సాక్షి, కారేపల్లి(ఖమ్మం) : ఒకప్పుడు చుట్టుపక్కల 40 గ్రామాల రైతులకు బంగారం, వెండి వస్తువులు తాకట్టు పెట్టుకుని పెట్టుబడులు అందించిన ఓ షావుకారి ఇల్లు నేడు శిథిలావస్థకు చేరగా..అక్కడ ఓ నిధితో కూడిన ఇనుప పెట్టె లభ్యమైనట్లు స్థానికంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. కారేపల్లి మసీదు రోడ్డులో గల షావుకారి, స్వాతంత్ర సమరయోధుడు యర్రా రామలింగయ్య నివాసం శిథిలమైంది. వీరి కుమారులు ఒకరు కారేపల్లి మెయిన్ రోడ్డులో నివాసం ఉంటుండగా, మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయ్యి హన్మకొండలో స్థిరపడ్డారు.
30 రోజుల ప్రణాళిక కార్యాచరణలో భాగంగా సింగరేణి పంచాయతీ సిబ్బంది.. ఆదివారం సాయంత్రం జేసీబీతో ఈ పాడుబడిన ఇంటిని కూల్చేశారు. మట్టిని తొలగిస్తుండగా..ఓ ఇనుప పెట్టె బయట పడిందని, దానికి ఓ తాళం వేసి ఉందని, గమనించిన జేసీబీ, ట్రాక్టర్ డ్రైవర్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చారని సమాచారం. ఈ క్రమంలోనే పాడుపడ్డ ఇంటికి సమీపంలో ఉన్న మరో నివాసం వారు వచ్చి ఆ పెట్టెను తమ ఇంట్లో భద్రపరుచుకున్నారని, అందులో బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయని, ఐదుగురికి పంపకాల్లో తేడాలు రావడంతో..విషయం బయటకు పొక్కిందని చర్చ జరుగుతోంది. కారేపల్లిలో ఇది చర్చనీయాంశంగా మారింది.
ఈ పుకార్లు పోలీసులకూ చేరడంతో అసలు వాస్తవమేనా..? లేక కావాలని పుకార్లు సృష్టించారా..? అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే..యర్రా రామలింగయ్య కుమారుడు యర్రా వెంకటరమణ స్థానిక విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. ‘ ఇంట్లో నాపరాళ్ల కింద ఇనుప పెట్టె ఉన్నదని..మా అమ్మకు మా నాన్నమ్మ చెప్పిందని, పలు సందర్భాల్లో ఒక చోట నాపరాళ్లు తీసి తవ్వినా కన్పించలేదని, ఒక వేళ నిధి దొరికితే..వారసులమైన తమకు లేదా ప్రభుత్వానికి చెందాలి’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment