- కళాశాలలో వసతుల కోసం 2006లో హైకోర్టు జడ్జికి విద్యార్థుల వినతి
- సీరియస్‌గా తీసుకున్న న్యాయస్థానం
- వసతుల కల్పనకు ఒక్కో కళాశాలకు రూ.2.75 లక్షలు విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
- ఇప్పుడు అదేబాటలో పాఠశాల వసతులపై పోరాటం
- సుప్రీం కోర్టు హెచ్చరించినా మారని అధికారుల తీరు
- జిల్లాలో పర్యటిస్తున్న సుప్రింకోర్టు నియామక బృందం సభ్యులు
ఖమ్మం: ఏ ఉద్యమానికైనా.. కార్యసాధనకైనా తొలి అడుగే కీలకం. తమ కళాశాలలో వసతులు లేవని, తాగునీరు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నామని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు తొమ్మిదేళ్ల క్రితం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసిన విన్నపం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పుడు ఆ విద్యార్థులు వేసిన అడుగుతో జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 2.75 లక్షల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది.
అయితే అదేబాటలో ఇటీవల పలువురు విద్యార్థులు, వారి తల్లిండ్రులు, సామాజిక వేత్తలు ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు హైకోర్టు, ఆ తర్వాత సుప్రింకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తులు దీనిని సీరియస్‌గా తీసుకొని, తక్షణమే వసతులు కల్పించాలని ఆదేశించారు. అయితే వారి ఆదేశాలను విద్యాశాఖ, అనుబంధ ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు బేఖాతరు చేశారు. దీంతో స్పందించిన సుప్రింకోర్టు వసతుల పరిశీలనకు తమ బృందాన్ని జిల్లాకు పంపించడం గమనార్హం.
కదిలించింది కారేపల్లి విద్యార్థులే..
తమ కళాశాలలో మరుగుదొడ్లు, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని 2006-08 విద్యా సంవత్సరంలో కారేపల్లి జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థినులు పలుమార్లు ఆందోళన నిర్వహించారు. తహశీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు వినతిపత్రాలు సమర్పించారు. అయితే ఎవరూ స్పందించకపోవడంతో 2006 నవంబర్ 29న 120 మంది విద్యార్థునుల హైకోర్టు న్యాయమూర్తిని కలిసి తమ ఇబ్బందులను వివరిస్తూ ఫిర్యాదు చేశారు. 2007 జనవరిలో బెంచి పైకి వచ్చిన ఈ ఫిర్యాదును పరిశీలించిన హైకోర్టు జడ్జి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్, ఇంటర్‌బోర్డు సంచాలకులు, కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, కళాశాల ప్రిన్సిపాల్‌లకు నోటీసులు జారీ చేశారు. తక్షణమే తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
ఈ పనులు త్వరతిగతిన జరిగేలా చూడాలని కొత్తగూడెం సీనియర్ సివిల్ జడ్జిని ఆదేశించారు. అయితే దీనిపై అంతగా అధికారులు స్పందించకపోవడంతో పరిస్థితిని వివరిస్తూ కొత్తగూడెం సీనియర్ జడ్జి హైకోర్టుకు నివేదిక పంపించారు. దీనిపై ఆగ్రహించిన కోర్టు.. కళాశాలకు వెళ్లి పరిశీలించాలని ఇంటర్ బోర్డు కమిషనర్ చక్రపాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ అశితోష్‌మిశ్రాలకు సూచించింది. వారి పరిశీలన అనంతరం ఈ ఒక్క కళాశాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని బావించిన ప్రభుత్వం ఒక్కో కళాశాలకు నీటి వసతికి రూ.75 వేలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 2 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వసతులు లేవని కోర్టులను ఆశ్రయించారు.
వీరితో పాటు మన రాష్ట్రానికి చెందిన జేకే రాజు అనే వ్యక్తి 2009లో వచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారమైనా విద్యార్థులకు వసతులు కల్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనితోపాటు దేశవ్యాప్తంగా వచ్చిన పిటిషన్లు పరిశీలించిన సుప్రింకోర్టు.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నేటికీ పలు పాఠశాలలు వసతులకు నోచుకోలేదు. ఈ క్రమంలో జిల్లాలో పర్యటించి పాఠశాలలు తనిఖీ చేయాలని సుప్రింకోర్టు తమ పరిధిలోని బృందాన్ని పంపించింది. శుక్రవారం రాత్రి ఖమ్మం చేరుకున్న బృందం సభ్యులు ఫిబ్రవరి 2 వరకు పలు పాఠశాలలు పరిశీలించనున్నారు.