కోర్టుహాలులో ఎర్రచుక్కల నిమ్మకాయ
బెంగళూరు : రాష్ర్ట అత్యున్నత న్యాయస్థానంలో ఓ నిమ్మకాయ కలకలం సృష్టించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో జస్టీస్ సి.ఆర్ కుమారస్వామితో కూడిన ప్రత్యేక న్యాయ పీఠ విభాగం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేసు విచారణ జరుపుతున్న హాలులో జయలలితకు విరుద్ధంగా వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవానీసింగ్ కుర్చీ కింద ఒక నిమ్మకాయ కనిపించింది. దానిపై రెండు ఎర్రటి రంగు గల చుక్కలు కూడా ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజలతో పాటు న్యాయవాదులు కూడా ఆ నిమ్మకాయ గురించి, భవానీసింగ్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.
కర్ణాటకలో దైవ పూజలతోపాటు కొన్ని రకాల క్షుద్ర పూజలు కూడా ఎక్కువగా నిర్వహిస్తారనే ప్రచారం ఉంది. విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకునే లోపే కోర్టు సిబ్బంది అక్కడి నుంచి నిమ్మకాయను తీసివేశారు.
తుది దశకు కేసు విచారణ...
జయలలిత ఆస్తుల కేసుకు సంబంధించి కేసు విచారణ తుది దశకు చేరుకుంది. కేసుకు సంబంధించిన వాదనల్లో భాగంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవానిసింగ్ తన తుది వాదనలను కోర్టుకు శుక్రవారం వినిపించారు. ఇప్పటికే ఆస్తుల కేసుకు సంబంధించి జయలలితకు కింది కోర్టులో శిక్ష ఖరారు అయినట్లు ఈ సందర్భంగా న్యాయమూర్తికి ఆయన గుర్తుచేశారు.
కాగా, జయలలిత తరుఫున వాదిస్తున్న నాగేశ్వర్‌రావు కూడా సంక్షిప్తంగా తన వాదనలను లిఖిత పూర్వకంగా న్యాయమూర్తికి అందజేశారు. అనంతరం న్యాయమూర్తి కుమారస్వామి మాట్లాడుతూ... జయలలిత అక్రమ ఆస్తులకు సంబంధించి మొదటిసారిగా కేసు దాఖలు చేసిన సుబ్రహ్మణ్యం లిఖిత పూర్వక వాదనలను ఈనెల 9న (సోమవారం) కోర్టుకు సమర్పిస్తున్నారని ఇరువురి న్యాయవాదులకు తెలియజేశారు. అదేవిధంగా తుది వాదనలు కూడా లిఖిత పూర్వకంగా కోర్టుకు రానున్న సోమవారం సమర్పించాలని నాగేశ్వరరావుకు ఈ సందర్భంగా న్యాయమూర్తి సూచించారు. తాను కూడా అదే రోజున కేసు తీర్పును రిజర్వ్ చేస్తానని పేర్కొన్నారు.