- మంత్రి వినయ్ కుమార్ సొరకె వెల్లడి ..
- పట్టణ, గ్రామాల్లోని అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తాం
- ఆ మేరకు రెవెన్యూ చట్టంలో సవరణలు
- ఇకపై అక్రమాలకు తావు లేకుండా కఠిన చర్యలు
- పట్టణాల్లో పరిశుభ్రత, తాగునీటికి రూ.700 కోట్లతో పథకం
- మహానగర పాలికెలుగా రామనగర, చెన్నపట్టణ !
- పాలికెలలో ఖాళీలు దశల వారీగా భర్తీ
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు సంబంధించిన ‘అక్రమ-సక్రమ’ను హైకోర్టు ఆదేశాల మేరకు అమలు చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినయ్ కుమార్ సొరకె తెలిపారు. వికాస సౌధలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మట్లాడుతూ పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో 2013 అక్టోబర్ 19 లోపు అక్రమంగా నిర్మించిన భవనాలను జరిమానా విధించి క్రమబద్ధీకరిస్తామని చెప్పారు.
దీనిపై రెవెన్యూ చట్టంలో కొన్ని సవరణలు కూడా చేశామన్నారు. దీనిని హైకోర్టుకు నివేదించామన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు రాజకీయ నాయకులతో పాటు కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులూ కారణమన్నారు. ఇక మీదట ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని వెల్లడించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి కలెక్టర్ల ఆధ్వర్యంలో అమలు చేయనున్నామని తెలిపారు.
కాగా పట్టణాల్లో పరిశుభ్రత, మంచినీటి సరఫరా కోసం రూ.700 కోట్లతో కొత్త పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. గుల్బర్గ, హుబ్లీ, ధార్వాడ నగరాల్లో 24 గంటలూ నీటి సరఫరాకు వీలుగా ఓ పథకం రూపొందించనున్నామన్నారు. రామనగర, చన్నపట్టణలను మహానగర పాలికెలుగా స్థాయి పెంచే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. పట్టణాల్లో నీటి సరఫరా, మురుగు నీటి శుద్ధీకరణ కోసం రూ.250 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. మహానగర పాలికెలలో ఖాళీగా ఉన్న దాదాపు ఆరు వేలకు పైగా పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.