, లక్ష్మిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీనిపై అతనిని లక్ష్మి పలుమార్లు నిలదీసింది. ఇదే విషయమై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై గ్రామ పెద్దలు పలుమార్లు పంచాయతీ నిర్వహించి శ్రీనివాస్‌ను మందలించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసుగెత్తిన లక్ష్మి.. తీవ్ర మానసిక ఆందోళనతో శుక్రవారం భర్త ఇంటిలో లేని సమయంలో తన నాలుగేళ్ళ కుమారుడు నాగసాయికి కొద్దిగా పురుగు మందు తాగించి, ఆ తరువాత తాను కూడా తాగి, ఇంటి ఆరుబయట మంచంపై పడుకుంది. నాగసాయి ఏడుస్తుండడాన్ని చుట్టుపక్కల వారు చూసి, ఇంట్లోకి వచ్చారు. మంచంపై లక్ష్మి అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించి, ఇల్లందు ఆసుపత్రికి తరలించారు. చికి త్స చేస్తుండగానే ఆమె మృతిచెందింది. అప్పటికే నాగసాయి పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. 5 తెలంగాణపై కాంగ్రెస్ కొత్త నాటకాలు ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ కొత్త నాటకాలకు తెర లేపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిద్ది వెంకటేశ్వర్లు విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం ఖమ్మంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో సిద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- ఒకపక్క రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూనే.. మరోపక్క సీమాంధ్రులతో ఆందోళన చేయిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలపై నాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణపై కాంగ్రెస్ వెనుకడుగు వేస్తే అది ఈ ప్రాంతంలో భూస్థాపితమవుతుందని అన్నారు. భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణలోనిదేనని అన్నారు. గడిచిన పదేళ్లలో దేశ ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బీజేపీకి కూడా అనుకూల వాతావరణం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశంలో మూడో ప్రత్యామ్నాయం అవసరమని అన్నారు. రాష్ట్ర మంత్రులు రెండు ప్రాంతాలవారీగా విడిపోయి ప్రజాసమస్యలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఇటీవలి వర్షాలతో పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వ ఆసక్తి చూపడం లేదని ధ్వజమెత్తారు. బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపూరి బ్రహ్మం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి సాబీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో రైతు మృతి
కారేపల్లి, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట వర్షార్పణం కావడంతో మనోవేదనతో గుండె పగిలి ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని పేరుపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన గడ్డికొప్పుల రామయ్య(52) తనకు ఉన్న మూడెకరాల పొలంలో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. అలాగే ఎకరా రూ. 8వేల చొప్పున మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని 3 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. ఈ పంటల సాగు కోసం రూ. 1.20లక్షల అప్పు చేశాడు. ఈ మొత్తం, గత ఏడాది అప్పులు కలిపి మొత్తం రూ. 2లక్షల మేర అప్పులు చేశాడు. ఈ క్రమంలో ఒలిచిన మొక్కజొన్న పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొలకలు వచ్చాయి. అలాగే పత్తి తడిసి ముద్దయింది. దీంతో అతను తీవ్ర మనోవేదనతో ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లి వచ్చిన రామయ్య ఇంటి ఎదుట ఆరబోసిన మొక్కజొన్నను చూశాడు. అవి మొలకలు వచ్చి ఉండడంతో మనస్తాపంతో దానిపై పడి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య రామనర్సమ్మ, కుమారులు ఉపేందర్, శ్రీహరి ఉన్నారు. కుమార్తె నాగలక్ష్మికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెద్ద కుమారుడు ఉపేందర్ 9వ తరగతి వరకు చదివి తండ్రికి వ్యవసాయంలో సహాయపడుతున్నాడు. చిన్న కుమారుడు పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడికి వృద్ధురాలైన తల్లి శాంతమ్మ ఉంది. ఇంటి పెద్ద గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. సంఘటన స్థలానికి పేరుపల్లి వీఆర్వో గుమ్మడి రాములు సందర్శించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.